హోదా ప్రకటించే దాకా పోరాటం
రేపటి బంద్ విజయవంతం చేయండి
వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం: ప్రత్యేక హోదా ప్రకటించే దాకా పార్టీ పోరాటం చేస్తుంది.. 29న చేపట్టే రాష్ట్ర బంద్ మా పార్టీ బలోపేతానికో, అధికారం కోసమో కాదు.. రాష్ట్రాభివృద్ధి కోసం.. భావితరాల కోసం..రాష్ట్ర ప్రజలు, మేధావులు, కార్మిక వర్గాలు బంద్‌కు సహకరించాలి’ అని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం నగర పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో హోదాకు అవసరమైన చట్టాలను పెట్టారని, రాష్ట్రంలో ఏర్పాటవుతున్న విద్యాసంస్థలు చట్టంలోనివేనని స్పష్టం చేశారు. చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయకపోతే పోరాడతామన్నారు. ప్రత్యేక హోదా పదేళ్లుండాలని రాజ్యసభలో నిలదీసిన వెంకయ్యనాయుడు ఇప్పుడెందుకు ప్రజలను మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీలు గత ఎన్నికల్లో ప్రత్యేక హోదాతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీనిచ్చాయని, అధికారంలోకి వచ్చి 14 నెలలయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తెస్తూనే ఉన్నారని, వేలాది మందితో ఢిల్లీలో ధర్నా కూడా చేశారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు లోక్‌సభలో ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తే టీడీపీ ఎంపీలు అవహేళన చేశారని గుర్తు చేశారు. తమ పార్టీకి పదవులు ముఖ్యం కాదని, ప్రజలే ముఖ్యమని, వారి కోసం ఏ త్యాగాలకైనా, అవసరమైతే పదవులకు రాజీనామాలకైనా సిద్ధమేనన్నారు. రాబోయే తరం పిల్లల భవిష్యత్ బాగుండాలన్నా, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు రావాలన్నా ప్రత్యేక హోదా అవసరమని, ఇది రాష్ట్రానికి సంజీవనేనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ బీహార్‌కు రూ. ల క్షా 25 వేల కోట్లను ప్రకటించినా ఆ రాష్ట్ర సీఎం తమకు ప్యాకేజీ వద్దని, ప్రత్యేక హోదాయే కావాలంటున్నారంటే హోదా వల్ల చేకూరే ప్రయోజనాలను గమనించాలన్నారు. బంద్‌కు వామపక్షాలు కూడా మద్దతునిస్తున్నాయన్నారు. 29 నాటి రక్షాబంధన్ రాష్ట్రం మేలు కోసం కట్టే రక్షాబంధన్ కావాలని జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షిస్తున్నారన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలను నివారించలేని చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తామనడం హాస్యాస్పదమన్నారు. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, నియోజకవర్గ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.