అసంతృప్తులు.. అసమ్మతి రాగాలు
⇒ సొంత పార్టీలో కుంపట్లు.. పొగ పెడుతున్న మిత్రపక్షం
⇒ శాపంలా వెంటాడుతున్న విభజన హామీలు
⇒ అటకెక్కించిన ప్రత్యేక హోదా డిమాండ్
⇒ ప్రత్యేక రైల్వే జోన్ ఊసెత్తని కేంద్రం
⇒ పాలుపోని స్థితిలో మాధవ్
తండ్రి బాటలోనే మండలిలో అడుగుపెట్టాలన్న ఆయన ఆశలపై సొంత పార్టీ నేతలే నీళ్లు చల్లుతుంటే.. మిత్రపక్షం నేతల తీరు తలనొప్పిగా మారుతోంది. దీనికి తోడు అమలు కాని విభజన హామీలు ఆయనకు శాపంగా వెంటాడుతున్నాయి. ఒకవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఉద్యమాల సెగ రగులుతూనే ఉంది. ఈ పరిస్థితిలో ప్రజల వద్దకు ఎలా వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితి. సొంత పార్టీలో కుంపట్లను చల్లార్చుకుంటూ, మిత్ర పక్షం నుంచి మద్దతు కూడగట్టుకుంటూ ముందుకెళ్లడం
మాధవ్‌కు కత్తిమీద సాములా మారింది.
విశాఖపట్నం : బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పి.వి.చలపతిరావు తనయుడు పి.వి.ఎన్.మాధవ్ ఉత్తరాంధ్ర పట్టభద్రు ల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి టీడీపీ–బీజేపీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సమయంలోనే ఆ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కె.హరిబాబు, నగర పార్టీ అధ్యక్షుడు నాగేంద్రలు ర్యాలీలో పాల్గొనకుండానే వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజుతో పాటు పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తానంటూ ప్రకటించిన రామకోటయ్య, పృథ్వీరాజ్ వంటి సీనియర్ నేతలు నామినేషన్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ పరిణామాలతో మాధవ్ అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం లేదన్న ప్రచారం సాగుతోంది. సొంత జిల్లా కంటే పొరుగు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన పార్టీ నేతలే ఎక్కువగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి మేరకు టీడీపీ మంత్రులు, ఎంపీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారని పలువురు పేర్కొంటున్నారు.
నోరు మెదపని బీజేపీ ప్రజాప్రతినిధులు
మాధవ్‌ను గెలిపించాలంటూ టీడీపీ మంత్రులతో పాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చిన బీజేపీ మంత్రులు ప్రకటనలు చేశారు. ఇప్పటివరకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతల నుంచి కనీసం ప్రకటన కూడా రాకపోవడం మాధవ్ అనుచరులను కలవరపెడుతోంది. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠానికి పోటీ లేకుండా ఉండేందుకే ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీకి కేటాయించామని టీడీపీ పెద్దలు బాహాటంగానే చెబుతున్నారు. ఒక వేళ మాధవ్ గెలిస్తే ఆ పార్టీకి ఎంపీ, ఎమ్మెల్యేకు తోడు ఎమ్మెల్సీ ఉంటారు. జీవీఎంసీ పరిధిలో ప్రధాని మోదీకున్న చరిష్మా వల్లే మేం గెలిచామని చెప్పుకునే అవకాశం ఉందని.. అదే కనుక జరిగితే జీవీఎంసీ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల కోసం బీజేపీ పట్టుబట్టే అవకాశం ఉంటుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా మాధవ్ విజయావకాశాలకు గండి కొట్టాలన్న ఆలోచనతో టీడీపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
శాపంగా విభజన హామీలు
ఇలా సొంత పార్టీ నుంచి, మిత్రపక్షం నుంచి కూడా ఆశించిన సహకారం లభించక అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న మాధవ్‌కు విభజన హామీలు శాపంగా మారాయి. ప్రత్యేక హోదా కోసం ఉత్తరాంధ్ర రగిలిపోతుంది. ఆది నుంచి ఈ ఉద్యమంలో ఉత్తరాంధ్ర వాసులే ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష ప్రత్యేక హోదాను అటకెక్కించిన కేంద్రంపై ఉత్తరాంధ్ర పట్టభద్రులు గుర్రుగా ఉన్నారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌పై కేంద్రం ప్రకటన చేయకపోవడంపై మండిపడుతున్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల చిన్న, చితకా పరిశ్రమలు మూతపడడంతో వందలాది మంది రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. వీరంతా కేంద్రంపై అసంతృప్తితో ఉన్నారు.
ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి
వ్యతిరేక పవనాలతో మాధవ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చలపతిరావు సమకాలీకులు మాధవ్ గెలుపు కోసం కేంద్ర నాయకత్వం ద్వారా రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రానున్న 20 రోజులు విశాఖలోనే మకాం వేసి సొంత పార్టీలో అసంతృప్తులను చక్కదిద్దేందుకు, మిత్రపక్షం నుంచి మద్దతు కూడగట్టేందుకు కేంద్ర పార్టీ నుంచి పరిశీలకులు కూడా వస్తున్నట్టు తెలిసింది. పరిస్థితిని బట్టి మూడు జిల్లాల్లోని ప్రతి మున్సిపాల్టీకి, ప్రతి మండలానికి ఓ బాధ్యుడ్ని నియమించాలన్న ఆలోచనతో పార్టీ అగ్రనాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎంతవరకు సఫలీకృతమవుతారో చూడాల్సిందే.