ramchander
-
కొల్లగొట్టిన సొమ్ము ఏం చేశారు?
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రాథమిక ఆధారాల మేరకు రూ.700 కోట్ల మేరకు నిధులు దారి మళ్లించినట్టు ఏసీబీ గుర్తించింది. ఇలా కొల్లగొట్టిన కోట్లాది రూపాయల సొమ్మును ఏం చేశారు..? ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు..? మీరే ఈ కుంభకోణానికి తెరతీశారా..? లేదా మీపై ఇంకెవరైనా ఒత్తిడి పెట్టారా...? అంటూ ఏసీబీ అధికారులు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్‌కుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీలో భాగంగా అధికారులు ఇద్దరిని మంగళవారం రెండోరోజూ ప్రశ్నించారు. మొదటి రోజు ఇద్దరి నుంచి వేర్వేరుగా సేకరించిన అంశాలపైనా రెండో రోజు మార్చిమార్చి ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. ప్రైవేటు వ్యక్తులను గొర్రెల కొనుగోళ్లలోకి ఎలా తెచ్చారు.. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వెనుక ఎవరి ఒత్తిడైనా ఉందా..? అని ప్ర శ్నించినట్టు తెలిసింది. ఈ ఇద్దరూ కలిసే ఈ మొత్తం కుంభకోణానికి తెరతీశారా..? ఇంకా ఎవరైనా ఆదేశాలిచ్చారా.. అన్న కోణంలోనూ ప్రశ్నించినట్టు తెలిసింది. బినామీల పేర్లతో చెక్కులు జారీ చేయించిన తర్వాత కొల్లగొట్టిన సొమ్మును అనుకూలుర బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారన్న దానిపైనా అధికారులు సమాచారం సేకరించినట్టు తెలిసింది. బినామీ బ్యాంకు ఖాతాలు, పరారీలో ఉన్న నిందితుల గురించి కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు రాంచందర్, క ల్యాణ్కుమార్ సమాధానాలు దాట వేసినట్టు సమాచారం. విచారణలో వారి నుంచి ఆశించిన సమాచారం రాలేదని, బుధవారం కస్టడీ చివరిరోజు కావడంతో కీలక సమాచారం రాబట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. రాంచందర్ సస్పెన్షన్ అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మే 31న ఏసీబీ రాంచందర్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాంచందర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదర్ సిన్హా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
గొర్రెల స్కీం కుంభకోణంలో కీలక అరెస్టులు
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు కీలక నింది తులను అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్ కుమార్‌లను శుక్రవారం ఏసీబీ ప్రత్యేక న్యాయ స్థానంలో హాజరుపరిచారు. సబావత్ రాంచందర్‌ను ఏ–9గా, కల్యాణ్‌గా ఏ–10గా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. నిందితులను జ్యుడీ షియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఆదేశాలు నిందితులిద్దరూ నిబంధనలు తుంగలో తొక్కి, గొర్రెల సేకరణ ప్రక్రియ ప్రైవేటు వ్యక్తులు, బ్రోకర్లకు అప్పగిస్తూ అన్ని జిల్లాల పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గొర్రెల కొనుగోలు పేరిట ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు చేరేలా చేశారని ఏసీబీ అధి కారులు తమ దర్యాప్తులో గుర్తించారు. గొర్రెల కొనుగోలుకు సంబంధించి ఏపీ రైతులకు ఇవ్వాల్సిన మొత్తం రూ.2.10 కోట్ల మేర నిధులు కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి దారి మళ్లించినట్టు ఏసీబీ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు.ఈ కుంభకోణంతో సంబంధమున్నట్టు లభించిన ఆధారాల మేరకు ఏసీబీ అధికారులు ఫిబ్రవరిలో కామారెడ్డి జిల్లా ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్‌వాటర్ ఆఫీసర్ పసుల రఘుపతిరెడ్డి, నల్లగొండ వయోజనవిద్య డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్‌లను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మార్చి లో పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ పి కృష్ణయ్యలను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు గా ఉన్న కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, అతడి కుమారుడు ఇక్రమ్ పరారీలో ఉన్నారు. గొర్రెల కుంభకోణం అసలు కథ ఇదీబీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం పెద్ద ఎత్తున చేపట్టింది. అయితే ఈ పథకం అమలులో నిధులు దారి మళ్లించడంపై అందిన ఫిర్యాదులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దింపింది. వాస్తవానికి ఏపీ రైతులు ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డిజిల్లా మంచాల ప్రాంత లబ్ధిదారు లకు గొర్రెలు పంపిణీ చేసేందుకు ఏపీలోని పల్నాడు జిల్లా అంగలూరుకు చెందిన 18 మంది గొర్రెల సరఫరాదారులను సంప్రదించారు. ఆ తర్వాత పశువైద్యశాఖ అధి కారులు రవి, ఆదిత్యకేశవసాయితోపాటు కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, ఇక్రమ్ కలిసి 133 మంది లబ్ధిదారులను తీసుకెళ్లి 133 యూనిట్లను ఒక్కో యూనిట్ రూ.1.58 లక్షల చొప్పున కొనుగోలు చేశారు.అయితే ఇందుకు సంబంధించిన డబ్బులు గొర్రెలు విక్రయించిన రైతులకు ఇవ్వకుండా ఇక్కడే అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కై కుంభకోణానికి తెరలే పారు. మొత్తం రూ. 2.10 కోట్లను గొర్రెల సరఫరా రైతుల పేరిట కాకుండా బినామీల పేరిట చెక్కులు మంజూరు చేశారు. అనంతరం ఆ సొమ్మును కొట్టేశారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో కోడ్ కారణంగానే తమకు డబ్బులు రావడం లేదని ఏపీ గొర్రెల సరఫరా రైతులు అనుకున్నారు. కోడ్ ముగిసిన తర్వాత కూడా డబ్బులు రాక పోవడంతో మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ ఆఫీసులో ఆరా తీశారు.తమకు రావా ల్సిన రూ.2.10 కోట్లు ఏపీలోని వివిధ జిల్లా ల్లోని ఇతర అకౌంట్స్‌లో డిపాజిట్ అయినట్టు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై డిసెంబర్లో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. కేసును ఏసీబీకి బదిలీ చేసింది. దీంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆధారాలు సేకరిస్తూ, వరుస అరెస్టులు చేస్తూ వస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు. -
'అద్దె బస్సుల పెంపును విరమించుకోవాలి'
హన్మకొండ: ఆర్టీసీలో అద్దె బస్సుల పెంపును, ఆర్టీసీని జిహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ర్ట అధ్యక్షుడు సీహెచ్.రాంచందర్ డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ రీజియన్‌లోని అన్ని బస్‌డిపోలలో అద్దె బస్సుల పెంపు, జీహెచ్‌ఎంలో ఆర్టీసీని విరమించుకోవాలని కోరుతూ గెట్ ధర్నాలు నిర్వహించారు. హన్మకొండలోని వరంగల్-1, వరంగల్-2, హన్మకొండి డిపోల వద్ద ఎస్డబ్ల్యుఎఫ్ ఆధ్వర్యంలో గేట్ ధర్నాలు చేశారు. ఈ ధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో 1100 అద్దె బస్సులను తీసుకురావాలని ఆలోచనను యాజమాన్యం ఉపసంహరించుకోవాలన్నారు. అద్దె బస్సులతో మిగులు కార్మికులను ఆర్టీసీ యాజమాన్యం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పెట్టుబడులు పెట్టే స్థోమత లేదనే సాకుతూ అద్దె బస్సులను తీసుకురావడం సరైన చర్య కాదన్నారు. సంస్థ సొంత బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆర్టీసీని జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుందని విమర్శించారు. దీనిని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించడం అంతిమంగా ఆర్టీసీని ముక్కలు చేయడమేనని, తద్వారా ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని అన్నారు. కార్మిక వర్గం ప్రభుత్వ కుట్రలను గమనించాలని, మరో పోరాటానికి కార్మికులు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. ఎస్బీటీ, ఎస్ఆర్బీఎస్ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లో ఒక రోజు మహాదీక్ష చేయనున్నట్లు తెలిపారు. దీక్షలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.