‘తెలుగుదేశం పార్టీ లక్ష్యం.. అన్ని వర్గాలకూ ప్రాధాన్యం’ ఇవీ ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్ కో చెప్పిన మాటలు. తీరా అధికారంలోకొచ్చాక ‘మనదే రాజ్యం..మనదే పెత్తనం’ అంటూ తమ సామాజిక వర్గాన్ని అందలమెక్కిస్తున్నారు. దీంతో జిల్లా టీడీపీలో మిగిలిన సామాజిక వర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన గ్రామ స్థాయి నేతలు కూడా లెక్క చేయడం లేదు.
సాక్షి, గుంటూరు: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశంలో ఆ పార్టీ సామాజిక వర్గానిదే పెత్తనంగా కొనసాగుతోంది. పార్టీలో నామినేటెడ్ పోస్టుల్లో కీలక పదవులన్నీ ఆ సామాజిక వర్గ నేతలకే కట్టబెట్టారు. సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా ఇతర కులానికి ఏదైనా పదవి కేటాయించినప్పటికీ పూర్తి స్థాయిలో పని చేయనీయడం లేదు. ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలుగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం ఆ సామాజిక వర్గం నేతలే పెత్తనం చేస్తున్నారు.
ఒప్పందాలు సైతం ఉల్లంఘన
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గుంటూరు జిల్లాలో ఆ పార్టీ సామాజిక వర్గం నేతలు తమ ప్రాధాన్యతను పెంచుకుంటూ ఇతర సామాజిక వర్గానికి చెందిన నేతలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చే వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బలహీన వర్గాల నాయకులకు నామినేటెడ్ పోస్టులు, పార్టీలో కీలక పదవులు కట్టబెడతామంటూ ఆశ చూపిన విషయం తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ, పార్టీ పదవుల కేటాయింపుల్లోనూ ఇతర సామాజిక వర్గాలకు తూతూమంత్రంగా ప్రాధాన్యం ఇస్తూ కీలక పోస్టులన్నింటినీ టీడీపీ సామాజిక వర్గానికే కట్టబెడుతున్నారు.
ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డుగా పేరొందిన గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా ఏడాదిపాటు మన్నవ సుబ్బారావు, ఆ తరువాత రెడ్డి సామాజిక వర్గానికి చెంది వెన్నా సాంబశివారెడ్డిలకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి వద్ద ఒప్పందం కుదిరినట్లు అంతా చెప్పుకున్నారు. అయితే ఏడాది దాటిన తరువాత తిరిగి మన్నవ సుబ్బారావుకే కొనసాగింపు ఇవ్వడం చూస్తుంటే సొంత సామాజిక వర్గంపై ఆ పార్టీ ముఖ్యనేతలకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇన్‌చార్జిలపైనా పెత్తనం
సమీకరణల్లో భాగంగా గుంటూరు నగర అధ్యక్ష పదవిని కాపు సామాజిక వర్గానికి చెందిన చందు సాంబశివరావుకు ఇచ్చినప్పటికీ ఆయనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని ఆ సామాజిక కార్యకర్తలు వాపోతున్నారు. ఇటీవల నగరంలో జరిగిన పార్టీ పదవుల ప్రమాణ స్వీకారోత్సవ సభకు సైతం అతి తక్కువ మంది హాజరవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జిగా మద్దాళి గిరిధర్‌లు వ్యవహరిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పెత్తనం మాత్రం టీడీపీ సామాజిక వర్గం నేతలదే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చివరకు అధికారుల పోస్టింగ్‌ల్లో సైతం ఆ సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తూ టీడీపీ అంటే ఆ సామాజిక వర్గానికే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలంటే లెక్క లేదు
జిల్లాలో ఎస్సీ, బీసీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, ఇతర ముఖ్య నేతలు అంటే టీడీపీ సామాజిక వర్గానికి చెందిన గ్రామస్థాయి నాయకులకు కూడా లెక్క లేదు. గతంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు గ్రామంలో మంత్రి హోదాలో శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లేందుకు యత్నించిన రావెల కిషోర్‌బాబును అక్కడ గ్రామ స్థాయి నాయకులు అడ్డుకున్నారు. శిలాఫలకాన్ని సైతం ధ్వంసం చేశారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి రాకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ జిల్లాలో మంత్రులుగానీ, ఎంపీలుగానీ ఈ ఘటనను ఖండించకపోవడం దారుణమని టీడీపీ నేతలే చెబుతున్నారు.
రాజధాని నియోజకవర్గమైన తాడికొండలో ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా టీడీపీ సామాజిక వర్గం నేతలు గ్రూపుగా ఏర్పడి ఇబ్బందులు పెడుతున్నారని ఎస్సీ సామాజిక వర్గ నేతలు వాపోతున్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యేను అడ్డుకున్నా అధిష్టానం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమైన విషయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఓటమి పాలైన మంగళగిరి, మాచర్ల, బాపట్ల, గుంటూరు తూర్పు నియోజకవర్గాల్లో ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలను ఇన్‌చార్జిలుగా నియమించారు. అయితే వారి పెత్తనం సాగకుండా అధికార పార్టీ సామాజిక వర్గం నేతలను సమన్వయకర్తలుగా నియమించి అధికారాన్ని వారి హస్తగతం చేసేశారు.
Comments
Please login to add a commentAdd a comment