కుర్తి తండాలో ప్రజా పాలన కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
నిజాంసాగర్(జుక్కల్): ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదిన్నరేళ్లు గడిచిపోయినా ప్రజల ఆకాంక్షలు, అమరుల ఆశలు నెరవేరలేదు. వాటిని నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు భావించి అధికారంలోకి తీసుకువచ్చారు’అని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ కోటను సందర్శించిన అనంతరం బిచ్కుంద, పిట్లం మండలాల్లోని ఎల్లారం తండా, కుర్తి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధనిక రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్‌కు అప్పజెప్పితే ఇప్పుడు రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. అయినా ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తొలి సంతకం చేశారని, ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో జుక్కల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు తోట లక్ష్మికాంతరావు, సంజీవ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేశ్.వి.పాటిల్, ఎస్పీ సింధూశర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment