‘ప్రైవేటు’ బాటలో ఆర్టీసీ!
777 అద్దె బస్సులు తీసుకునేందుకు నిర్ణయం
నేడు టెండర్లు ఖరారు చేసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ మళ్లీ ‘ప్రైవేటు’ బాట పట్టింది. కొత్త బస్సులు కొనేందుకు ఆర్థిక వెసులుబాటు లేకపోవడం, ఉన్న పాత బస్సుల నిర్వహణ భారంగా పరిణమిస్తున్న నేపథ్యంలో అద్దె బస్సులపై ఆర్టీసీ దృష్టి సారించింది. వాటిని సమకూర్చుకునేందుకు శుక్రవారం టెండర్లను ఖరారు చేయబోతోంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్నందున అద్దె బస్సులను కూడా ఉమ్మడి అవసరాలకు తీసుకుంటోంది. రెండు రాష్ట్రాలకు కలిపి 777 బస్సులను సమకూర్చుకోనుంది. ఇందులో తెలంగాణకు 172 పల్లెవెలుగు, 215 ఎక్స్‌ప్రెస్ సర్వీసులను, ఆంధ్రప్రదేశ్‌కు 172 పల్లెవెలుగు, 252 ఎక్స్‌ప్రెస్ సర్వీసులను కేటాయించాలని సంస్థ నిర్ణయించింది. క్రమంగా ఆర్టీసీని ప్రైవేటీకరించే చర్యల్లో భాగంగానే అద్దె బస్సులు తీసుకుంటున్నారని మండిపడుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో 3300 అద్దె బస్సులు తిరుగుతున్నాయి.
ఆర్టీసీ వాదన
గతంలో తీసుకున్న అద్దె బస్సుల్లో నిర్వహణ లోపంతో ఇప్పటికే 500 బస్సులు తగ్గిపోయాయి. వచ్చే డిసెంబర్‌తో మరో 450 బస్సుల ఒప్పంద గడువు పూర్తవుతోంది. ఆ లోటును భర్తీ చేసేందుకే ఇప్పుడు కొత్తగా 777 బస్సులను సమకూర్చుకోవాల్సి వచ్చింది.
కార్మిక సంఘాల వాదన
ఆర్టీసీలో అద్దె బస్సులను క్రమంగా తగ్గించి సొంత బస్సులనే సమకూర్చుకుంటామని నాలుగేళ్ల క్రితం ఇచ్చిన హామీని సంస్థ విస్మరించిందనడానికి తాజా నిర్ణయమే నిదర్శనం. అద్దె బస్సుల రాకతో సంస్థలో ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంది. నైపుణ్యం లేని డ్రైవర్లతో ప్రమాదాలూ జరుగుతున్నాయి. నిర్వహణ కూడా సరిగా ఉండటం లేదు. అయినా అద్దె బస్సులనే తీసుకుంటున్నారంటే పరోక్షంగా ప్రైవేటీకరణ మొదలుపెట్టినట్టే!