free travelling
-
Lok Sabha Election 2024: ఓటేస్తే ఉచిత బైక్ రైడ్
అవును! పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఓటేసి.. తిరిగి ఇంటికి వెళ్లేప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుంటే చాలు. ఉచితంగా ఇంటికి తీసుకెళ్లి దింపేస్తారు. ఓహో సూపరని ఆనందిస్తున్నారా? అయితే ఈ ఆఫర్ మన రాష్ట్రంలో కాదు. దేశ రాజధాని ఢిల్లీలో. అక్కడ ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ సంస్థలు పాటుపడుతున్నాయి. ర్యాపిడో ఈ ప్రక్రియలో భాగస్వామ్యమైంది. ఓటర్లు ఓటేసిన అనంతరం పోలింగ్ బూత్‌ల నుంచి ఇంటికి చేరుకునేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలి్పంచింది. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బైక్ టాక్సీ కంపెనీతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మే 25న ఢిల్లీ లోక్‌సభ పోలింగ్ రోజున జరగనుంది. ఆ రోజు ఓటేసిన అనంతరం ప్రయాణికులు బైక్ బుక్ చేసుకుని ఉచితంగా ప్రయాణించవచ్చు. ఢిల్లీలో 80 లక్షల మంది ర్యాపిడో సబ్స్క్రైబర్లు ఉండగా.. ఆ సంస్థకు ఎనిమిది లక్షల మంది బైక్ డ్రైవర్లు ఉన్నారు. -
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడి...ఇంకా ఇతర అప్డేట్స్
-
గత పాలనలో ధనిక రాష్ట్రం అప్పులపాలు
నిజాంసాగర్(జుక్కల్): ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదిన్నరేళ్లు గడిచిపోయినా ప్రజల ఆకాంక్షలు, అమరుల ఆశలు నెరవేరలేదు. వాటిని నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు భావించి అధికారంలోకి తీసుకువచ్చారు’అని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ కోటను సందర్శించిన అనంతరం బిచ్కుంద, పిట్లం మండలాల్లోని ఎల్లారం తండా, కుర్తి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధనిక రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్‌కు అప్పజెప్పితే ఇప్పుడు రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. అయినా ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తొలి సంతకం చేశారని, ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో జుక్కల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు తోట లక్ష్మికాంతరావు, సంజీవ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేశ్.వి.పాటిల్, ఎస్పీ సింధూశర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా కొన్ని పల్లెలకు చేరని ‘మహాలక్ష్మి’ భాగ్యం!
చిలుకూరు: రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల అమల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. కానీ పలు గ్రామాల్లోని మహిళలకు ఈ పథకం అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో గ్రామీణ మహిళలు ఈ పథకానికి దూరమవుతున్నారు. తాము ఆటోలు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నామని, పల్లెలకు బస్సులు నడిపించాలని వారు కోరుతున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో కోదాడ, సూర్యాపేట డిపోలు ఉన్నాయి. కోదాడ డిపో పరిధిలో పల్లెవెలుగు బస్సులు 40, ఎక్స్‌ప్రెస్‌లు 18 ఉన్నాయి. సూర్యాపేట ఆర్టీసీ డిపో పరిధిలో పల్లెవెలుగు బస్సులు 62, ఎక్స్‌ప్రెస్‌లు 45 ఉన్నాయి. ఈ రెండు డిపోల్లో మరో 25 వరకు అద్దె బస్సులు ఉన్నాయి. కోదాడ డిపో పరిధిలోని చిలుకూరు మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం జాతీయ రహదారిపై ఉన్న చిలుకూరు మండల కేంద్రం, సీతారాంపురం గ్రామాలకు మాత్రమే ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. బేతవోలు, ఆచార్యులగూడెం, చెన్నారిగూడెం, నారాయణపురం తదితర ప్రధాన గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. అదేవిధంగా మునగాల మండల పరిధిలోని 22 గ్రామాలకు నరసింహులగూడెం తప్ప ఏ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ప్రధానంగా నేలమర్రి, కలకోవ, జగన్నాథపురం తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. నడిగూడెం మండల పరిధిలో నడిగూడెంతో పాటు రామచంద్రాపురం, సిరిపురం, రత్నవరం తదితర ప్రధాన గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం లేదు. కోదాడ మండల పరిధిలో ఎర్రవరం గ్రామానికి వెళ్లే రహదారిలో తప్ప మిగిలిన గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. హుజూర్నగర్ పరిధిలో సైతం జాతీయ రహదారుల వెంట ఉన్న గ్రామాలు, ప్రసిద్ది చెందిన పుణ్య క్షేత్రాలకు వెళ్లే రహదారులకు తప్ప మిగిలిన గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం లేదు. ఇక.. సూర్యాపేట ఆర్టీసీ డిపో పరిధిలో కండగట్ల, యల్కారం, సోల్‌పేట, రామచంద్రాపురం, లోయపల్లి, కుంచమర్తి, మాచిడిరెడ్డి పల్లి, మామిడిపల్లి తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. బస్సు సౌకర్యం కల్పించాలి మా గ్రామానికి ఆర్టీసీ బస్సులు రావడం లేదు. దీంతో మేము ఉచిత బస్సు ప్రయాణం పథకానికి దూరమవుతున్నాం. గతంలో మా గ్రామానికి ఆర్టీసీ బస్సు వచ్చేది. ఇప్పుడు రావడం లేదు. కేవలం ఆటోలే దిక్కు. పల్లెలకు బస్సు సౌకర్యం కల్పించాలి. – కల్పన, జెర్రిపోతులగూడెం, చిలుకూరు మండలం కేవలం ప్రధాన రహదారులకే.. కరోనా అనంతరం ప్రజలు వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆదాయం రావడం లేదని, పల్లెలకు ఆర్టీసీ బస్సులను రద్దు చేసింది. దీనికి తోడు కాలం చెల్లిన వాటి స్థానంలో నూతన బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో కేవలం ఆదాయం వచ్చే ప్రధాన రహదారుల్లోనే బస్సులు నడపిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించడంతో తమ గ్రామాలకు బస్సులను నడపాలని గ్రామీణ ప్రాంత మహిళలు వేడుకుంటున్నారు. -
ఉచిత ప్రయాణానికి ఆర్టీసీ లెక్కలు.. అధ్యయనానికి బెంగుళూరుకు బృందం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఏయే కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ఎంత భారం పడనుందనే విషయంలో ఆర్టీసీ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ పథకం ఎలా అమలవుతోంది, అక్కడ ఎంత ఖర్చవుతోంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తోంది..అన్న విషయాలను పరిశీలించేందుకు నలుగురు ఆర్టీసీ అధికారుల బృందం బెంగళూరుకు వెళ్తోంది. రెండు రోజుల పాటు అక్కడ పరిశీలించి నివేదికను సిద్ధం చేయనుంది. అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రావటంతో అధికారులు పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కొలువుదీరబోతోంది. దీంతో వీలైనంత తొందరలో ఈ పథకం అమలు చేసే అవకాశం ఉన్నందున, ముఖ్యమంత్రి అడిగిన వెంటనే నివేదిక అందజేసేందుకు వీలుగా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కూడా అమలు చేస్తే.. దక్షిణాదిలో తొలుత తమిళనాడు రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించారు. కానీ అక్కడ, కేవలం నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో ఉండే బస్సులను అందుబాటులోకి తెచ్చారు. వాటిల్లోనే ఈ వెసులుబాటు ఉంటుంది. కానీ, కర్ణాటకలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఈ వసతి కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని ప్రకటించింది. అధికారంలోకి రావటంతో దాన్ని అమలులోకి తెచ్చింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ కర్ణాటక మోడల్‌ను అనుసరిస్తుందా, తమిళనాడు మోడల్‌ను చేపడుతుందా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కర్ణాటక తరహాలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే సాలీనా రూ.2200 కోట్లు అవుతుంది. పల్లెవెలుగు బస్సులకే పరిమితం చేస్తే ఏటా రూ.750 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సింది ప్రతినెలా దాదాపు రూ.185 కోట్లు.. