hire buses
-
రోడ్లపై బస్సులు ఆపేస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఇష్టార్యాజ్యంగా వ్యవహరిస్తున్న అద్దె బస్సు డ్రైవర్ల జాడ్యం ఇప్పుడు బ్యాటరీ బస్సులకూ పట్టుకుంది. తొలిసారి హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. భారీ వ్యయంతో కూడుకున్నవి కావటంతో వీటిని అద్దెకు తీసుకుంది. కేంద్రం నుంచి వీటి కొనుగోలుపై వచ్చిన సబ్సిడీ కూడా ప్రైవేటు కంపెనీకే మళ్లించింది. దీంతో ఓ సంస్థ ముందుకొచ్చి హైదరాబాద్‌లో 40 బ్యాటరీ బస్సులను ప్రవేశపెట్టింది. ఉన్నట్టుండి ఆపేస్తున్నారు.. ఈ 40 బస్సుల్లో ప్రైవేటు సంస్థే డ్రైవర్ల్లను నియమిస్తుంది. వారికి సంబంధించిన వ్యవహారాలను ఆ సంస్థే చూసుకోవాలని ఒప్పందంలో ఉంది. కానీ తమ డిమాండ్లు పరిష్కారం కావట్లేదన్న పేరుతో వాటి డ్రైవర్లు ఉన్నట్టుండి బస్సులను ఆపేస్తున్నారు. మియాపూర్–2, కంటోన్మెంట్ డిపోలకు 20 బస్సుల చొప్పున కేటాయించారు. గతంలో కంటోన్మెంట్ డిపో పరిధిలోని డ్రైవర్లు బస్సులను ఆపేయగా తాజాగా మియాపూర్ డిపో డ్రైవర్లు మొండికేశారు. ఈ బస్సులు విమానాశ్రయ మార్గంలో నడుస్తాయి. ఉన్నట్టుండి బస్సులను ఆపేసేసరికి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రతిదానికీ నిరసన.. తమకు వేతనాలు తక్కువగా చెల్లిస్తున్నారని ఆ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయంలో టికెట్ల విక్రయానికి ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. కౌంటర్లో టికెట్ కొని ఎలక్ట్రిక్ బస్సు ఎక్కితే డ్రైవర్లకు కమీషన్ రావట్లేదు. బస్సులో అమ్మే టికెట్లపైనే వస్తుంది. దీంతో విమానాశ్రయంలోని కౌంటర్లను తొలగించి బస్సులోనే టికెట్లు కొనేలా ఏర్పాటు చేయాలని డ్రైవర్లు డిమాం డ్ చేస్తున్నారు. కౌంటర్లు తొలగించేది లేదని ఆర్టీసీ చెబుతోంది. తమకు సిటీలో తిరిగేందుకు ఉచిత బస్‌పాస్‌లు ఇవ్వాలని మరో డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఇంటి నుంచి తాము పనిచేసే డిపో వరకు వెళ్లేందుకు ఆర్టీసీ పాస్ ఇస్తుంది. కానీ ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహించే సంస్థ ఆర్టీసీతో చేసుకున్న ఒప్పందంలో ఈ అంశం లేకపోవటంతో ఆర్టీసీ వారికి పాస్‌లు ఇవ్వలేదు. వారికి రూట్‌పాస్ ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలి సింది. వేతనాల విషయం ఆ ప్రైవేటు సంస్థతోనే మాట్లాడుకోవాలని తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. -
అద్దె రూట్లు మళ్లీ వారికే
సాక్షి, హైదరాబాద్: అద్దె బస్సుల కాలపరిమితి పూర్తయ్యాక ఆయా రూట్లలో కొత్త బస్సులు తిప్పుకొనే వెసులుబాటును పాత యజమానులకే ఇవ్వనున్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. మళ్లీ టెండర్లు పిలవకుండా పాతవారికే కేటాయించనున్నట్టు తేల్చి చెప్పింది. కాలపరిమితి పూర్తయిన రూట్లలో కొత్త బస్సులు తీసుకునేప్పుడు టెండర్లు ఆహ్వానిస్తే నిరుద్యోగులు సహా కొత్తవారు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పాతవారికే మళ్లీ కట్టబెట్టడం వల్ల కొత్తవారికి అవకాశం లేకపోవటంతోపాటు, ఆ ప్రక్రియ ద్వారా వచ్చే ఆదాయం కోల్పోయే అవకాశం ఉంటుందంటూ ఇటీవల ‘అమ్మకానికి ఆర్టీసీ బస్సు రూట్లు’ అంటూ ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆర్టీసీ, 2008లో అద్దె ప్రాతిపదికన తీసుకున్న 507 బస్సుల్లో ఈ నెలాఖరుతో 27 బస్సుల కాలపరిమితి తీరుతుందని, వచ్చే ఏడాది నాటికి దశల వారీగా అన్ని బస్సుల గడువు పూర్తవుతుందని పేర్కొంది. గడువు పూర్తయిన వాటి స్థానంలో మళ్లీ పాతవారికే కొత్త బస్సులు నడుపుకొనే అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. టెండరు ప్రక్రియ ద్వారా వచ్చే ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉన్నా.. అది పెద్ద విషయం కాదని తెలిపింది. పాతవారికే బస్సులు కేటాయించే విషయంలో అక్రమాలకు అవకాశం లేదని చెప్పడం విశేషం. -
'అద్దె బస్సుల పెంపును విరమించుకోవాలి'
హన్మకొండ: ఆర్టీసీలో అద్దె బస్సుల పెంపును, ఆర్టీసీని జిహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ర్ట అధ్యక్షుడు సీహెచ్.రాంచందర్ డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ రీజియన్‌లోని అన్ని బస్‌డిపోలలో అద్దె బస్సుల పెంపు, జీహెచ్‌ఎంలో ఆర్టీసీని విరమించుకోవాలని కోరుతూ గెట్ ధర్నాలు నిర్వహించారు. హన్మకొండలోని వరంగల్-1, వరంగల్-2, హన్మకొండి డిపోల వద్ద ఎస్డబ్ల్యుఎఫ్ ఆధ్వర్యంలో గేట్ ధర్నాలు చేశారు. ఈ ధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో 1100 అద్దె బస్సులను తీసుకురావాలని ఆలోచనను యాజమాన్యం ఉపసంహరించుకోవాలన్నారు. అద్దె బస్సులతో మిగులు కార్మికులను ఆర్టీసీ యాజమాన్యం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పెట్టుబడులు పెట్టే స్థోమత లేదనే సాకుతూ అద్దె బస్సులను తీసుకురావడం సరైన చర్య కాదన్నారు. సంస్థ సొంత బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆర్టీసీని జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుందని విమర్శించారు. దీనిని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించడం అంతిమంగా ఆర్టీసీని ముక్కలు చేయడమేనని, తద్వారా ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని అన్నారు. కార్మిక వర్గం ప్రభుత్వ కుట్రలను గమనించాలని, మరో పోరాటానికి కార్మికులు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. ఎస్బీటీ, ఎస్ఆర్బీఎస్ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లో ఒక రోజు మహాదీక్ష చేయనున్నట్లు తెలిపారు. దీక్షలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
‘ప్రైవేటు’ బాటలో ఆర్టీసీ!
777 అద్దె బస్సులు తీసుకునేందుకు నిర్ణయం నేడు టెండర్లు ఖరారు చేసే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ మళ్లీ ‘ప్రైవేటు’ బాట పట్టింది. కొత్త బస్సులు కొనేందుకు ఆర్థిక వెసులుబాటు లేకపోవడం, ఉన్న పాత బస్సుల నిర్వహణ భారంగా పరిణమిస్తున్న నేపథ్యంలో అద్దె బస్సులపై ఆర్టీసీ దృష్టి సారించింది. వాటిని సమకూర్చుకునేందుకు శుక్రవారం టెండర్లను ఖరారు చేయబోతోంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్నందున అద్దె బస్సులను కూడా ఉమ్మడి అవసరాలకు తీసుకుంటోంది. రెండు రాష్ట్రాలకు కలిపి 777 బస్సులను సమకూర్చుకోనుంది. ఇందులో తెలంగాణకు 172 పల్లెవెలుగు, 215 ఎక్స్‌ప్రెస్ సర్వీసులను, ఆంధ్రప్రదేశ్‌కు 172 పల్లెవెలుగు, 252 ఎక్స్‌ప్రెస్ సర్వీసులను కేటాయించాలని సంస్థ నిర్ణయించింది. క్రమంగా ఆర్టీసీని ప్రైవేటీకరించే చర్యల్లో భాగంగానే అద్దె బస్సులు తీసుకుంటున్నారని మండిపడుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో 3300 అద్దె బస్సులు తిరుగుతున్నాయి. ఆర్టీసీ వాదన గతంలో తీసుకున్న అద్దె బస్సుల్లో నిర్వహణ లోపంతో ఇప్పటికే 500 బస్సులు తగ్గిపోయాయి. వచ్చే డిసెంబర్‌తో మరో 450 బస్సుల ఒప్పంద గడువు పూర్తవుతోంది. ఆ లోటును భర్తీ చేసేందుకే ఇప్పుడు కొత్తగా 777 బస్సులను సమకూర్చుకోవాల్సి వచ్చింది. కార్మిక సంఘాల వాదన ఆర్టీసీలో అద్దె బస్సులను క్రమంగా తగ్గించి సొంత బస్సులనే సమకూర్చుకుంటామని నాలుగేళ్ల క్రితం ఇచ్చిన హామీని సంస్థ విస్మరించిందనడానికి తాజా నిర్ణయమే నిదర్శనం. అద్దె బస్సుల రాకతో సంస్థలో ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంది. నైపుణ్యం లేని డ్రైవర్లతో ప్రమాదాలూ జరుగుతున్నాయి. నిర్వహణ కూడా సరిగా ఉండటం లేదు. అయినా అద్దె బస్సులనే తీసుకుంటున్నారంటే పరోక్షంగా ప్రైవేటీకరణ మొదలుపెట్టినట్టే!