బెల్గాం మనదే..
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు/మైసూరు : కర్ణాటకలో బెల్గాం అంతర్భాగమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మహాజన్ నివేదికను అనుసరించి బెల్గాం ఎప్పటికీ కర్ణాటకలోనే ఉంటుందన్నారు. మైసూరులో స్థానిక మీడియా ప్రతినిధులతో ఆయన ఆదివారం మాట్లాడారు. ఈ విషయంలో మహారాష్ట్ర అనవసర రాద్ధాంతం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలని మాజీ మంత్రి ఉమేష్‌కత్తి పేర్కొనడాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తప్పుపట్టారు. అఖండ కర్ణాటక ప్రతి ఒక్క కన్నడిగుడి కల అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటకను విభజించే ప్రసక్తే లేదన్నారు. స్థానిక సంస్థలతోపాటు వివిధ బోర్డులు, కార్పొరేషన్లలో 50 శాతం పోస్టులు మహిళలకు కేటాయించాలనేది తనతోపాటు తమ పార్టీ అభిమతమన్నారు. ఈ విషయంలో గవర్నర్ వజూభాయ్ రుడాభాయ్ వాలా సలహా తీసుకుంటామని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై నేడు (సోమవారం) బెంగళూరులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇందులో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరమేశ్వర్ కూడా పాల్గొననున్నారని తెలిపారు. పరమేశ్వర్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వకూడదని తాను పార్టీ హై కమాండ్‌కు లేఖ రాశానన్నది ఆధార రహితమని అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరకర్ణాటక ప్రాంతంలో ఏర్పడిన అతివృష్టి వల్ల నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకునేందుకు రూ.426 కోట్ల పరిహారాన్ని అందించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాశానన్నారు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పడిన కరువు పరిస్థితులపై కేంద్రానికి మరో నివేదిక పంపించనున్నట్లు చెప్పారు. దసరా ఉత్సవాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోబోదన్నారు. ఈ విషయంలో మైసూరు జిల్లా అధికారులతోపాటు ఉత్సవాల నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీదే అంతిమ నిర్ణయమని సిద్ధరామయ్య పేర్కొన్నారు.