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైతే, ఆ రూపంలో ఆర్టీసీ కోల్పోయే టికెట్ ఆదాయాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ కేటగిరీ బస్సుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తే సాలీనా రూ.2200 కోట్ల వరకు రీయింబర్స్ చేయాలి. అంటే ప్రతి నెలా రూ.185 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. జీరో టికెట్ ప్రవేశపెడతారా..? ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారన్నది లెక్క తేలాల్సి ఉంటుంది. ఇందుకోసం కర్ణాటకలో జీరో టికెట్ విధానం ప్రారంభించారు. మహిళలకు రూ.సున్నా అని ఉండే జీరో టికెట్‌ను జారీ చేస్తారు. అలా రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి నెలవారీగా లెక్కిస్తారు. ఇక్కడ అదే పద్ధతి ప్రవేశపెడతారా లేక మరో విధానాన్ని అనుసరిస్తారా అన్నది తేలాల్సి ఉంది. -
రైల్వే ఉద్యోగులకు భారీ ఊరట
సాక్షి, ముంబై: రైల్వే శాఖ తమ ఉద్యోగులకు భారీ ఊరట కల్పించింది. వ్యాధితో బాధపడుతున్న పిల్లలచికిత్స నిమిత్తం వెళ్లే సమయంలో వారి తల్లిదండ్రులు కూడా రైళ్లలో ఉచితంగా ప్రయాణించే వెసులు బాటును కల్పించింది. ఈ మేరకు ఇప్పటికే ఉన్న రైల్వే సేవకులకు (పాస్) నిబంధనలను సడలించింది. తమ పిల్నల్ని చికిత్స కోసం ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తీసుకెళ్లాల్సి వస్తే..ఇక మీదట రైళ్లలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది. గతంలోని పాస్ రూల్స్ లో ఉన్న నిబంధనల ప్రకారం, రైల్వే ఉద్యోగికి చెందిన పిల్లలు మంచానికి పరిమితమైనా, లేదా కూర్చోలేని స్థితిలో ఉన్నా చికిత్స నిమిత్తం వారి వెంట ఒక వ్యక్తి మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంది. అదీ వైద్య అధికారి సిఫారసు మీద మాత్రమే. బిడ్డ తల్లిదండ్రుల సమక్షంలో సురక్షితంగా ఉంటుందనీ, ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు, వారి అవసరం చాలా ఉంటుందని రైల్వే మంత్రి పియూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్లో ఉన్న నిబంధనలను సవరించడానికి రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే సర్వెంట్స్ (పాస్) రూల్స్ VII (స్పెషల్ పాస్స్), 1986 నిబంధనల్లో సవరణలు తీసుకొచ్చింది. -
రైలులో పుట్టాడు.. బంపర్ ఆఫర్ కొట్టాడు..!
పారిస్ : రైలులో జన్మించిన ఓ శిశువుకు ఫ్రెంచ్ రైల్వే శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అతడికి 25 ఏళ్లు వచ్చేవరకు రైలులో ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించింది. అసలేం జరిగిందంటే... సోమవారం రైలులో ప్రయాణిస్తున్న మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఉదయం 11 గంటల 40 నిమిషాలకు ప్రసవించింది. ఊహించని పరిణామానికి కంగుతిన్న రైల్వే సిబ్బంది.. సెంట్రల్ ప్యారిస్‌లోని ఔబర్ స్టేషన్లో రైలును ఆపి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో.. బిజీగా ఉండే సెంట్రల్ ప్యారిస్ రైల్వే మార్గంలో 45 నిమిషాల పాటు రైళ్లు నిలిచిపోయాయని రైల్వే అధికారి తెలిపారు. అయితే ప్రసవ సమయంలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో 15 మంది రైల్వే సిబ్బంది ఆ మహిళకు సాయంగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని... రైలులో జన్మించిన ఈ బుడతడికి తమ వంతు కానుకగా 25 ఏళ్ల పాటు రైలులో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నామని ఆర్టీఏపీ (ప్యారిస్ ప్రజా రవాణా వ్యవస్థ) ప్రకటించింది. -
