
ఆ పేరుతో అసాంఘీక కార్యకలాపాలు
బ్యాంకాక్ తరహాలో మసాజ్ సెంటర్లు
ప్రముఖ లాడ్జిల్లో నిర్వహిస్తున్న వైనం
పోలీసు తనిఖీలో దందా వెలుగులోకి..
సాక్షి,బళ్లారి: ఇనుప ఖనిజ నిల్వలకు ప్రసిద్ధి పొందిన బళ్లారి జిల్లా అసాంఘీక కార్యకలాపాలకు కూడా అడ్డాగా మారింది. మట్కా, పేకాట, జూదాలు యథేచ్ఛగా కొనసాగుతుండటంతో పాటు స్పా మసాజ్ పేరుతో వేశ్యావాటిక తరహాలో అక్కడ అసాంఘీక కార్యకలాపాలు జరుపుతున్నారని పోలీసు తనిఖీల్లో బయట పడుతున్నాయి.
గతంలో స్పా మసాజ్‌లు చేయించుకునేందుకు బ్యాంకాక్ వెళ్లేవారికి లేదా బెంగళూరు వెళ్లే వారికి ఆ కష్టనష్టాలు లేకుండా బళ్లారిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ లాడ్జి యజమానులు డబ్బుల కోసం వేశ్యావాటిక తరహాలోనే స్పా మసాజ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. నగరంలో పేరుగాంచిన ప్రముఖ లాడ్జిల్లో స్పా మసాజ్ సెంటర్లు ఉన్నట్లు బహిరంగంగానే ఫ్లెక్సీలు పెట్టి మరీ స్పా మసాజ్ వ్యాపారాలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా బళ్లారిలో స్పా మసాజ్ సెంటర్ల పేరుతో లాడ్జిల్లో అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల అమ్మాయిలతో మసాజ్
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయిలతో మసాజ్ చేయిస్తూ వారిని లైంగిక క్రియలకు కూడా ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఇటీవల నగరంలో పేరుగాంచిన బాలా రెసిడెన్సీ హోటల్‌లో స్పా మసాజ్ సెంటర్‌లో అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు దాడుల్లో వెలుగు చూడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బాలా రెసిడెన్సీ హోటల్‌లో మసాజ్ పేరుతో వేశ్యావాటిక తరహాలో అమ్మాయిలతో లైంగిక క్రియలను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం చేయిస్తుండటంతో పోలీసులు తనిఖీ చేసి ఐదు మందిని అరెస్ట్ చేయడంతో పాటు ముగ్గురు అమ్మాయిలను రక్షించిన సంగతి విదితమే. పోలీసులు ఈ చర్యతో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే నగరంలో ఒక్క బాలా రెసిడెన్సీ హోటల్, లాడ్జిలోనే కాకుండా అదే తరహాలో స్పా మసాజ్ పేరుతో ప్రముఖ లాడ్జిల్లో అసాంఘీక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఒక గది.. రూ.2 లక్షల బాడుగ
లాడ్జిల్లో ఒక గదిని ప్రత్యేకంగా స్పా మసాజ్ కోసం కేటాయిస్తూ నెలకు ఒక గదిని రూ.2 లక్షలకు పైగా బాడుగకు ఇస్తూ లాడ్జి యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. బాడుగకు తీసుకున్న వ్యక్తులు స్పా మసాజ్ పేరుతో లాడ్జిల్లోని గదుల్లో అమ్మాయిలతో పురుషులకు మసాజ్ చేయించి, వారు కోరితే సెక్స్‌కు ఓకే చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఇంతవరకు పోలీసులకు పెద్ద ఎత్తున మామూళ్లు ఇస్తూ యథేచ్ఛగా బ్యాంకాక్ తరహాలో ఇక్కడ అందమైన అమ్మాయిలతో స్పా మసాజ్ అనంతరం అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నా పోలీసులు ఇప్పటివరకు దాడులు చేసిన దాఖలాలు లేవు.
అయితే ఎస్పీ శోభారాణి నేతృత్వంలో బాలా లాడ్జిపై దాడి చేసి పలువురిని అరెస్ట్ చేయడం శుభపరిణామమే అయినా ఇలాంటివి నగరంలో పేరుగాంచిన లాడ్జిల్లో స్పా మసాజ్ సెంటర్లు ఉన్నాయని, వాటిపై కూడా దాడులు నిర్వహించి స్పా మసాజ్‌లకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలో స్పా మసాజ్ సెంటర్లను మూసివేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర వాసులు పేర్కొంటున్నారు.