Kalyan Kumar
-
కొల్లగొట్టిన సొమ్ము ఏం చేశారు?
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రాథమిక ఆధారాల మేరకు రూ.700 కోట్ల మేరకు నిధులు దారి మళ్లించినట్టు ఏసీబీ గుర్తించింది. ఇలా కొల్లగొట్టిన కోట్లాది రూపాయల సొమ్మును ఏం చేశారు..? ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు..? మీరే ఈ కుంభకోణానికి తెరతీశారా..? లేదా మీపై ఇంకెవరైనా ఒత్తిడి పెట్టారా...? అంటూ ఏసీబీ అధికారులు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్‌కుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీలో భాగంగా అధికారులు ఇద్దరిని మంగళవారం రెండోరోజూ ప్రశ్నించారు. మొదటి రోజు ఇద్దరి నుంచి వేర్వేరుగా సేకరించిన అంశాలపైనా రెండో రోజు మార్చిమార్చి ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. ప్రైవేటు వ్యక్తులను గొర్రెల కొనుగోళ్లలోకి ఎలా తెచ్చారు.. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వెనుక ఎవరి ఒత్తిడైనా ఉందా..? అని ప్ర శ్నించినట్టు తెలిసింది. ఈ ఇద్దరూ కలిసే ఈ మొత్తం కుంభకోణానికి తెరతీశారా..? ఇంకా ఎవరైనా ఆదేశాలిచ్చారా.. అన్న కోణంలోనూ ప్రశ్నించినట్టు తెలిసింది. బినామీల పేర్లతో చెక్కులు జారీ చేయించిన తర్వాత కొల్లగొట్టిన సొమ్మును అనుకూలుర బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారన్న దానిపైనా అధికారులు సమాచారం సేకరించినట్టు తెలిసింది. బినామీ బ్యాంకు ఖాతాలు, పరారీలో ఉన్న నిందితుల గురించి కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు రాంచందర్, క ల్యాణ్కుమార్ సమాధానాలు దాట వేసినట్టు సమాచారం. విచారణలో వారి నుంచి ఆశించిన సమాచారం రాలేదని, బుధవారం కస్టడీ చివరిరోజు కావడంతో కీలక సమాచారం రాబట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. రాంచందర్ సస్పెన్షన్ అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మే 31న ఏసీబీ రాంచందర్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాంచందర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదర్ సిన్హా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
గొర్రెల స్కీం కుంభకోణంలో కీలక అరెస్టులు
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు కీలక నింది తులను అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్ కుమార్‌లను శుక్రవారం ఏసీబీ ప్రత్యేక న్యాయ స్థానంలో హాజరుపరిచారు. సబావత్ రాంచందర్‌ను ఏ–9గా, కల్యాణ్‌గా ఏ–10గా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. నిందితులను జ్యుడీ షియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఆదేశాలు నిందితులిద్దరూ నిబంధనలు తుంగలో తొక్కి, గొర్రెల సేకరణ ప్రక్రియ ప్రైవేటు వ్యక్తులు, బ్రోకర్లకు అప్పగిస్తూ అన్ని జిల్లాల పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గొర్రెల కొనుగోలు పేరిట ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు చేరేలా చేశారని ఏసీబీ అధి కారులు తమ దర్యాప్తులో గుర్తించారు. గొర్రెల కొనుగోలుకు సంబంధించి ఏపీ రైతులకు ఇవ్వాల్సిన మొత్తం రూ.2.10 కోట్ల మేర నిధులు కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి దారి మళ్లించినట్టు ఏసీబీ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు.