-కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాలి
-ఆగస్టు 2న తలపెట్టిన ప్రత్యేక హోదా రాష్ట్ర బంద్‌కు మద్దతు
-నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యస్వామి
గుంటూరు ఎడ్యుకేషన్
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో విఫలమైన టీడీపీ-బీజేపీలను ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొడతారని నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.అయ్యస్వామి చెప్పారు. గుంటూరు బ్రాడీపేటలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో అయ్యస్వామి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను బీజేపీ తుంగలో తొక్కి ప్రజలను మోసగించిందన్నారు.
ఆ పార్టీకి మద్దతు ఉపసంహరించుకుని తక్షణమే రాష్ట్రానికి చెందిన టీడీపీ కేంద్ర మంత్రులు, ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోరుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 2న పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. 13 జిల్లాల విద్యార్థులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాన్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పికట్ల శ్రీహరినాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకుండా ప్రజలను మోసగించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీఎం చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు.
సీఎంకు నైతికత ఉంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగి, ప్రత్యేక హోదా కోసం పోరాడాలని సూచించారు. హోదా కల్పించని పక్షంలో రాష్ట్రంలో బీజేపీకి రాజకీయంగా మనుగడ లేకుండా పోతుందని హెచ్చరించారు. సమావేశంలో గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కె.పాండునాయక్, ఐహెచ్‌ఆర్‌సీ డెరైక్టర్ రావూరి బలరామ్, విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ పాల్గొన్నారు.