The state shutdown
-
టీడీపీ, బీజేపీలను ప్రజలు తరిమికొడతారు
-కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాలి -ఆగస్టు 2న తలపెట్టిన ప్రత్యేక హోదా రాష్ట్ర బంద్‌కు మద్దతు -నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యస్వామి గుంటూరు ఎడ్యుకేషన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో విఫలమైన టీడీపీ-బీజేపీలను ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొడతారని నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.అయ్యస్వామి చెప్పారు. గుంటూరు బ్రాడీపేటలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో అయ్యస్వామి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను బీజేపీ తుంగలో తొక్కి ప్రజలను మోసగించిందన్నారు. ఆ పార్టీకి మద్దతు ఉపసంహరించుకుని తక్షణమే రాష్ట్రానికి చెందిన టీడీపీ కేంద్ర మంత్రులు, ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోరుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 2న పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. 13 జిల్లాల విద్యార్థులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాన్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పికట్ల శ్రీహరినాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకుండా ప్రజలను మోసగించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీఎం చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు. సీఎంకు నైతికత ఉంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగి, ప్రత్యేక హోదా కోసం పోరాడాలని సూచించారు. హోదా కల్పించని పక్షంలో రాష్ట్రంలో బీజేపీకి రాజకీయంగా మనుగడ లేకుండా పోతుందని హెచ్చరించారు. సమావేశంలో గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కె.పాండునాయక్, ఐహెచ్ఆర్సీ డెరైక్టర్ రావూరి బలరామ్, విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ పాల్గొన్నారు. -
జెండా, అజెండా పక్కనపెట్టి..
‘10న బంద్’పై ఒక్కటైన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు హైదరాబాద్: ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 10న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను ఉమ్మడిగా విజయవంతం చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. జెండా, అజెండా పక్కనబెట్టి మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు బంద్‌పై దృష్టి సారించాయి. ఈ మేరకు ఆ పార్టీల నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ బంద్ విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం శాసనసభ ఆవరణలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి సమావేశమయ్యారు. బంద్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నందున ప్రజలు కూడా పూర్తిగా బంద్‌లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. రైతులకు అండగా నిలిచి వారికి భరోసా కల్పించేందుకు రుణమాఫీని ఏక మొత్తంగా అమలు చేయాలన్న డిమాండ్‌తో బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. రైతులకు జీవితంపై నమ్మకం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రోజుకు పది మంది దాకా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం మినహా వివిధ రాజకీయ పక్షాలకు చెందిన 30 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం, రైతు సమస్యలను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తున్నామని తెలిపారు. అఖిల పక్షాలు తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని విద్య, వ్యాపార, రవాణా సంస్థలకు పిలుపునిచ్చారు. -
హోదా ప్రకటించే దాకా పోరాటం
రేపటి బంద్ విజయవంతం చేయండి వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ విశాఖపట్నం: ప్రత్యేక హోదా ప్రకటించే దాకా పార్టీ పోరాటం చేస్తుంది.. 29న చేపట్టే రాష్ట్ర బంద్ మా పార్టీ బలోపేతానికో, అధికారం కోసమో కాదు.. రాష్ట్రాభివృద్ధి కోసం.. భావితరాల కోసం..రాష్ట్ర ప్రజలు, మేధావులు, కార్మిక వర్గాలు బంద్‌కు సహకరించాలి’ అని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం నగర పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో హోదాకు అవసరమైన చట్టాలను పెట్టారని, రాష్ట్రంలో ఏర్పాటవుతున్న విద్యాసంస్థలు చట్టంలోనివేనని స్పష్టం చేశారు. చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయకపోతే పోరాడతామన్నారు. ప్రత్యేక హోదా పదేళ్లుండాలని రాజ్యసభలో నిలదీసిన వెంకయ్యనాయుడు ఇప్పుడెందుకు ప్రజలను మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీలు గత ఎన్నికల్లో ప్రత్యేక హోదాతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీనిచ్చాయని, అధికారంలోకి వచ్చి 14 నెలలయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తెస్తూనే ఉన్నారని, వేలాది మందితో ఢిల్లీలో ధర్నా కూడా చేశారని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీలు లోక్‌సభలో ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తే టీడీపీ ఎంపీలు అవహేళన చేశారని గుర్తు చేశారు. తమ పార్టీకి పదవులు ముఖ్యం కాదని, ప్రజలే ముఖ్యమని, వారి కోసం ఏ త్యాగాలకైనా, అవసరమైతే పదవులకు రాజీనామాలకైనా సిద్ధమేనన్నారు. రాబోయే తరం పిల్లల భవిష్యత్ బాగుండాలన్నా, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు రావాలన్నా ప్రత్యేక హోదా అవసరమని, ఇది రాష్ట్రానికి సంజీవనేనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ బీహార్‌కు రూ. ల క్షా 25 వేల కోట్లను ప్రకటించినా ఆ రాష్ట్ర సీఎం తమకు ప్యాకేజీ వద్దని, ప్రత్యేక హోదాయే కావాలంటున్నారంటే హోదా వల్ల చేకూరే ప్రయోజనాలను గమనించాలన్నారు. బంద్‌కు వామపక్షాలు కూడా మద్దతునిస్తున్నాయన్నారు. 29 నాటి రక్షాబంధన్ రాష్ట్రం మేలు కోసం కట్టే రక్షాబంధన్ కావాలని జగన్మోహన్రెడ్డి ఆకాంక్షిస్తున్నారన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలను నివారించలేని చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తామనడం హాస్యాస్పదమన్నారు. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, నియోజకవర్గ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
‘హోదా’ కోసం కదన పథం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఈనెల 29న పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌ను జిల్లాలో విజయవంతం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఉద్యోగులతో పాటు వ్యాపార, వాణిజ్య, కార్మిక వర్గాలను కూడగట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయమై చర్చించేందుకు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు కాకినాడలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి పార్టీ జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరు కానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యవర్గసభ్యులు పాల్గొననున్నారు. జేఎన్టీయూలో సమావేశం ఏర్పాట్లను శనివారం సాయంత్రం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పరిశీలించారు. అనంతరం నేతలతో సమావేశమై చర్చించారు. వారితో పాటు కాకినాడ రూరల్, పెద్దాపురం, రాజోలు కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, తోట సుబ్బారావునాయుడు, బొంతు రాజేశ్వరరావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, జ్యోతుల రాజబాబు, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, నాయకులు భోపాలపట్నం ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యం..
మహారాణిపేట: ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు 29న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను కూడగట్టుకుని విజయవంతం చేయాల్సిన బాధ్యత పార్టీ నేతలు, కార్యకర్తలపై ఉందన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో నగర పార్టీ నేతలు, కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బంద్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో అరెస్టు చేస్తారనే భయంతోనే సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం పట్టుబట్టడం లేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. విభజన బిల్లులో ఉన్న ప్రత్యేక హోదా తేవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను పక్కదోవ పట్టించేందుకే చంద్రబాబు తన ఎంపీలతో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చెప్పిస్తున్నారని దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లా నగరిలో ధర్నా చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పోలీసులతో దౌర్జన్యం చేయించడం టీడీపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తెలియజేస్తోందన్నారు. ధర్నాలు చేసేందుకు ప్రతిపక్షాలు, ప్రజలకు ఉన్న ప్రజాస్వామ్య హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. బంద్‌ను అడ్డుకునేందుకు టీడీపీ తమ పార్టీ నేతలను ముందస్తు అరెస్టులకు కుట్రపన్నుతోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు కుట్రను తిప్పికొడతామని రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంతవరకు పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఆ పార్టీ నేతలకు నిజంగా రాష్ట్రాభివృద్ది పైగాని ప్రజాసంక్షేమం పై గాని శ్రద్ధ ఉంటే ప్రత్యేకహోదా కోసం రాష్ట్రబంద్‌కు సహకరించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కలిసి రావాలని సవాల్ విసిరారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రబంద్‌కు జిల్లాలో ఉన్న అన్ని వర్గాలూ పార్టీకతీతంగా కలిసి రావాలన్నారు. మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, మళ్ల విజయ్ ప్రసాద్, తైనాల విజయ్‌కుమార్, గురుమూర్తిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడి, నియోజకవర్గ సమన్వయకర్తలు కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, వంశృకృష్ణలు మాట్లాడుతూ బంద్‌ను జయప్రదం చేసేందుకు సమష్టిగా పని చేస్తామన్నారు. సీఈసీ సభ్యుడు దామా సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి జి.రవిరెడ్డి, ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి చల్లా మధు, అనుబంధ విభాగాల అధ్యక్షులు విల్లూరి భాస్కరరావు, ఉషాకిరణ్, పక్కి దివాకర్, ఎండీ షరీఫ్, బోని శివరామకృష్ణ, పార్టీ నేతలు సత్తి రామకృష్ణారెడ్డి, కాంతారావులతోపాటు డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
నేడు జిల్లా బంద్
శ్రీకాకుళం అర్బన్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుందని అందువల్ల బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంధవరపు సూరిబాబు, పొన్నాడ రుషి, రత్నాల నరసింహమూర్తి, ముస్తాక్ మహమ్మద్ కోరారు. వేకువజామునుంచే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు వెళ్ళి బస్సులను అడ్డుకుంటామని వారు ప్రకటించారు. ఏపీకి ప్రత్యేకహోదా కల్పించే విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సాగదీతధోరణి అవలంబిస్తున్నాయని సీపీఐ, సీపీఎం నాయకులు చాపర సుందరలాల్, భవిరి కృష్ణమూర్తి దుయ్యబడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు రాష్ట్రబంద్‌కు సహకరించాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వంటి పలు విద్యార్థి సంఘాలు కోరగా ఇప్పటికే ఆయా పాఠశాలలకు సెలవులు మంజూరు చేసినట్లు సమాచారం. సిటిజన్స్‌ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు బంద్ విజయవంతానికి పిలుపునిచ్చారు.