హాల్ టికెట్ చూపిస్తే.. ఉచిత ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి తెలిపారు. ఈ పరీక్షలకు 6,52,692 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలను ప్రశాంతంగా రాయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులతో ప్రేమపూర్వకంగా వ్యవహరించి సూచనలు అందించాలని చీఫ్సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లకు సూచిస్తున్నామన్నారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోవడానికి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. హాల్‌టికెట్లు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఈమేరకు ఆర్టీసీ అధికారులు అంగీకరించారని తెలిపారు. శుక్రవారం సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సమావేశంలో జాయింట్ డైరక్టర్ భార్గవ, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యాంశాలు.. * పరీక్షలు మార్చి 26 నుంచి ఏప్రిల్ 11 వరకు ఉదయం 9 నుంచి 12 వరకు జరుగుతాయి. విద్యార్థుల హాల్ టికెట్లు, నామినల్‌రోల్స్‌ను స్కూళ్లకు పంపించారు. * ఏ పాఠశాలకైనా హాల్‌టికెట్లు అందకుంటే ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈఏపీ.ఓఆర్జీ’ అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని హెడ్మాస్టర్ల సంతకం, స్టాంపులతో విద్యార్థులకు జారీచేయాలి. అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, స్క్వాడ్ల నియామకం పూర్తయ్యింది. హైదరాబాద్ కేంద్రంగానే పరీక్షలు పర్యవేక్షిస్తారు. * డైరక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూము ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా అవసరమైతే 040-23237343, 040-23237344 నంబర్లను సంప్రదించాలి. * అంధ, మూగ, బధిర తదితర అంగవైకల్యం ఉన్న విద్యార్థులకు పరీక్షల్లో పాస్‌మార్కులు 35 నుంచి 20కి తగ్గించారు. జంబ్లింగ్ విధానం వీరికి ఉండదు. పరీక్షరాసేందుకు వీరికి అదనంగా అరగంట సమయం ఇస్తారు. డెస్లైక్జియా వ్యాధిగ్రస్థులు తృతీయ భాష పరీక్ష రాయనక్కర్లేదు. వారికి స్క్రైబ్ సదుపాయం. గంట అదనపు సమయం. విద్యార్థులు చేయాల్సిన పనులు.. పరీక్షకేంద్రం ఎక్కడున్నదో ఒకరోజు ముందు గా చూసుకోవాలి. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షరాసేందుకు ప్యాడ్‌ను తీసుకువెళ్లాలి. సరిపడ పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేళ్లు తీసుకువెళ్లాలి. ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్కు జతచేసి ఇచ్చిన ఓఎమ్మార్ షీట్ తమదేనని ధ్రువీకరించుకున్నాకనే పరీక్ష రాయడం ప్రారంభించాలి. అడిషనల్ ఆన్సర్‌షీట్లు, గ్రాఫ్, బిట్పేపర్లను మెయిన్ ఆన్సర్ షీట్‌తో దారంతో గట్టిగా కట్టాలి. మెయిన్ ఆన్సర్‌షీట్‌పై ఉన్న సీరియల్ నంబర్‌ను అడిషనల్ షీట్లు, గ్రాఫ్, మ్యాప్, బిట్పేపర్లపై తప్పనిసరిగా రాయాలి. స్కూలు యూనిఫారాలతో కాకుండా సాధారణ దుస్తులతో పరీక్షలకు రావాలి. చేయకూడనివి సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రాల్లోకి తీసుకుపోరాదు. హాల్ టికెట్ తప్ప ఇతర పత్రాలు కేంద్రాల్లోకి అనుమతించరు. హాల్ టికెట్ రోల్ నంబర్లను మెయిన్ ఆన్సర్ షీట్లో కానీ, అడిషనల్, బిట్, మ్యాప్, గ్రాఫ్ షీట్లతో సహ ఎక్కడా రాయకూడదు. పేరు, సంతకం, ఏ విధమైన గుర్తింపు చిహ్నాలు ఆన్సర్ షీట్లలో రాయకూడదు.