ఈ కుంభకోణంతో సంబంధమున్నట్టు లభించిన ఆధారాల మేరకు ఏసీబీ అధికారులు ఫిబ్రవరిలో కామారెడ్డి జిల్లా ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్‌వాటర్ ఆఫీసర్ పసుల రఘుపతిరెడ్డి, నల్లగొండ వయోజనవిద్య డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్‌లను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మార్చి లో పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ పి కృష్ణయ్యలను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు గా ఉన్న కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, అతడి కుమారుడు ఇక్రమ్ పరారీలో ఉన్నారు. గొర్రెల కుంభకోణం అసలు కథ ఇదీబీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం పెద్ద ఎత్తున చేపట్టింది. అయితే ఈ పథకం అమలులో నిధులు దారి మళ్లించడంపై అందిన ఫిర్యాదులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దింపింది. వాస్తవానికి ఏపీ రైతులు ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డిజిల్లా మంచాల ప్రాంత లబ్ధిదారు లకు గొర్రెలు పంపిణీ చేసేందుకు ఏపీలోని పల్నాడు జిల్లా అంగలూరుకు చెందిన 18 మంది గొర్రెల సరఫరాదారులను సంప్రదించారు. ఆ తర్వాత పశువైద్యశాఖ అధి కారులు రవి, ఆదిత్యకేశవసాయితోపాటు కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, ఇక్రమ్ కలిసి 133 మంది లబ్ధిదారులను తీసుకెళ్లి 133 యూనిట్లను ఒక్కో యూనిట్ రూ.1.58 లక్షల చొప్పున కొనుగోలు చేశారు.అయితే ఇందుకు సంబంధించిన డబ్బులు గొర్రెలు విక్రయించిన రైతులకు ఇవ్వకుండా ఇక్కడే అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కై కుంభకోణానికి తెరలే పారు. మొత్తం రూ. 2.10 కోట్లను గొర్రెల సరఫరా రైతుల పేరిట కాకుండా బినామీల పేరిట చెక్కులు మంజూరు చేశారు. అనంతరం ఆ సొమ్మును కొట్టేశారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో కోడ్ కారణంగానే తమకు డబ్బులు రావడం లేదని ఏపీ గొర్రెల సరఫరా రైతులు అనుకున్నారు. కోడ్ ముగిసిన తర్వాత కూడా డబ్బులు రాక పోవడంతో మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ ఆఫీసులో ఆరా తీశారు.తమకు రావా ల్సిన రూ.2.10 కోట్లు ఏపీలోని వివిధ జిల్లా ల్లోని ఇతర అకౌంట్స్‌లో డిపాజిట్ అయినట్టు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై డిసెంబర్లో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. కేసును ఏసీబీకి బదిలీ చేసింది. దీంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆధారాలు సేకరిస్తూ, వరుస అరెస్టులు చేస్తూ వస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు. -
క్లౌడ్ కంప్యూటింగ్‌తో కాల్ డ్రాప్స్‌కు చెక్
బార్సెలోనా: కాల్ అంతరాయాల (డ్రాప్స్) సమస్య పరిష్కారించేందుకు దృష్టి పెట్టాల్సిన అంశాలు మూడు ఉన్నాయని హెచ్‌సీఎల్ టెక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కల్యాణ్ కుమార్ తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత టెలికం నెట్వర్క్, ఇళ్లకు చేరువలో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం, నెట్‌వర్క్‌ను వర్చువల్ విధానానికి మార్చడం ఇందుకు సహాయపడగలదని ఆయన పేర్కొన్నారు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా కుమార్ ఈ విషయాలు వివరించారు. కరోనా మహమ్మారి తర్వాత డేటాకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని, టెల్కోలు తమ నెట్‌వర్క్‌ల నిర్వహణ కోసం క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ వైపు మళ్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నోకియా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం భారత్‌లో గత అయిదేళ్లలో మొబైల్ డేటా ట్రాఫిక్ 3.2 రెట్లు పెరిగింది. అయితే, టెల్కోల నెట్వర్క్ సాఫ్ట్వేర్ వినియోగం ఆ స్థాయిలో పెరగలేదని కుమార్ చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ను, క్లౌడ్ సాంకేతికతలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. -
వంచించాడు
వైఎస్ఆర్ జిల్లా, రాయచోటి: మహిళలకు అనుకూలంగా ఎన్ని చట్టాలు వచ్చినా... మహిళల సాధికారితే తమ ప్రభుత్వాల ధ్యేయమంటున్నా నేటికీ అనేక మంది మహిళలకు న్యాయం లభించక దిక్కుతోచక దీన స్థితిలో ఉన్నారు. నయవంచనకు, మోసపూరిత మాటలకు, యుక్త వయసులో కనిపించే వ్యామోహాల ఫలితమో తెలియదు కానీ కన్న పెద్దలను ఎదిరించి వివాహాలు చేసుకున్న కొద్ది రోజులకే యువతీ యువకుల అంచనాలు తలకిందులై పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ ఎన్నో జంటలు తిరుగుతున్నాయి. నమ్మించి, ప్రేమించి తనను వివాహం చేసుకున్న భర్త బి.కల్యాణకుమార్రెడ్డి ఏడాది తిరగక ముందే తనను వదలి గుట్టు చప్పుడు కాకుండా గల్ఫ్ దేశాలకు వెళ్లిపోయాడంటూ రాయచోటి పట్టణానికి చెందిన ఎం.జోత్స్న అనే వివాహిత రోధిస్తోంది. గల్ఫ్ దేశానికి వెళ్లిన కల్యాణకుమార్రెడ్డి రెండేళ్లవుతున్నా తిరిగి రాకపోగా కొంత డబ్బులు చెల్లిస్తాను, నీ బతుకు నువ్వు బతుక్కోమంటూ ఫోన్ ద్వారా చెబుతున్నారంటోంది. ఇష్టపడి, వెంటబడి ప్రేమించి పెళ్లి చేసుకున్న కల్యాణ్‌ను మా అత్త, అమ్మమ్మలు కలిసి తన నుంచి దూరం చేసే కుట్ర చేశారంటూ బోరున విలపిస్తోంది. తనకు జరుగుతున్న అన్యాయంపై పోలీసు స్టేషన్లు, కోర్టులు, పెద్ద మనుషుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదంటూ కన్నీటి పర్యంతమవుతోంది. బిటెక్ చదివే రోజుల్లోనే ప్రేమించలేనని చెప్పినా మత్తుమందు తిని బెదిరించడంతో నమ్మించి ప్రేమిం చానంటోంది. అదే సమయంలోనే కల్యాణ్ తల్లి సరస్వతి నాకున్నది ఒక్క మగబడ్డేనని, అతను ఏమైనా అయితే తట్టుకోలేనంటూ గల్ఫ్ దేశం నుంచి ఫోన్ ద్వారా మాట్లాడిందన్నారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కాదు కాబట్టి మీరిద్దరు కలిసి పెళ్లి చేసుకోండని చెప్పడంతో పాటు సంసారం చేసుకునేందుకు కొంత వంట సామగ్రి కొనుగోలుకు డబ్బులు కూడా పంపిందన్నారు. దాంతో ఇద్దరం కలిసి హైదరాబాదులోని ఆర్య సమాజంలో 2014వ సంవత్సరం ఆగస్టు 24వ తేదీన వివాహం చేసుకున్నామన్నారు. ఇద్దరం బిటెక్ పూర్తి చేసుకున్నా స్థానికంగా ప్రయివేటు పాఠశాలలో తాను మాత్రమే టీచరుగా పని చేస్తూ ఏడాది పాటు కాలం గడిపామన్నారు. ఈ సమయంలో రెండు పర్యాయాలు గర్భం దాల్చినా ఇప్పట్లో సంతానం కలిగితే ఆర్థికంగా ఇబ్బందులు పడతా మంటూ నమ్మించి అబార్షన్ కూడా చేయించాడని వాపోయింది. 