అప్పటి మంత్రి ఓఎస్డీ కల్యాణ్, పశుగణాభివృద్ధి సంస్థ
సీఈఓ రాంచందర్‌లను కోర్టులో హాజరుపర్చిన ఏసీబీ అధికారులు..
రూ.2.10 కోట్ల నిధుల గోల్‌మాల్‌పై ఏసీబీ ఆరా
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు కీలక నింది తులను అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్ కుమార్‌లను శుక్రవారం ఏసీబీ ప్రత్యేక న్యాయ స్థానంలో హాజరుపరిచారు. సబావత్ రాంచందర్‌ను ఏ–9గా, కల్యాణ్‌గా ఏ–10గా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. నిందితులను జ్యుడీ షియల్ రిమాండ్‌కు తరలించారు.
ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఆదేశాలు
నిందితులిద్దరూ నిబంధనలు తుంగలో తొక్కి, గొర్రెల సేకరణ ప్రక్రియ ప్రైవేటు వ్యక్తులు, బ్రోకర్లకు అప్పగిస్తూ అన్ని జిల్లాల పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గొర్రెల కొనుగోలు పేరిట ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు చేరేలా చేశారని ఏసీబీ అధి కారులు తమ దర్యాప్తులో గుర్తించారు. గొర్రెల కొనుగోలుకు సంబంధించి ఏపీ రైతులకు ఇవ్వాల్సిన మొత్తం రూ.2.10 కోట్ల మేర నిధులు కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి దారి మళ్లించినట్టు ఏసీబీ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు.
ఈ కుంభకోణంతో సంబంధమున్నట్టు లభించిన ఆధారాల మేరకు ఏసీబీ అధికారులు ఫిబ్రవరిలో కామారెడ్డి జిల్లా ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్‌వాటర్ ఆఫీసర్ పసుల రఘుపతిరెడ్డి, నల్లగొండ వయోజనవిద్య డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్‌లను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మార్చి లో పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ పి కృష్ణయ్యలను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు గా ఉన్న కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, అతడి కుమారుడు ఇక్రమ్ పరారీలో ఉన్నారు.
గొర్రెల కుంభకోణం అసలు కథ ఇదీ
బీఆర్‌ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం పెద్ద ఎత్తున చేపట్టింది. అయితే ఈ పథకం అమలులో నిధులు దారి మళ్లించడంపై అందిన ఫిర్యాదులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దింపింది. వాస్తవానికి ఏపీ రైతులు ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డిజిల్లా మంచాల ప్రాంత లబ్ధిదారు లకు గొర్రెలు పంపిణీ చేసేందుకు ఏపీలోని పల్నాడు జిల్లా అంగలూరుకు చెందిన 18 మంది గొర్రెల సరఫరాదారులను సంప్రదించారు. ఆ తర్వాత పశువైద్యశాఖ అధి కారులు రవి, ఆదిత్యకేశవసాయితోపాటు కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, ఇక్రమ్ కలిసి 133 మంది లబ్ధిదారులను తీసుకెళ్లి 133 యూనిట్లను ఒక్కో యూనిట్ రూ.1.58 లక్షల చొప్పున కొనుగోలు చేశారు.
అయితే ఇందుకు సంబంధించిన డబ్బులు గొర్రెలు విక్రయించిన రైతులకు ఇవ్వకుండా ఇక్కడే అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కై కుంభకోణానికి తెరలే పారు. మొత్తం రూ. 2.10 కోట్లను గొర్రెల సరఫరా రైతుల పేరిట కాకుండా బినామీల పేరిట చెక్కులు మంజూరు చేశారు. అనంతరం ఆ సొమ్మును కొట్టేశారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో కోడ్ కారణంగానే తమకు డబ్బులు రావడం లేదని ఏపీ గొర్రెల సరఫరా రైతులు అనుకున్నారు. కోడ్ ముగిసిన తర్వాత కూడా డబ్బులు రాక పోవడంతో మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ ఆఫీసులో ఆరా తీశారు.
తమకు రావా ల్సిన రూ.2.10 కోట్లు ఏపీలోని వివిధ జిల్లా ల్లోని ఇతర అకౌంట్స్‌లో డిపాజిట్ అయినట్టు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై డిసెంబర్‌లో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. కేసును ఏసీబీకి బదిలీ చేసింది. దీంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆధారాలు సేకరిస్తూ, వరుస అరెస్టులు చేస్తూ వస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment