అద్దె రూట్లు మళ్లీ వారికే | RTC declares to give hire buses to old owners | Sakshi
Sakshi News home page

అద్దె రూట్లు మళ్లీ వారికే

Published Mon, May 23 2016 9:04 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

అద్దె రూట్లు మళ్లీ వారికే

అద్దె రూట్లు మళ్లీ వారికే

సాక్షి, హైదరాబాద్: అద్దె బస్సుల కాలపరిమితి పూర్తయ్యాక ఆయా రూట్లలో కొత్త బస్సులు తిప్పుకొనే వెసులుబాటును పాత యజమానులకే ఇవ్వనున్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. మళ్లీ టెండర్లు పిలవకుండా పాతవారికే కేటాయించనున్నట్టు తేల్చి చెప్పింది. కాలపరిమితి పూర్తయిన రూట్లలో కొత్త బస్సులు తీసుకునేప్పుడు టెండర్లు ఆహ్వానిస్తే నిరుద్యోగులు సహా కొత్తవారు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పాతవారికే మళ్లీ కట్టబెట్టడం వల్ల కొత్తవారికి అవకాశం లేకపోవటంతోపాటు, ఆ ప్రక్రియ ద్వారా వచ్చే ఆదాయం కోల్పోయే అవకాశం ఉంటుందంటూ ఇటీవల ‘అమ్మకానికి ఆర్టీసీ బస్సు రూట్లు’ అంటూ ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది.

దీనిపై స్పందించిన ఆర్టీసీ, 2008లో అద్దె ప్రాతిపదికన తీసుకున్న 507 బస్సుల్లో ఈ నెలాఖరుతో 27 బస్సుల కాలపరిమితి తీరుతుందని, వచ్చే ఏడాది నాటికి దశల వారీగా అన్ని బస్సుల గడువు పూర్తవుతుందని పేర్కొంది. గడువు పూర్తయిన వాటి స్థానంలో మళ్లీ పాతవారికే కొత్త బస్సులు నడుపుకొనే అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. టెండరు ప్రక్రియ ద్వారా వచ్చే ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉన్నా.. అది పెద్ద విషయం కాదని తెలిపింది. పాతవారికే బస్సులు కేటాయించే విషయంలో అక్రమాలకు అవకాశం లేదని చెప్పడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement