ఉన్నత పదవుల కోసం ఢిల్లీకి ఆశావహులు
సోనియాను కలిసిన మునియప్ప
కేపీసీసీ చీఫ్ కోసం యత్నాలు
మంత్రి పదవి కోసం మోటమ్మ కూడా
బెంగళూరు: అధికార కాంగ్రెస్ పార్టీలో దళిత గళం ప్రతిధ్వనిస్తోంది. అటు పార్టీతో పాటు ఇటు ప్రభుత్వంలో ఉన్నత పదవులు దక్కించుకోవ డానికి ఆశావహులు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరుపుతుండగా మరికొం త మంది దళిత నాయకులకు కీలక పదవులు దక్కాల్సిందేనంటూ బహిరంగంగా పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి మార్పుతో పాటు మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణ జరగనున్నట్లు సమాచారం. అంతేకాకుండా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ జీ పరమేశ్వర్ పదవీకాలం కూడా ఇప్పటికే పూర్తయ్యింది. దీంతో కేపీసీసీ అధ్యక్షస్థానానికి కూడా నూతన నాయకుడిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలో దళితులకు సరైన పదవులు దక్కలేదన్న విషయం ఆ పార్టీకి చెందిన నాయకులే బహిరంగంగా పేర్కొంటున్నారు. దీంతో పదవుల పంపకాలకు సమయం సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలోని దళిత వర్గానికి చెందిన పలువురు నాయకులు సదరు పదవులను దక్కించుకోవడానికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తున్నారు.
ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్...
పార్లమెంటు సభ్యుడైన కే.హెచ్ మునియప్ప గత శాసనసభ ఎన్నికల సమయంలోనే కేపీసీసీ అధ్యక్ష పదవి కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అయితే చివరికి ఆ పదవి పరమేశ్వర్‌ను వరించింది. అయితే ప్రస్తుతం పరమేశ్వర్ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో తిరిగీ ఆ పదవి కోసం కే.హెచ్. మునియప్ప తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఢిల్లీలో ఆమె నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తనకు కేపీసీసీ పదవి ఇవ్వాలని అభ్యర్థించడంతో పాటు ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ‘దళిత సీఎం’ ఆవశ్యకత తదితర విషయాలను కూడా కే.హెచ్ మునియప్ప ‘మేడం’కు వివరించారు. భేటీ అనంతరం మునియప్ప మీడియాతో మాట్లాడుతూ...‘నేను ఏడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాను. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నాను. రాష్ట్ర రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. సీనియర్ నాయకుల మద్దతు నాకే ఉంది. అందువల్ల నాకు కేపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందిగా హైకమాండ్‌ను కోరాను. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని కేపీసీసీ పదవి అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని సోనియాగాంధీ తెలిపారు. ఆ పదవి నాకే దక్కుతుందని నమ్మకంతో ఉన్నా.’ అని పేర్కొన్నారు. అదేవిధంగా శాసనమండలి సభ్యురాలు, మాజీ మంత్రి మోటమ్మ కూడా సోనియాగాంధీని బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యి మంత్రి మండలిలో తనకు అవకాశం కల్పించాల్సిందిగా కోరారు.