ఆర్టీసీలో ఇక సగం అద్దె బస్సులే
కొత్త బస్సుల కొనుగోలుకు మంగళం
దాదాపు 14వేల ఉద్యోగాలకు కోత
‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖవంతం.. సురక్షితం’ అన్నది ఆర్టీసీ నినాదం. అయితే దీనికి టీడీపీ కూటమి ప్రభుత్వం మరో సరికొత్త నినాదాన్ని కూడా జోడిస్తోంది. అదే ‘అద్దె బస్సులే ముద్దు... ఆర్టీసీ బస్సులు వద్దు’. అసలు విషయమేమంటే... ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు ముగింపు పలికి అద్దె బస్సుల సంఖ్యను పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తద్వారా 14వేల ఉద్యోగాల కోతకు కూడా సిద్ధపడేలా ప్రభుత్వ ప్రణాళిక ఇలా ఉంది. – సాక్షి, అమరావతి
అద్దె బస్సులు రెట్టింపు చేద్దాం..
ఆర్టీసీలో మొత్తం 11,216 బస్సులు ఉన్నాయి. వాటిలో సొంతవి 8,465 కాగా అద్దె బస్సులు(Rental buses) 2,751 ఉన్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో అద్దె బస్సుల శాతం 24.6గా ఉంది. ఉద్యోగ భద్రత, ఉద్యోగుల సేవలను సది్వనియోగం చేసుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఆర్టీసీ(Rtc) ప్రయోజనాల పరిరక్షణ తదితర అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉంది. అందుకే అద్దె బస్సులు గరిష్టంగా 25శాతం దాటకూడదని గతంలోనే ఆర్టీసీ పాలకమండలి తీర్మానించింది.
ఈ విధానాన్ని ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు పాటించాయి. ఇలా ఉంటే, ఆర్టీసీ బస్సుల కొనుగోలు, కొత్తగా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం తదితర అంశాలపై ఇటీవల సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త బస్సుల కొనుగోలుకు నిధులు సమకూర్చలేమని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే సమీక్షా సమావేశానికి నివేదిక రూపొందించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో ఆర్టీసీ ప్రయోజనాల పరిరక్షణకు అద్దె బస్సులు గరిష్టంగా 25శాతానికి పరిమితం చేయాల్సి ఉందని ఆర్టీసీ అధికారులు నివేదించారు.
ఇక్కడే... సీఎం ఉద్దేశాన్ని గుర్తించిన ఆర్టీసీ అధికారులు ‘ప్రభుత్వం కోరితే అద్దె బస్సులను 50 శాతానికి పెంచుతాం’ అని కూడా నివేదికలో పొందుపరచడం గమనార్హం. తద్వారా ఆర్టీసీలో ప్రస్తుతం 24.6 శాతంగా ఉన్న అద్దె బస్సులను 50 శాతానికి పెంచేందుకు సిద్ధపడ్డారు. తాము అనుకున్న ప్రతిపాదనను ఆర్టీసీ అధికారులే ప్రతిపాదించేట్టుగా ప్రభుత్వం కథ నడిపించింది.
ఇక అద్దె బస్సులను 50 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకే సీఎం చంద్రబాబు పచ్చ జెండా ఊపారు. ఈ చర్యతో అద్దె బస్సులు రెట్టింపు కానున్నాయనేది సుస్పష్టం. ఈ ప్రకారంగా కొత్తగా 2,857 అద్దె బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టే.
14వేల ఉద్యోగాలకు కోతే...
సగం బస్సులు అద్దెవి కానుండటంతో ఆర్టీసీ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలగనుంది. ఒక్కో ఆర్టీసీ బస్సుకు సగటున ఐదుమంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఆ ప్రకారం కొత్తగా ప్రవేశపెట్టే 2,857 అద్దె బస్సులకు కలిపి 14,285 ఉద్యోగాలకు కోత పడనుంది. ఆర్టీసీలో ప్రస్తుతం దాదాపు 50వేల మంది ఉద్యోగులు ఉన్నారు. రిటైరయ్యే ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేస్తుందన్నది స్పష్టమవుతోంది.
అలా దశల వారీగా ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీని నిలిపివేస్తే... కొంతకాలానికి ప్రైవేటుపరమయ్యే ప్రమాదం ఉందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక అద్దె బస్సులను కూడా రాబడి అధికంగా ఉన్న రూట్లలోనే తిప్పేందుకు ఆర్టీసీ ప్రాధాన్యమిస్తుంది. దాంతో పల్లెలు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కోల్పోవాల్సి వస్తుందని కూడా విమర్శిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇవేమీ వినకుండా అద్దె బస్సుల సంఖ్యను రెట్టింపు చేయాలని స్పష్టం చేసినట్టు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment