గొర్రెల కుంభకోణంలో ఇంకెవరి పాత్ర ఉంది?
నిందితులు కల్యాణ్, రామ్‌చందర్‌లకు ఏసీబీ అధికారుల ప్రశ్నలు
నేడు మరోమారు కస్టడీలోకిలోకి తీసుకోనున్న ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రాథమిక ఆధారాల మేరకు రూ.700 కోట్ల మేరకు నిధులు దారి మళ్లించినట్టు ఏసీబీ గుర్తించింది. ఇలా కొల్లగొట్టిన కోట్లాది రూపాయల సొమ్మును ఏం చేశారు..? ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు..? మీరే ఈ కుంభకోణానికి తెరతీశారా..? లేదా మీపై ఇంకెవరైనా ఒత్తిడి పెట్టారా...? అంటూ ఏసీబీ అధికారులు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్‌కుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీలో భాగంగా అధికారులు ఇద్దరిని మంగళవారం రెండోరోజూ ప్రశ్నించారు. మొదటి రోజు ఇద్దరి నుంచి వేర్వేరుగా సేకరించిన అంశాలపైనా రెండో రోజు మార్చిమార్చి ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. ప్రైవేటు వ్యక్తులను గొర్రెల కొనుగోళ్లలోకి ఎలా తెచ్చారు.. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వెనుక ఎవరి ఒత్తిడైనా ఉందా..? అని ప్ర శ్నించినట్టు తెలిసింది. ఈ ఇద్దరూ కలిసే ఈ మొత్తం కుంభకోణానికి తెరతీశారా..? ఇంకా ఎవరైనా ఆదేశాలిచ్చారా.. అన్న కోణంలోనూ ప్రశ్నించినట్టు తెలిసింది.
బినామీల పేర్లతో చెక్కులు జారీ చేయించిన తర్వాత కొల్లగొట్టిన సొమ్మును అనుకూలుర బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారన్న దానిపైనా అధికారులు సమాచారం సేకరించినట్టు తెలిసింది. బినామీ బ్యాంకు ఖాతాలు, పరారీలో ఉన్న నిందితుల గురించి కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు రాంచందర్, క ల్యాణ్‌కుమార్ సమాధానాలు దాట వేసినట్టు సమాచారం. విచారణలో వారి నుంచి ఆశించిన సమాచారం రాలేదని, బుధవారం కస్టడీ చివరిరోజు కావడంతో కీలక సమాచారం రాబట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
రాంచందర్ సస్పెన్షన్
అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మే 31న ఏసీబీ రాంచందర్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాంచందర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదర్ సిన్హా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment