హన్మకొండ: ఆర్టీసీలో అద్దె బస్సుల పెంపును, ఆర్టీసీని జిహెచ్‌ఎంసీలో విలీనం చేయడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ర్ట అధ్యక్షుడు సీహెచ్.రాంచందర్ డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ రీజియన్‌లోని అన్ని బస్‌డిపోలలో అద్దె బస్సుల పెంపు, జీహెచ్‌ఎంలో ఆర్టీసీని విరమించుకోవాలని కోరుతూ గెట్ ధర్నాలు నిర్వహించారు. హన్మకొండలోని వరంగల్-1, వరంగల్-2, హన్మకొండి డిపోల వద్ద ఎస్‌డబ్ల్యుఎఫ్ ఆధ్వర్యంలో గేట్ ధర్నాలు చేశారు. ఈ ధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో 1100 అద్దె బస్సులను తీసుకురావాలని ఆలోచనను యాజమాన్యం ఉపసంహరించుకోవాలన్నారు.
అద్దె బస్సులతో మిగులు కార్మికులను ఆర్టీసీ యాజమాన్యం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పెట్టుబడులు పెట్టే స్థోమత లేదనే సాకుతూ అద్దె బస్సులను తీసుకురావడం సరైన చర్య కాదన్నారు. సంస్థ సొంత బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆర్టీసీని జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుందని విమర్శించారు. దీనిని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించడం అంతిమంగా ఆర్టీసీని ముక్కలు చేయడమేనని, తద్వారా ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని అన్నారు. కార్మిక వర్గం ప్రభుత్వ కుట్రలను గమనించాలని, మరో పోరాటానికి కార్మికులు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. ఎస్‌బీటీ, ఎస్‌ఆర్‌బీఎస్ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లో ఒక రోజు మహాదీక్ష చేయనున్నట్లు తెలిపారు. దీక్షలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
'అద్దె బస్సుల పెంపును విరమించుకోవాలి'
Published Tue, Sep 22 2015 10:16 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM
Advertisement