గొర్రెల పంపిణీ కుంభకోణంపై ఏసీబీ నిర్ధారణ
నిందితులు రాంచందర్,కల్యాణ్‌కుమార్‌ను కస్టడీకి తీసుకుని విచారించనున్న దర్యాప్తు సంస్థ
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో రూ.వందల కోట్లు గోల్‌మాల్ అయినట్టు ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. ఓవైపు కీలక ఆధారాలు సేకరిస్తూ.. మరోవైపు వరుస అరెస్టులతో ఏసీబీ అధికారులు ఈ కేసులో వేగం పెంచారు.
తాజాగా శుక్రవారం ఏసీబీ అధికారులు తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్‌కుమార్‌ను అరెస్టు చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.
ఈ కుంభకోణం వెనక కీలక సూత్రధారులుగా ఈ ఇద్దరు వ్యవహరించినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులు గొర్రెల పంపిణీ పథకం అమలు వ్యవహారంలోకి తేవడంలో ఈ ఇద్దరు అధికారులది ముఖ్యపాత్ర అని నిర్ధారణ అయ్యింది.
ఇంకా ఎన్ని రూ.కోట్లు మింగారో?
తొలుత రూ.2.10 కోట్ల అవినీతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు.. దర్యాప్తులో ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం రూ.700 కోట్లకుపైనే అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా ఎన్ని రూ.కోట్ల అవినీతి బయటికి వస్తుందోనన్న చర్చ జరుగుతోంది.
శుక్రవారం అరెస్టయిన సబావత్ రాంచందర్, కల్యాణ్‌కుమార్‌ను జ్యుడీíÙయల్ కస్టడీకి తరలించారు. వీరిద్దరినీ తిరిగి పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఇద్దరు నిందితులను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది.
ఆ ఇద్దరి వెనుక ఎవరైనా ఉన్నారా?
కల్యాణ్‌కుమార్, రాంచందర్‌లే ఈ కుంభకోణానికి పాల్పడ్డారా..? వారి వెనుక ఇంకెవరైనా కీలక వ్యక్తులు ఉన్నారా..? అన్న కోణాల్లోనూ ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు అనుమతితో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే ఇంకేవైనా కొత్త పేర్లు తెరపైకి వస్తాయా..?అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment