రాష్ట్రంలో 8 మంది అధికారుల
ఇళ్లపై లోకాయుక్త దాడులు
పెద్ద మొత్తంలో నగదు, నగలు గుర్తింపు
బనశంకరి: ప్రభుత్వ ఉద్యోగం మాటున అవినీతి రుచిమరిగిన అధికారులకు లోకాయుక్త షాక్ ఇచ్చింది. రవాణాశాఖ జాయింట్ డైరెక్టర్‌తో పాటు 8 మంది అధికారుల ఇళ్లు, ఆఫీసులు, వారి బంధుమిత్రుల ఇళ్లలో ముమ్మర సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా అక్రమ సంపాదన బయటపడింది. బెంగళూరు, చిక్కమగళూరు, బీదర్, బెళగావి, తుమకూరు, గదగ్, బళ్లారి, రాయచూరు జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచి ఒకేసారి దాడులు మొదలయ్యాయి. పెద్దసంఖ్యలో లోకాయుక్త పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.
వార్డెన్ లోకేశ్ లీలలు
బళ్లారి తాలూకా వెనుకబడిన వర్గాల శాఖ తాలూకా అధికారి ఆర్‌హెచ్ లోకేశ్ ఇంట్లో సోదాలు జరిగాయి. రూ.2 కోట్లకు పైగా విలువ చేసే రెండు ఇళ్లను గుర్తించారు. కుడితిని గ్రామానికి చెందినవారు. బీసీఎం హాస్టల్‌లో చదువుకుని వార్డెన్‌గా ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగానికి, సంపాదించిన ఆస్తులకు పొంతన లేదు. కురుగోడు వద్ద 4 ఎకరాల తోట ఉంది. ఇతడి పుట్టినరోజుకు బీసీఎం హాస్టల్ విద్యార్థులు భారీ పూలమాల వేసి సంబరాలు చేశారు. అలా చేయకపోతే వేధింపులకు పాల్పడేవాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలోనూ చురుగ్గా ఉన్నాడు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా విదేశీ పర్యటన చేశారు. లోకాయుక్త దాడి గురించి ముందే తెలిసిందే ఏమోగానీ అజ్ఞాతంలోకి జారుకున్నాడు.
గదగ్, బెళగావిలో..
గదగ్–బేటగేరి నగరసభ కార్యనిర్వాహక ఇంజనీర్ హుచ్చేశ్‌బండి వడ్డర్ నివాసం, కార్యాలయం, ఫాం హౌస్‌పై అధికారులు దాడిచేశారు. గదగ, గజేంద్రగడ, బాగల్‌కోటే తో పాటు ఐదుచోట్ల సోదాలు సాగాయి. ఆస్తిపాస్తుల పత్రాలు, ఫైళ్లను పరిశీలన చేపట్టారు. బెళగావి జిల్లా ఖానాపుర తహశీల్దార్ ప్రకాశ్ గైక్వాడ్ ఆఫీసు, బెళగావి నగర లక్ష్మీటెక్‌లోని ఇల్లు, నిప్పాణి నివాసం తో పాటు 6 చోట్ల దాడిచేశారు. పెద్దమొత్తంలో ఆస్తుల పత్రాలు లభించాయి.
రిటైర్డు అధికారికి షాక్
లంచాలతో అక్రమాస్తులు సంపాదించుకుని రిటైరయ్యాను అని ధీమాగా ఉన్న తుమకూరు రిటైర్డు ఆర్‌టీఓ ఎస్.రాజు ఇంట్లో గాలింపు జరిపారు. ఎస్పీ హనుమంతరాయప్ప ఆధ్వర్యంలో సోదాలు జరిపి పెద్దమొత్తంలో ఆస్తుల వివరాలను సేకరించారు.
వస్తు సామగ్రి లెక్కింపు
మొత్తం దాడుల్లో అధికారుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, బంగారు–వెండి ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు, ఆస్తిపాస్తుల పత్రాలు, ఫైళ్లు, బ్యాంకు పాస్‌బుక్కులు, లాకర్ల సమాచారాన్ని పరిశీలన చేపట్టారు. కాగా, లోకాయుక్త గత మూడు నెలల నుంచి తరచుగా దాడులు చేస్తుండడంతో లంచగొండి ఉద్యోగుల్లో భయం ఆవహించింది.
దాడులు ఎవరిపై.. ఎక్కడెక్కడ..
⇒ శోభా – జాయింట్ కమిషనర్ రవాణాశాఖ, బెంగళూరు
⇒ డాక్టర్ ఎస్‌ఎన్.ఉమేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారి, కడూరు, చిక్కమగళూరు జిల్లా
⇒ రవీంద్ర, ఇన్‌స్పెక్టర్ చిన్ననీటి పారుదల శాఖ అంతర్జల అభివృద్ధి ఉప విభాగం, బసవ కళ్యాణ, బీదర్ జిల్లా
⇒ ప్రకాశ్ శ్రీధర్ గైక్వాడ్, తహశీల్దార్, ఖానాపుర– బెళగావి జిల్లా
⇒ హుచ్చేశ్, అసిస్టెంట్ కార్యనిర్వాహక ఇంజనీర్ (ఇన్‌చార్జ్) బేటగేరి పురసభ, గదగ్
⇒ ఆర్‌హెచ్ లోకేశ్, వెనుకబడిన వర్గా శాఖ సంక్షేమ అధికారి, బళ్లారి
⇒ హులి రాజ, గిల్లేసుగూరు కేంద్రం జూనియర్ ఇంజనీర్, రాయచూరు
⇒ ఎస్.రాజు, రిటైర్డు ఆర్‌టీఓ, రవాణాశాఖ తుమకూరు
Comments
Please login to add a commentAdd a comment