ఇంకా నాన్చుడే..! | BJP,TDP Seat Allocation lest day expired | Sakshi
Sakshi News home page

ఇంకా నాన్చుడే..!

Published Fri, Apr 18 2014 1:00 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ఇంకా నాన్చుడే..! - Sakshi

ఇంకా నాన్చుడే..!

సాక్షి, గుంటూరు:జిల్లాలో టీడీపీ సీట్ల కేటాయింపుపై ఇంకా ప్రతిష్టంభన వీడలేదు. నామినేషన్లకు ఒక్కరోజే గడువున్న తరుణంలోనూ అభ్యర్థులను ప్రకటించడంలో ఆ పార్టీ అధినేత అనుసరిస్తున్న నాన్చుడు ధోరణి ఆశావహుల్లో కలవరం సృష్టిస్తోంది. ఏడాది ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటిస్తామని ప్రకటించిన చంద్రబాబు జిల్లాలో ఇంకా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయనే లేదు. వీటిలో మంగళగిరి, మాచర్ల, గుంటూరు తూర్పు, ప్రత్తిపాడుతో పాటు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించాలని భావించిన నరసరావుపేట స్థానంపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీతో టీడీపీ పొత్తు పండలేదని ప్రచారం జోరందుకోవడంతో జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
 
 వెనక్కి తగ్గేది లేదంటున్న రెబల్స్..
 నరసరావుపేటతోపాటు మిగిలిన నాలుగు స్థానాలపైనా టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం అర్ధరాత్రి జాబితా ప్రకటిస్తారని ఆశావహులు ఎదురు చూస్తుండగా, సత్తెనపల్లి, నరసరావుపేట నుంచి నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ రెబల్ అభ్యర్థులు కత్తులు దూస్తున్నారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల నుంచి శనివారం నామినేషన్లు దాఖలు చేసేందుకు మరికొందరు రెబల్ అభ్యర్థులు రెడీ అవుతున్నారు. గుంటూరు తూర్పు నుంచి బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్ రెబల్‌గా నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా సత్తెనపల్లి నుంచి తాను పోటీలో ఉండి తీరుతానని నిమ్మకాయల రాజనారాయణ పట్టుపడుతున్నారు.
 
 రేపు నామినేషన్లకు కమలనాథులు సన్నద్ధం..
 వెంటపడి బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు తాము నామినేషన్ వేసిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను రంగంలోకి దింపడంపై కమలనాథులు మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా నరసరావుపేట తమకు కేటాయిస్తున్నట్లు ప్రకటించి ఇప్పుడు పొత్తు లేదని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో పొత్తు ఉండాలా? వద్దా? అన్న అంశంపై ఐవీఆర్‌ఎస్ పద్ధతిలో అభిప్రాయసేకరణ జరుపుతామని గురువారం మధ్యాహ్నం టీడీపీ వర్గాలు ప్రకటించినప్పుడే బీజేపీ నాయకత్వం జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాలకు, 17 అసెంబ్లీ స్థానాలకు శనివారం నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ సీనియర్ నేతలు ప్రకటన విడుదల చేశారు. దీంతో నరసరావుపేట అసెంబ్లీ స్థానంతో పాటు మాచర్ల, మంగళగిరి, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు సీట్లు అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చేలా లేదు. చివరి నిమిషంలో తమకు ఈ తిప్పలేంటని దేశం నేతలు, కార్యకర్తలు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement