బెంగళూరును చీల్చద్దు
బనశంకరి : నాడప్రభు కెంపేగౌడ నిర్మించిన బెంగళూరు మహానగరాన్ని పాలన పేరుతో చీల్చవద్దంటూ మాజీ డిప్యూటీ సీఎం ఆర్ అశోక్ కోరారు. ఆదివారం పద్మనాభనగర విధానసభ నియోజకవర్గం పరిధిలోని బనశంకరి వార్డు (180) ఎమ్మెల్యే కార్యాలయ ఆవరణలో పథకాల లబ్ధిదారులకు పత్రాలను అందజేసిన ఆయన మాట్లాడారు. బెంగళూరు నగరాన్ని విభజిస్తే నగరసభగా మారుతుందని, నగరం ఒక్కటిగా ఉంచి అభివృద్ధి చేయాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో బెంగళూరు నగరాన్ని చాలా అభివృద్ధి చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
ప్రభుత్వం అందించే పథకాలు అర్హులకు అందినప్పుడే ఆ పథకం విజయవంతమైనట్లని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా వారిని జాగృతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఏహెచ్.బసవరాజ్, బనశంకరి వార్డు బీజేపీ శాఖాధ్యక్షుడు మంజునాథ్, కరిసంద్ర వార్డు బీజేపీ అధ్యక్షుడు వెంకటేశ్, పార్టీ నేతలు నారాయణస్వామి, విశ్వనాథ్, రాజేశ్, శేఖర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.