2016 జనవరి 16వ తేదీన గల్ఫ్ దేశానికి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లబోయాడని, వెంటనే విషయాన్ని తమ అమ్మనాన్నలకు తెలియపరిచి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. వెంటనే ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో చెన్నై వెళ్లి పాస్‌పోర్టును సీజ్ చేయడంతో పాటు అరెస్టు చేయించామన్నారు. కానీ అప్పటి సీఐ తమకు ఎలాంటి న్యాయం చేయకపోగా స్టేషన్ బెయిల్ ఇచ్చి కళ్యాణ్‌ను భయటకు పంపించేశారన్నారు. అదే ఏడాది మార్చి 18వ తేదీన ఎవ్వరికీ తెలియకుండా కువైట్ దేశానికి వెళ్లిపోయాడన్నారు. నాటి నుంచి తిరిగి రాకపోకా ఫోన్ల ద్వారా బెదిరిస్తూ విడిపోదామంటూ వేధనకు గురి చేస్తున్నాడని ఆవేదనను వ్యక్తం చేస్తోంది. -
ముగ్గురు యువకుల దుర్మరణం
కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ : కాకినాడ బీచ్ రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పిఠాపురానికి చెందిన దుర్గ(19), కాండ్రకోట కల్యాణ్‌కుమార్(18) బుధవారం స్థానిక రాజేంద్రనగర్‌లోని స్నేహితుడు సవరపు దిలీప్(18) ఇంటికి వచ్చారు. ముగ్గురూ కలిసి మధ్యాహ్నం మోపెడ్‌పై బీచ్‌కు వెళ్లారు. బీచ్ రోడ్డులో షికారు చేశారు. కాగా పోర్టులో సరకు అన్లోడ్ చేసిన కంటైనర్ ట్రాలర్ బీచ్ రోడ్డు మీదుగా వాకలపూడి లైట్‌హౌస్ వైపు వెళుతోంది. ఆ ట్రాలర్‌ను తప్పించి ముందుకు వెళ్లే క్రమంలో మోపెడ్ వేగాన్ని పెంచారు. కోరమండల్ ఎరువుల కర్మాగారం సమీపంలో మోపెడ్ అదుపుతప్పి, దానిపై ఉన్న దుర్గ, కల్యాణ్ కుమార్, దిలీప్ ట్రాలర్ కింద పడ్డారు. దుర్గ, దిలీప్ తలలపై నుంచి ట్రాలర్ చక్రాలు ఎక్కడంతో అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలపాలైన కల్యాణ్ కుమార్‌ను స్థానికులు 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్టు అత్యవసర విభాగ వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న సర్పవరం ఎస్సైలు డి.ప్రశాంత్ కుమార్, సురేష్ చావా తమ సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శవపంచనామా నిర్వహించి మృతదేహాలను జీజీహెచ్ మార్చురీకి తరలించారు. హృదయవిదారకంగా సంఘటన స్థలం కంటైనర్ ట్రాలర్ కింద పడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించడంతో సంఘటన స్థలం హృదయ విదారకంగా కనిపించింది. రక్తపు మడుగులో దుర్గ, దిలీప్ మృతదేహాలు పడి ఉండగా, వారి తలలు ఛిద్రమై భయానకంగా కనిపించా యి. యువకులు అతివేగంగా నాలుగైదు సార్లు బీచ్ రోడ్డులో చక్కర్లు కొట్టారని స్థానికులు చెబుతున్నారు. ట్రాలర్‌ను తప్పించబోయి వారి మోపెడ్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగిందంటున్నారు. మిన్నంటిన రోదనలు ముగ్గురు యువకులు ఒకే ప్రమాదంలో చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని రోదించిన తీరు చూపరులను కలచివేసిం ది. కాగా కల్యాణ్ కుమార్ కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు చేరుకుని గుండెలు బాదుకుంటూ రోదించారు. మృతదేహాలు రోడ్డు మధ్యలో పడి ఉండడంతో మూడు గంటల పాటు బీచ్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. -
మరొకరి పరీక్ష రాస్తూ..
కలువరాయి(బొబ్బిలిరూరల్),న్యూస్‌లైన్: ఒక అభ్యర్థికి బదులు వీఆర్ఓ పరీక్ష రాస్తూ మరో అభ్యర్థి పట్టుబడ్డాడు. బొబ్బిలి మం డలం కలువరాయి స్వామి వివేకానంద ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన వీఆర్ఓ పరీక్షల్లో ఈ సంఘటన జరిగింది. ఎస్.కోట మండలం బాలకృష్ణరాజపురం గ్రామానికి చెందిన ముచ్చకర్ల కల్యాణ్‌కుమార్‌కు బదులు పొడుగు ప్రసా ద్ అనే అభ్యర్థి పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. 203వ నంబర్ పరీక్షాకేంద్రంలో పరీక్ష జరుగుతున్న సమయంలో 102140363 హాల్‌టికెట్ అభ్యర్థి పేరు ఓఎంఆర్ షీట్లో కల్యాణ్‌కుమార్ అని ఉండగా, పరీక్షరాస్తున్న అభ్యర్థి ప్రసాద్ అని సంతకం చేశాడు. అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్ వి.గోవిందరావు గుర్తించి వెంటనే చీఫ్‌సూపరింటెండెంట్ చుక్క రమణకు విషయం తెలియజేయడంతో అప్రమత్తమైన లైజనింగ్ అధికారి ఎస్.రమేష్ తదితరులు అభ్యర్థిని ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అసలు అభ్యర్థి కల్యాణ్‌కుమార్ ఎవరో వివరాలు చెప్పాలని కోరినా ప్రసాద్ విషయం చెప్పకపోవడంతో హాల్‌టికెట్లు పరిశీలించారు. ప్రసాద్ వద్ద ఉన్న హాల్‌టికెట్‌లో అభ్యర్థి పేరు సరిచేసి ఉండడం, వివరాలుకూడా సరిచేసి తయారుచేసిన హాల్టికెట్కావడంతో వెంటనే బొబ్బిలి సీఐ రఘుశ్రీనివాస్కు సమాచారం అందించారు. కళాశాలకు వచ్చిన హాల్‌టికెట్, ప్రసాద్ వద్ద ఉన్న హాల్టికెట్లలో సీరియల్ నంబరు సరిపోగా అభ్యర్థి పేరు కల్యాణ్‌కుమార్‌కు బదులుప్రసాద్ అని, తండ్రిపేరు సత్యనారాయణకు బదులు రాంబాబు అని, పుట్టిన తేదీ 13.06.1987కు బదులు 4.1.1995, కులం బీసీడీ కాగా, ఎస్సీ అని ఉన్నాయి. అయితే ప్రసాద్ తయారుచేసిన హాల్‌టికెట్‌లో అడ్రసు కల్యాణ్కుమార్దే ఉంది. సీఐ రఘుశ్రీనివాస్, ఎస్సై శేఖర్ నకిలీ అభ్యర్థి పొడుగు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని, కేసునమోదుచేసి విచారణ చేస్తున్నారు. అలాగే ఎస్.కోట చెందిన వి.శ్రీను విజయనగరంలోని ఎంఆర్ అటానమస్ కళాశాలలో వీఆర్వో పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ప్రారంభమైన తరువాత ఆ అభ్యర్థి పలుమార్లు బయటకు వెళ్లడాన్ని, జేబురుమాలు తీసి రాస్తుండడాన్ని ఇన్విజిలేటర్ గుర్తించి రుమాలు ఇమ్మని అడిగినా అభ్యర్థి ఇవ్వలేదు. ఇంతలో కేంద్రానికి చేరుకున్న సర్వీసు కమిషన్ అధికారులు రుమాలును స్వాధీనం చేసుకున్నారు. ఆ రుమాలులో ఏకంగా 40 ప్రశ్నలకు సంబంధించిన జవాబులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ అభ్యర్థిని డీబార్ చేశారు.