హాల్ టికెట్ చూపిస్తే.. ఉచిత ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి తెలిపారు. ఈ పరీక్షలకు 6,52,692 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలను ప్రశాంతంగా రాయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులతో ప్రేమపూర్వకంగా వ్యవహరించి సూచనలు అందించాలని చీఫ్‌సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లకు సూచిస్తున్నామన్నారు.
పరీక్ష కేంద్రాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోవడానికి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. హాల్‌టికెట్లు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఈమేరకు ఆర్టీసీ అధికారులు అంగీకరించారని తెలిపారు. శుక్రవారం సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సమావేశంలో జాయింట్ డైరక్టర్ భార్గవ, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యాంశాలు..
* పరీక్షలు మార్చి 26 నుంచి ఏప్రిల్ 11 వరకు ఉదయం 9 నుంచి 12 వరకు జరుగుతాయి. విద్యార్థుల హాల్ టికెట్లు, నామినల్‌రోల్స్‌ను స్కూళ్లకు పంపించారు.
* ఏ పాఠశాలకైనా హాల్‌టికెట్లు అందకుంటే ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈఏపీ.ఓఆర్‌జీ’ అనే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని హెడ్మాస్టర్ల సంతకం, స్టాంపులతో విద్యార్థులకు జారీచేయాలి. అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, స్క్వాడ్ల నియామకం పూర్తయ్యింది. హైదరాబాద్ కేంద్రంగానే పరీక్షలు పర్యవేక్షిస్తారు.
* డైరక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూము ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా అవసరమైతే 040-23237343, 040-23237344 నంబర్లను సంప్రదించాలి.
* అంధ, మూగ, బధిర తదితర అంగవైకల్యం ఉన్న విద్యార్థులకు పరీక్షల్లో పాస్‌మార్కులు 35 నుంచి 20కి తగ్గించారు. జంబ్లింగ్ విధానం వీరికి ఉండదు. పరీక్షరాసేందుకు వీరికి అదనంగా అరగంట సమయం ఇస్తారు. డెస్లైక్జియా వ్యాధిగ్రస్థులు తృతీయ భాష పరీక్ష రాయనక్కర్లేదు. వారికి స్క్రైబ్ సదుపాయం. గంట అదనపు సమయం.
విద్యార్థులు చేయాల్సిన పనులు..
పరీక్షకేంద్రం ఎక్కడున్నదో ఒకరోజు ముందు గా చూసుకోవాలి. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షరాసేందుకు ప్యాడ్‌ను తీసుకువెళ్లాలి. సరిపడ పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేళ్లు తీసుకువెళ్లాలి. ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్‌కు జతచేసి ఇచ్చిన ఓఎమ్మార్ షీట్ తమదేనని ధ్రువీకరించుకున్నాకనే పరీక్ష రాయడం ప్రారంభించాలి. అడిషనల్ ఆన్సర్‌షీట్లు, గ్రాఫ్, బిట్‌పేపర్లను మెయిన్ ఆన్సర్ షీట్‌తో దారంతో గట్టిగా కట్టాలి. మెయిన్ ఆన్సర్‌షీట్‌పై ఉన్న సీరియల్ నంబర్‌ను అడిషనల్ షీట్లు, గ్రాఫ్, మ్యాప్, బిట్‌పేపర్లపై తప్పనిసరిగా రాయాలి. స్కూలు యూనిఫారాలతో కాకుండా సాధారణ దుస్తులతో పరీక్షలకు రావాలి.
చేయకూడనివి
సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రాల్లోకి తీసుకుపోరాదు. హాల్ టికెట్ తప్ప ఇతర పత్రాలు కేంద్రాల్లోకి అనుమతించరు. హాల్ టికెట్ రోల్ నంబర్లను మెయిన్ ఆన్సర్ షీట్లో కానీ, అడిషనల్, బిట్, మ్యాప్, గ్రాఫ్ షీట్లతో సహ ఎక్కడా రాయకూడదు. పేరు, సంతకం, ఏ విధమైన గుర్తింపు చిహ్నాలు ఆన్సర్ షీట్లలో రాయకూడదు.