రోడ్లపై బస్సులు ఆపేస్తున్నారు.. | Strange protest of electric bus drivers | Sakshi
Sakshi News home page

రోడ్లపై బస్సులు ఆపేస్తున్నారు..

Published Sat, Jun 1 2019 2:20 AM | Last Updated on Sat, Jun 1 2019 2:20 AM

Strange protest of electric bus drivers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో ఇష్టార్యాజ్యంగా వ్యవహరిస్తున్న అద్దె బస్సు డ్రైవర్ల జాడ్యం ఇప్పుడు బ్యాటరీ బస్సులకూ పట్టుకుంది. తొలిసారి హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. భారీ వ్యయంతో కూడుకున్నవి కావటంతో వీటిని అద్దెకు తీసుకుంది. కేంద్రం నుంచి వీటి కొనుగోలుపై వచ్చిన సబ్సిడీ కూడా ప్రైవేటు కంపెనీకే మళ్లించింది. దీంతో ఓ సంస్థ ముందుకొచ్చి హైదరాబాద్‌లో 40 బ్యాటరీ బస్సులను ప్రవేశపెట్టింది. 

ఉన్నట్టుండి ఆపేస్తున్నారు.. 
ఈ 40 బస్సుల్లో ప్రైవేటు సంస్థే డ్రైవర్ల్లను నియమిస్తుంది. వారికి సంబంధించిన వ్యవహారాలను ఆ సంస్థే చూసుకోవాలని  ఒప్పందంలో ఉంది. కానీ తమ డిమాండ్లు పరిష్కారం కావట్లేదన్న పేరుతో వాటి డ్రైవర్లు ఉన్నట్టుండి బస్సులను ఆపేస్తున్నారు. మియాపూర్‌–2, కంటోన్మెంట్‌ డిపోలకు 20 బస్సుల చొప్పున కేటాయించారు. గతంలో కంటోన్మెంట్‌ డిపో పరిధిలోని డ్రైవర్లు బస్సులను ఆపేయగా తాజాగా మియాపూర్‌ డిపో డ్రైవర్లు మొండికేశారు. ఈ బస్సులు విమానాశ్రయ మార్గంలో నడుస్తాయి. ఉన్నట్టుండి బస్సులను ఆపేసేసరికి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  

ప్రతిదానికీ నిరసన.. 
తమకు వేతనాలు తక్కువగా చెల్లిస్తున్నారని ఆ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయంలో టికెట్ల విక్రయానికి ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. కౌంటర్‌లో టికెట్‌ కొని ఎలక్ట్రిక్‌ బస్సు ఎక్కితే డ్రైవర్లకు కమీషన్‌ రావట్లేదు. బస్సులో అమ్మే టికెట్లపైనే వస్తుంది. దీంతో విమానాశ్రయంలోని కౌంటర్లను తొలగించి బస్సులోనే టికెట్లు కొనేలా ఏర్పాటు చేయాలని డ్రైవర్లు డిమాం డ్‌ చేస్తున్నారు. కౌంటర్లు తొలగించేది లేదని ఆర్టీసీ చెబుతోంది. తమకు సిటీలో తిరిగేందుకు ఉచిత బస్‌పాస్‌లు ఇవ్వాలని మరో డిమాండ్‌ తెరపైకి తెచ్చారు.

ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఇంటి నుంచి తాము పనిచేసే డిపో వరకు వెళ్లేందుకు ఆర్టీసీ పాస్‌ ఇస్తుంది. కానీ ఎలక్ట్రిక్‌ బస్సులను నిర్వహించే సంస్థ ఆర్టీసీతో చేసుకున్న ఒప్పందంలో ఈ అంశం లేకపోవటంతో ఆర్టీసీ వారికి పాస్‌లు ఇవ్వలేదు. వారికి రూట్‌పాస్‌ ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలి సింది. వేతనాల విషయం ఆ ప్రైవేటు సంస్థతోనే మాట్లాడుకోవాలని తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement