ప్రత్యేక హోదా సాధనే లక్ష్యం..
మహారాణిపేట: ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు 29న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను కూడగట్టుకుని విజయవంతం చేయాల్సిన బాధ్యత పార్టీ నేతలు, కార్యకర్తలపై ఉందన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో నగర పార్టీ నేతలు, కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బంద్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో అరెస్టు చేస్తారనే భయంతోనే సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం పట్టుబట్టడం లేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. విభజన బిల్లులో ఉన్న ప్రత్యేక హోదా తేవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను పక్కదోవ పట్టించేందుకే చంద్రబాబు తన ఎంపీలతో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చెప్పిస్తున్నారని దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లా నగరిలో ధర్నా చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పోలీసులతో దౌర్జన్యం చేయించడం టీడీపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తెలియజేస్తోందన్నారు. ధర్నాలు చేసేందుకు ప్రతిపక్షాలు, ప్రజలకు ఉన్న ప్రజాస్వామ్య హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు.
బంద్‌ను అడ్డుకునేందుకు టీడీపీ తమ పార్టీ నేతలను ముందస్తు అరెస్టులకు కుట్రపన్నుతోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు కుట్రను తిప్పికొడతామని రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంతవరకు పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఆ పార్టీ నేతలకు నిజంగా రాష్ట్రాభివృద్ది పైగాని ప్రజాసంక్షేమం పై గాని శ్రద్ధ ఉంటే ప్రత్యేకహోదా కోసం రాష్ట్రబంద్‌కు సహకరించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కలిసి రావాలని సవాల్ విసిరారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ రాష్ట్రబంద్‌కు జిల్లాలో ఉన్న అన్ని వర్గాలూ పార్టీకతీతంగా కలిసి రావాలన్నారు. మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, మళ్ల విజయ్ ప్రసాద్, తైనాల విజయ్‌కుమార్, గురుమూర్తిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడి, నియోజకవర్గ సమన్వయకర్తలు కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, వంశృకృష్ణలు మాట్లాడుతూ బంద్‌ను జయప్రదం చేసేందుకు సమష్టిగా పని చేస్తామన్నారు. సీఈసీ సభ్యుడు దామా సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి జి.రవిరెడ్డి, ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి చల్లా మధు, అనుబంధ విభాగాల అధ్యక్షులు విల్లూరి భాస్కరరావు, ఉషాకిరణ్, పక్కి దివాకర్, ఎండీ షరీఫ్, బోని శివరామకృష్ణ, పార్టీ నేతలు సత్తి రామకృష్ణారెడ్డి, కాంతారావులతోపాటు డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.