నా బిడ్డను నాకు అప్పగించేలా పోలీసులను ఆదేశించండి
హైకోర్టులో ఓ మహిళ హెబియస్ కార్పస్ పిటిషన్
బాధ్యులపై కేసు నమోదు చేశాం: ఏజీ
బాలిక సంరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది
విటులను నిందితులుగా పేర్కొనాల్సిన అవసరం ఉందన్న హైకోర్టు
సాక్షి, అమరావతి: తన కుమార్తెను తన స్నేహితురాలు డబ్బు కోసం వ్యభిచార వృత్తిలో దించేందుకు ప్రయత్నిస్తోందని, తన కుమార్తెను తనకు అప్పగించేలా ఆదేశించాలని కోరుతూ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొంతకాలం క్రితం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆ బాలికను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.
పోలీసులు ఆ బాలికను కోర్టు ముందు హాజరుపరచగా.. మంగళగిరి వద్ద ఉన్న ఉజ్వలా హోంలో ఉంచాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఆ బాలిక వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరిపి, బాధ్యులపై కేసు నమోదు చేయాలంది. అంతేకాక ఈ కేసులో సదరు జిల్లా ఎస్పీని ప్రతివాదిగా చేర్చింది. అలాగే పిటిషనర్ తన స్నేహితురాలిగా పేర్కొన్న మహిళ కూడా కోర్టు ముందు హాజరయ్యారు.
తాను కుట్టుపని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటానని, ఆ బాలికను తాను అక్రమంగా నిర్భంధించలేదని ఆ మహిళ తెలిపారు. ఆ బాలిక తన వద్దకు వచ్చి మూడు నెలలు ఉందని, ఆ సమయంలో ఆ బాలికకు టైలరింగ్ నేర్పించానని తెలిపారు. అనంతరం హైకోర్టు ఈ వ్యవహారంలో ప్రభుత్వ వాదన వినాలని నిర్ణయించి అప్పుడు విచారణను వాయిదా వేసింది.
విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి..
ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హాజరయ్యారు. ఆ బాలికను వ్యభిచార వృత్తిలోకి దించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించారు. బాధిత బాలిక సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, నిస్సహాయ బాలికలు, మహిళలను మానవ అక్రమ రవాణాదారుల నుంచి కాపాడాలని, ఈ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
అలాగే మానవ అక్రమ రవాణాదారుల ఉచ్చులో నుంచి బయటపడిన బాలికలు, మహిళల పునరావాసం కోసం కూడా చర్యలు తీసుకోవాలంది. ప్రస్తుతం చట్టంలో విటులను బాధితులుగా పేర్కొన్నారని, వాస్తవానికి వారిని నిందితులుగా పేర్కొనాల్సిన అవసరం ఉందని తెలిపింది. దీనిపై ఏజీ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ, మానవ అక్రమ రవాణాదారుల నుంచి బాలికలు, మహిళలను కాపాడే విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
అలాగే పునరావాసం విషయంలో అన్ని చర్యలు తీసుకుంటామని నివేదించారు. సమగ్ర వివరాలతో విధానపరమైన నివేదిక సమర్పిస్తామన్నారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి దర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment