distribution of sheep
-
వందల కోట్ల గోల్మాల్!
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో రూ.వందల కోట్లు గోల్మాల్ అయినట్టు ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. ఓవైపు కీలక ఆధారాలు సేకరిస్తూ.. మరోవైపు వరుస అరెస్టులతో ఏసీబీ అధికారులు ఈ కేసులో వేగం పెంచారు. తాజాగా శుక్రవారం ఏసీబీ అధికారులు తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్‌కుమార్‌ను అరెస్టు చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కుంభకోణం వెనక కీలక సూత్రధారులుగా ఈ ఇద్దరు వ్యవహరించినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులు గొర్రెల పంపిణీ పథకం అమలు వ్యవహారంలోకి తేవడంలో ఈ ఇద్దరు అధికారులది ముఖ్యపాత్ర అని నిర్ధారణ అయ్యింది. ఇంకా ఎన్ని రూ.కోట్లు మింగారో? తొలుత రూ.2.10 కోట్ల అవినీతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు.. దర్యాప్తులో ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం రూ.700 కోట్లకుపైనే అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా ఎన్ని రూ.కోట్ల అవినీతి బయటికి వస్తుందోనన్న చర్చ జరుగుతోంది. శుక్రవారం అరెస్టయిన సబావత్ రాంచందర్, కల్యాణ్‌కుమార్‌ను జ్యుడీíÙయల్ కస్టడీకి తరలించారు. వీరిద్దరినీ తిరిగి పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఇద్దరు నిందితులను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది.ఆ ఇద్దరి వెనుక ఎవరైనా ఉన్నారా?కల్యాణ్‌కుమార్, రాంచందర్లే ఈ కుంభకోణానికి పాల్పడ్డారా..? వారి వెనుక ఇంకెవరైనా కీలక వ్యక్తులు ఉన్నారా..? అన్న కోణాల్లోనూ ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు అనుమతితో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే ఇంకేవైనా కొత్త పేర్లు తెరపైకి వస్తాయా..?అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది. -
TS: పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసు
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పీఎస్‌లో పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసు నమోదైంది. గొర్రెల పంపిణీలో అవకతకలు జరిగాయంటూ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకం అమలులో అవకతవకలు చోటుచేసుకున్నాయి. గొర్రెల పంపిణీ కోసం గుంటూరు జిల్లా నుండి అధికారులు గొర్రెలను తీసుకొచ్చారు. గొర్రెలను ఇచ్చిన వారికి బదులు ఇతరుల ఖాతాలోకి నగదు జమ అయ్యిందని, మొత్తం 2 కోట్ల రూపాయలు మోసం జరిగిందని గచ్చిబౌలిలో ఫిర్యాదు చేశారు. పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.. పలువురు అధికారులకు నోటీసులు జారీ చేశారు. -
కోడ్ కూత ‘కంగాళీ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుంచి అమల్లోకి వచ్చిన ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ (కోడ్) ఏయే పథకాలకు వర్తిస్తుందనే అంశంపై ప్రభుత్వ వర్గాల్లో గందరగోళం నెలకొంది. గతంలో ఉన్న పథకాలే అయినప్పటికీ ఆ పథకం కింద కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసే వెసులుబాటు కోడ్ అమల్లో ఉంటే సాధ్యం కాదు. కానీ, ఈ కోడ్ సాకుగా కొన్ని పాత పథకాలు, ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసిన పథకాలను అమలు చేయడంలో కొందరు అధికారుల గందరగోళ వైఖరి చర్చకు దారితీస్తోంది. రెవెన్యూ కార్యకలాపాలు ‘యథాతథం’ ఇక, కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రెవెన్యూ కార్యకలాపాల్లో ఎలాంటి అవాంతరాలు ఉండవని, రెవెన్యూ సిబ్బంది ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమవుతారే తప్ప దైనందిన రెవెన్యూ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ధ్రువీకరణ పత్రాల మంజూరు, ధరణి దరఖాస్తుల పరిష్కారం లాంటివి కోడ్ కారణంగా ఆగిపోవని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న జీవో 58, 59ల ద్వారా భూముల క్రమబద్ధీకరణ కూడా ఆగదని అంటున్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి కూడా ఒక విడత నిధులు మంజూరైన లబ్ధిదారునికి రెండో విడత నిధులు మంజూరుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా అధికారులు చెబుతున్నారు. జిల్లాకో తీరుగా గొర్రెల పంపిణీ సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం విషయంలో ఎన్నికల కోడ్‌ను జిల్లాకో రీతిలో అమలుపరుస్తున్న తీరు విస్మయపరుస్తోంది. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు రెండో విడత రాష్ట్రంలో అమలవుతోంది. మొత్తం 3.5లక్షలకు పైగా లబ్ధిదారులను ఎంపిక చేయగా, అందులో 1.25లక్షల మందికి పైగా లబ్ధిదారులు వారి వాటా మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేశారు. ఇందులో కోడ్ అమల్లోకి వచ్చే నాటికి కేవలం 28వేల మందికి మాత్రమే గొర్రెలు పంపిణీ చేశారు. ఇక కోడ్ అమల్లోకి వచ్చిందే తడవుగా ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకోకుండా చేతులెత్తేసిన పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్ణయాధికారాన్ని పూర్తిగా కలెక్టర్లకు వదిలేశారు. దీంతో కొన్ని జిల్లాల కలెక్టర్లు గొర్రెలను పంపిణీ చేయవద్దని ఆదేశాలు జారీ చేస్తుండడంతో ఆయా జిల్లాల్లో గొర్రెల కొనుగోళ్ల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన పశుసంవర్ధక శాఖ అధికారులు వెనక్కు వచ్చేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో మాత్రం కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా యథావిధిగా కొనుగోళ్లు చేస్తుండడం గమనార్హం. కొసమెరుపేమిటంటే... 2018 ఎన్నికల సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన తర్వాత గొర్రెల పథకం అమలు కావడం గమనార్హం. ఆ బాధ్యత అధికారులదే.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుపై సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘కోడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు, ప్రజలపై ఉంది. కోడ్ అడ్డురాని పథకాలను, కార్యక్రమాలను, జీవోలను, రోజువారీ కార్యకలాపాలను యథాతథంగా అమలు చేసే బాధ్యత అధికారులదే. ఈ విషయంలో అధికారులదే తుది నిర్ణయం’ అని స్పష్టం చేశారు. డబ్బుల్లేవని కోడ్ మాట చెపుతున్నారు ‘అసలు కోడ్‌కు గొర్రెల పథకానికి సంబంధం లేదు. 2018లో ఎన్నికలు జరిగే రోజున కూడా గొర్రెలు పంపిణీ చేశారు. ఇప్పుడు కూడా కోడ్ సమస్య కాదు. సరిగా నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేసి గొల్లకుర్మలను మోసం చేసింది. ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓట్లేస్తారనే భయంతో కోడ్ అనే సాకు చూపెడుతున్నారు.’ – ఉడుత రవీందర్, జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
రుణమెప్పుడొస్తది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం అమలుకు అవసరమైన నిధులను రుణం కింద సమకూర్చుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వెంటనే సబ్సిడీ గొర్రెల పంపిణీ చేపట్టాలని సీఎం కేసీఆర్ స్వయంగా ఆదేశాలిచ్చారు. ఆ మేరకు పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా ఏర్పాట్లు కూడా చకచకా చేస్తున్నారు. కానీ, ఈ పథకం రెండో దఫా రాష్ట్రంలో అమలు చేయాలంటే రూ.4,565 కోట్ల రుణం కావాలి. ఈ రుణాన్నిచ్చేందుకు జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్సీడీసీ) ఆమోదం తెలిపి కూడా ఆరునెలలు దాటిపోయింది. కానీ, ప్రభుత్వ పూచీకత్తు లభించకపోవడంతో ఆ ఆమోదం కాగితాలకే పరిమితం అయింది. ఇప్పుడు కేబినెట్ ఆమోదంతో ఆ రుణం ఎప్పుడు వస్తుందా అని పశుసంవర్ధక శాఖ అధికారులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటివరకు గొర్రెల కొనుగోలు కోసం తమ వద్ద ఉన్న రూ.100 కోట్ల వరకు ఖర్చు పెట్టగలమని, ఆ తర్వాత ఎన్సీడీసీ రుణంపైనే ఆధారపడాల్సి ఉంటుందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు రుణం వస్తుందనే ఆశతో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అమలుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. నగదు బదిలీతో కాదు.. వాస్తవానికి, ఈ పథకం కింద గొర్రెల పంపిణీని నగదు బదిలీ ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించినా ఆ తర్వాత వెనక్కు తగ్గింది. పైలట్‌గా నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమచేసి గొర్రెలు కొనుగోలు చేపట్టింది. ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురుకావడంతో మళ్లీ పాత తరహాలోనే ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సన్నాహాలు జరుగుతున్నాయి. కొనుగోలు చేసిన గొర్రెలను లబ్దిదారుల వద్దకు చేర్చేందుకు అవసరమైన రవాణా కాంట్రాక్టు టెండర్లను జిల్లా స్థాయిలో పిలవగా, ఇప్పుడు ఆ ప్రక్రియ జరుగుతోంది. ఈ టెండర్ల ఖరారయిన తర్వాత గొర్రెల కొనుగోలు, పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెపుతున్నారు. కొనుగోలు బాధ్యత జిల్లా అధికారులకు.. కొనుగోలు కోసం జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పజెపుతున్నారు. గతంలో మండల స్థాయిలో పశుసంవర్ధక శాఖ అధికారులతో కొనుగోళ్లు జరిపించగా, ఈసారి మాత్రం జిల్లా స్థాయి అధికారులతో (డీఆర్వో, ఆర్డీవో, పీడీ డీఆర్డీఏ, జిల్లా వ్యవసాయాధికారులు, ఇతర శాఖలకు చెందిన జిల్లా అధికారులు) కొనుగోలు ప్రక్రియ చేపట్టనున్నారు. గొర్రెల కోసం ఇప్పటివరకు 30వేల మందిలోపు లబ్దిదారులే డీడీలు తీయగా, మిగిలిన వారి చేత కూడా డీడీలు కట్టించే పనిలో స్థానిక అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం మీద ఏప్రిల్ 14 తర్వాత రెండో విడత గొర్రెల పంపిణీ పథకం అమలు చేపడతామని, ఏప్రిల్ నెలాఖరు కల్లా ఎన్సీడీసీ రుణం వస్తుందని ఆశిస్తున్నామని పశుసంవర్ధక శాఖ అధికారులు ఆశాభావంతో ఉన్నారు. -
పశుసంవర్థక శాఖతో వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక, మత్స్య, డెయిరీ అనుబంధ రంగాల్లో రాష్ట్రం అంతకంతకు అభివృద్ధి చెందుతూ వేల కోట్ల సంపద సృష్టిస్తోందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ ఐదేళ్లలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మాక మార్పులు, అభివృద్ధిపై 2018–19 వార్షిక నివేదికను శుక్రవారం ఆయన విడుదల చేశారు. గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు సంక్షేమ పథకాలు, ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై పాడి పశువుల పంపిణీ.. ఇలా కుల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ప్రతి తెలంగాణ బిడ్డను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలన్నదే మా లక్ష్యమని అన్నారు. వేసవి పూర్తవగానే రెండో విడత గొర్రెల పంపిణీ మొదలవుతుందని చెప్పారు. విజయ డెయిరీ నెయ్యి అన్ని దేవాలయాలకు సరఫరా చేస్తామని, అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ విజయ డెయిరీ వాటర్ బాటిళ్లను వాడేలా ఆదేశాలు తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం కేసీఆర్ వద్ద ఉందన్నారు. కేంద్ర పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి నీల్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలు ఆచరించేలా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు మంజువాణీ, లక్ష్మారెడ్డి, రాంచందర్, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ పాల్గొన్నారు. వార్షిక నివేదికలోని కొన్ని అంశాలు.. - గొర్రెల అభివృద్ధి పథకం కోసం 84 లక్షల గొర్రెలను పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ పథకం కింద 3.65 లక్షల మంది లబ్ధిదారులకు 3.65 లక్షల యూనిట్లు పంపిణీ చేశారు. వాటికి పుట్టిన గొర్రె పిల్లల (70.88 లక్షలు) ద్వారా రూ.3,189.60 కోట్ల ఆదాయం చేకూరింది. అలాగే ఈ జీవాల ద్వారా 38,182 మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి జరిగింది. - పశు గణ రంగం 2018–19లో రాష్ట్ర స్థూల ఆదాయానికి రు.55,394 కోట్లతో రాష్ట్ర స్థూలఉత్పత్తికి 7% సమకూర్చింది. - 100 సంచార పశు వైద్య శాల ద్వారా రైతు ఇంటి ముంగిటనే పశువులకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాం. దేశంలో గాలి కుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా తొలిసారి ప్రకటించారు. - రాష్ట్రంలో గోపాలమిత్రలు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రస్తుత జీవనోపాధి భత్యాన్ని ప్రతినెల రూ.3,500 నుంచి రూ.8,500లకు పెంచింది. - రాష్ట్రంలో పశువులు, గొర్రెలు, కోళ్ల సంఖ్య అధికంగా ఉంది. దేశంలోని పశు సంపదలో తెలంగాణ వాటా 6.51 శాతంగా ఉంది. దేశ గణాంకాలతో పోలిస్తే, తెలంగాణ కోడిగుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానం, మాంసం ఉత్పత్తిలో 5వ స్థానం, చేపల ఉత్పత్తిలో 8వ స్థానం, పాల ఉత్పత్తిలో 13వ స్థానంలో ఉంది. - రాష్ట్రంలో రోజూ 12,170 మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోంది. తలసరి నెలవారీ వాడకం 4.6 లీటర్లతోను, తలసరి లభ్యత రోజుకు 300 గ్రాములతోను, జాతీయ సగటు లభ్యతతో పోలిస్తే రోజుకు 355 గ్రాములతో కాస్త వెనుకంజలో ఉంది. - తెలంగాణ విజయ డెయిరీ రోజుకు 3.92 లక్షల లీటర్ల పాలసేకరణ, 3.20 లీటర్ల పాల ఉత్పత్తుల అమ్మకాలు చేస్తోంది. - రాష్ట్రంలో 2.13 లక్షల పాడి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ.1,677.11 కోట్లు అంచనా ప్రాజెక్టు వ్యయంతో సహకార డెయిరీల ద్వారా పాడి పశువుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 2018–19లో ఈ పథకం కింద 57,538 పశువులను పంపిణీ చేశారు. విజయ తెలంగాణ ప్యాక్డ్ తాగునీరును అందుబాటులోకి తీసుకువచ్చారు. - మత్స్యకారుల సమగ్రాభివృద్ధికై రూ.1,000 కోట్లతో ప్రభుత్వము సమీకృత మత్స్య అభివృద్ధి పథకం చేపట్టింది. ఈ పథకం కింద 2018–19లో 2,46,648 మత్స్యకారులు లబ్ధి పొందారు. - వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ పథకం కింద గతేడాది 49.15 కోట్ల చేప పిల్లలను 10,776 జల వనరులలో, 3.19 కోట్ల రొయ్య పిల్లలను 24 జలాశయాలలో విడుదల చేశారు. ఫలితంగా గతంతో పోలిస్తే 13% ఉత్పత్తి పెరిగింది. - రాష్ట్రంలో 27.14 లక్షల మంది మొత్తం మత్స్యకారుల జనాభా వుండగా అందులో 3.04 లక్షల మంది క్రియాశీలక మత్స్యకారులు నమోదయ్యారు. -
గొర్రెల రీసైక్లింగ్
గొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధికి సబ్సిడీపై పంపిణీ చేసే గొర్రెల కొనుగోలు పథకం కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాల వ్యవహారం సద్దుమణగకముందే మరో బాగోతానికి తెరలేసింది. నిబంధనలకు విరుద్ధంగా మహారాష్ట్రలో కొనుగోలు చేసి జిల్లాకు తరలిస్తున్న గొర్రెలబాగోతం మూడు రోజుల క్రితం కోరుట్ల మండలం మోహన్‌రావుపేట రోడ్డు ప్రమాదంతో వెలుగు చూసింది. జిల్లాకు చెందిన సుమారు వెయ్యి సబ్సిడీ గొర్రెలను అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తుండగా.. ఆదిలాబాద్ జిల్లా రాంపూర్ వద్ద రవాణాశాఖ అధికారులు శుక్రవారం పట్టుకోవడంతో ‘రీసైక్లింగ్’ బాగోతం బట్టబయలైంది. గొర్రెల కొనుగోలు పథకంలో పెద్ద ఎత్తున నిధులు గోల్మాల్ కాగా.. పథకం అమలులో ఇప్పటివరకు రూ.7కోట్ల వరకు అవినీతి జరిగినట్లు సంబంధిత శాఖలోనే చర్చ జరుగుతోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: గొర్రెల పంపిణీ పథకం పేరిట అటు నుంచి ఇటు (మహారాష్ట్ర నుంచి కరీంనగర్), ఇటు నుంచి అటు (కరీంనగర్ జిల్లా నుంచి మహారాష్ట్ర) తరలుతున్న గొర్రెల రవాణా, రీసైక్లింగ్‌లో రూ.లక్షలాదిగా దుర్వినియోగం అవుతున్నట్లు వెల్లడవుతోంది. అ అక్రమాలపై ఓ వైపు విచారణ జరుగుతుండగానే యథేచ్ఛగా సాగుతున్న అక్రమ కొనుగోళ్లు, రీసైక్లింగ్ దందా ప్రభుత్వాన్ని, నిఘా విభాగాలను సవాల్ చేస్తున్నాయి. కరీంనగర్టు మహారాష్ట్ర.. ఆదిలాబాద్ ఘటనతో బట్టబయలు కరీంనగర్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలుతున్న సబ్సిడీ గొర్రెల బాగోతం శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా రాంపూర్‌లో పట్టుబడటంతో బట్టబయలైంది. రెండు టారస్, రెండు ఐచర్ వాహనాల్లో తరలిస్తుండగా పట్టుకున్న రవాణా శాఖ అధికారులు, పోలీసులు మొత్తం వెయ్యి గొర్రెలు ఉన్నట్లు తేల్చారు. ఇవన్నీ కరీంనగర్ జిల్లా నుంచే తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడి కావడంతో ‘రీసైక్లింగ్’ ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించవచ్చు. టారస్, ఐచర్ (పెద్ద లారీలు) వాహనాల్లో కింద, పైన, మధ్యలో చెక్కలను స్లాబ్‌గా వేసి ఈ గొర్రెలను తరలిస్తున్నారు. ఒక్కో టారస్ వాహనంలో 300 గొర్రెల చొప్పున రెండు టారస్ వాహనాలు, రెండు ఐచర్ వాహనాల్లో మొత్తం వెయ్యి గొర్రెలను సరిహద్దు దాటిస్తుండగా జాతీయ రహదారిపై పట్టుకోవడం గమనార్హం. ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ గొర్రెలుగా అనుమానించిన ఆర్టీఏ అధికారులు అదుపులోకి తీసుకుని ఆదిలాబాద్ రూరల్ పోలీసులకు అప్పగించడంతో విచారణలో గుట్టంతా రట్టయ్యింది. ‘మాఫియా’గా మారిన కొందరు దళారులు కరీంనగర్ జిల్లా గంగాధర కేంద్రంగా సబ్సిడీ గొర్రెలను సేకరించి.. అక్కడినుంచి నాలుగు భారీ లారీల్లో తరలిస్తున్నట్లు తేలింది. ఇదంతా పక్కా సమాచారం మేరకు దాడి చేసి రాంపూర్ సమీపంలో జాతీయ రహదారి44పై పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించడంతో సబ్సిడీ గొర్రెలు అక్రమంగా తరలుతున్న వ్యవహారం బయటపడింది. కొంతమంది దళారులు మహారాష్ట్రలో కొనుగోలు చేసిన వాటిని చెవులకు వేసిన ట్యాగ్‌ను తొలగించి రీసైక్లింగ్ చేస్తున్నట్లు వెల్లడైంది. అక్రమంగా తరలిస్తున్న ఈ గొర్రె యూనిట్ల విలువ సుమారు రూ.60 లక్షల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ‘మాఫియా’గా దళారులు.. భారీగా రీసైక్లింగ్ జిల్లా వ్యాప్తంగా తొలివిడతగా 2017–18 సంవత్సరానికి గాను 13,519 వేల యూనిట్లు (ఒక్కో యూనిట్‌కు 20 గొర్రెలు ఒక పొట్టేలు) పంపిణీ చేయాలని లక్ష్యం విధించారు. ఒక్కో యూనిట్ విలువ రూ.1.25లక్షలు కాగా లబ్ధిదారుడు రూ.31,250 డీడీ చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం రూ.93,750 సబ్సిడీ ఇస్తుంది. రూ.1.25 లక్షల సబ్సిడీలో రూ.1.11 లక్షలు గొర్రెలకు, రూ.6300 ట్రాన్స్‌పోర్టు, రూ.420 మందులు, రూ.3,800 బీమా, దాణాకు రూ.3,440 కేటాయించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 12,269 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేశారు. ఇటీవల దాణా పంపిణీ కోసం పంపిణీ చేసిన గొర్రెల యూనిట్లపై సర్వే చేయగా.. జిల్లావ్యాప్తంగా 50 శాతం సబ్సిడీ గొర్రెలు మాయమైనట్లు తేలిందని పశువైద్యశాఖ అధికారులే చెబుతున్నారు. ఇందుకు బినామీ లబ్ధిదారులు ఒక కారణమైతే.. బినామీలను సృష్టించడంలో కొందరు పశువైద్యాధికారులే కీలకపాత్ర వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ అధికారి గొల్లకుర్మ సంఘం కీలక నేతలతో మిలాఖత్ అయి ఇతరుల పేరు మీద రూ.31,250 డీడీ తీసి మహారాష్ట్రలో గొర్రెలను కొనుగోలు చేశారు. అక్కడా గొర్రెలు చూపించే బ్రోకర్ల వ్యవస్థతో డీలింగ్ పెట్టుకున్నారు. కొనుగోలు చేసి.. ఫొటోలు తీసి అప్లోడ్ చేసి.. లారీ ఎక్కించిన అనంతరం 20 నిమిషాల్లోపు లారీల నుంచి వాటిని తిరిగి అప్పగించారు. డాక్టర్లు, బ్రోకర్లు, అమ్మిన వ్యక్తి మధ్యే ఈ ఒప్పందం జరిగింది. ప్రభుత్వ సబ్సిడీ సొమ్ము అమ్మిన వ్యక్తి పేరు మీద అతని బ్యాంకు ఖాతాలోకి వెళ్తుంది బ్రోకర్ ఆ సొమ్ములో నుంచి అమ్మిన వ్యక్తి నుంచి అధికారుల వరకు వాటాలు పంపిణీ చేయడమనేది అవినీతి ఒప్పందం. అర్హులైన లబ్ధిదారుల విషయంలో ఒక్కో యూనిట్‌కు రూ.10 వేలు మండల డాక్టర్‌కు.. రూ.2 వేలు చక్రం తిప్పే అధికారికి అప్పగించారు. ఇక్కడే రీసైక్లింగ్‌కు బీజం పడినట్లు తాజాగా శుక్రవారం ఆదిలాబాద్‌లో పట్టుబడిన వెయ్యి సబ్సిడీ గొర్రెల వ్యవహారం ద్వారా అర్థమవుతోంది. గొర్రెల పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
పంపిణీకి రాజస్తాన్, గుజరాత్ గొర్రెలు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా నుంచి గొర్రెలను కొనుగోలు చేసి పంపిణీ చేశామని, ఇకపై రాజస్తాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. బుధవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గొర్రెల పంపిణీలో 96.13 శాతంతో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా 94.04 శాతంతో రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. రంగారెడ్డి, సూర్యాపేట, నిర్మల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గొర్రెల పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి, కొమురంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో తొలి జాబితా లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ పూర్తయిందని, రెండో జాబితా లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తలసాని తెలిపారు. త్వరలో గొర్రెల పెంపకందారులు, మత్స్యకార సొసైటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చెరువులు, రిజర్వాయర్లలో గతేడాది 22 కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా, ఈ ఏడాది 51 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో ఆక్వా ఎక్స్పో నిర్వహిస్తున్నామని, 25 దేశాల ప్రతినిధులు రానున్నట్లు వివరించారు. -
4 జిల్లాల్లో భారీగా రీ సైక్లింగ్
సాక్షి, హైదరాబాద్: ‘గొర్రెల పంపిణీ’కి సంబంధించి నల్లగొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో ముగ్గురు అధికారులతో అంతర్గత విచారణ కమిటీని నియమించింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు జరిగిన గొర్రెల కొనుగోళ్లపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. అలాగే గొర్రెల పంపిణీ పథకం ఆడిటింగ్ బాధ్యతలను సెస్ (సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్)కు అప్పగించింది. గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలు పంపిణీ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు 1,67,000 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. దాదాపు 35 లక్షల గొర్రెలు పంపిణీ చేయగా.. వాటికి 12 లక్షలు గొర్రె పిల్లలు పుట్టినట్లు అంచనా వేసింది. అయితే నవంబర్ 15 తర్వాత నెల రోజులు నల్గొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ జరిగింది. దీంతో ఆ 4 జిల్లాల్లో రీసైక్లింగ్ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేసిన ప్రభుత్వం.. శాఖాపరమైన విచారణ కొనసాగిస్తోంది. అలాగే సంబంధిత జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లో పంపిణీ చేసిన అన్ని యూనిట్లను తనిఖీ చేయాలని ఆదేశించింది. సెస్‌కు ఆడిటింగ్, సర్వే మహబూబ్‌నగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో అక్రమంగా తరలిస్తున్న వందలాది గొర్రెలు ఇటీవల పట్టుబడ్డాయి. వివిధ జిల్లాల్లో వచ్చిన ఆరోపణలపై ఇద్దరు అధికారులనూ సస్పెండ్ చేశారు. దీంతో రీ సైక్లింగ్ జరగకుండా చెవులు కత్తిరించిన గొర్రెలు కొనుగోలు చేయొద్దని ఆదేశించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా థర్డ్ పార్టీ సర్వే చేపట్టాలని నిర్ణయించారు.శాస్త్రీయ పద్ధతిలో 10 శాతం రాండమ్ శాంపిల్‌తో సర్వే చేసే బాధ్యతను సెస్‌కు అప్పగించింది. -
గొర్రెల పంపిణీని నీరుగార్చొద్దు: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేసిన సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకాన్ని కూడా నీరుగార్చొద్దని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి కోరారు. గురువారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షపార్టీ నేతలను గొర్రెలతో పోల్చడా న్ని కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఆయనలాగా కాంగ్రెస్ నేతలు తోడేళ్లు కాదన్నారు. గొర్రెల పంపిణీ పథకాన్ని ఆహ్వానించామని, కానీ పథకం ఆచరణలో లోపభూయిష్టంగా ఉందన్నారు. పంపిణీకి ఎంపిక చేసిన గొర్రె, పొట్టేలుతో సహా ఏవీ 6నెలల వయసుకు మించ లేదన్నారు. 3.59 లక్షల యూనిట్లకు అర్హత ఉంటే 4వేల యూనిట్లు మాత్రమే మొదటివిడతలో గొర్రెలను పొందా రన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పటివేనన్నారు. ఉచిత విద్యుత్, ఒకేసారి పంట రుణాల మాఫీ,ఫీజీరీయింబర్సుమెంటు, ఆరోగ్యశ్రీ పథకాలన్నీ వైఎస్ అమలుచేశారని చెప్పారు. -
నేడు గొర్రెల పంపిణీ
-
నేడు గొర్రెల పంపిణీ
-
నేడు గొర్రెల పంపిణీ
గజ్వేల్‌లోని కొండపాకలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొల్ల, కుర్మలను లక్షాధికారులను చేసే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలకెత్తుకున్న సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకం మంగళవారం ప్రారంభంకానుంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోని కొండపాక గ్రామంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. లబ్ధిదారులకు ఆయన స్వయంగా గొర్రెలను పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తొలి రోజు 62 వేల గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు సహా ప్రజాప్రతినిధులంతా భాగస్వాము లు కావాలని కోరారు. ఈ మేరకు వారందరికీ ఇప్పటికే లేఖలు పంపామన్నారు. 45 లక్షల ఎకరాల అటవీశాఖ భూములు, పండ్ల తోట ల్లో గొర్రెలకు గడ్డి పెంచేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ సందర్భంగా గొర్రెల అభివృద్ధి పథకం పోస్టర్‌ను తలసాని ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఫెడరేషన్ ఎండీ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. 7,846 సొసైటీలు... రాష్ట్రంలోని 8,710 గ్రామ పంచాయతీల్లో 7,846 గొర్రెల పెంపకందారుల సొసైటీలు నమోదయ్యాయి. వీటిల్లో 7,18,069 మంది సభ్యులుగా ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మొదటి విడత లబ్ధిదారులందరికీ గొర్రెలను అందజేస్తారు. ఎవరికి, ఎప్పుడు గొర్రెలను పంపిణీ చేయాలన్న దానిపై లాటరీ పద్ధతిలోనే నిర్ణయం తీసుకున్నారు. 21+1 గొర్రెల యూనిట్‌కు రూ. 1.25 లక్షలు ఖర్చు కానుంది. అందులో ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇవ్వనుండగా మిగిలిన సొమ్మును లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. గొర్రెలను తెలంగాణలో కొనుగోలు చేయకూడదన్న నిబంధన విధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలు, కర్ణాటకలో 21, తమిళనాడులో 5, మహారాష్ట్రలో 23 జిల్లాల నుంచి గొర్రెలను కొనుగోలు చేస్తారు. వచ్చే ఆరు నెలలపాటు ఆయా రాష్ట్రాల్లో జిల్లా సెంట్రల్ టీంలు నిత్యం అక్కడే ఉండి గొర్రెల సేకరణ చేపట్టనున్నాయి. రెండేళ్లలో సరఫరా చేసే మొత్తం కోటిన్నర గొర్రెల కోసం రూ. 10 వేల కోట్లు ఖర్చు కానుంది. అందులో ప్రభుత్వం రూ. 7,500 కోట్లు సబ్సిడీ రూపంలో భరించనుండగా, లబ్ధిదారులు రూ. 2,500 కోట్లు ఖర్చు చేయనున్నారు. సోషల్ ఆడిట్ సబ్సిడీపై అందించే గొర్రెలను పరిరక్షిం చేందుకు ఆరు నెలల్లో రెండుసార్లు సోషల్ ఆడిట్ జరపాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. గొర్రెలను కొనిచ్చాక ఏడాదిపాటు ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోకుండా చూసేం దుకు వాటిని కొనిచ్చిన నెలలో ఒకసారి, ఆ తర్వాత ఆరు నెలలకు మరోసారి సామాజిక తనిఖీ నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్లలో 7.18లక్షల లబ్ధిదా రులకు (ఈ ఏడాది 3.6 లక్షల మందికి 75.60 లక్షల గొర్రెలు, వచ్చే ఏడాది 3.58 లక్షల మందికి 75.18 లక్షలు) మొత్తం కోటిన్నర గొర్రెలు, పోతులను ప్రభుత్వం సబ్సిడీపై అందించనుంది. -
గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేయండి
జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎస్.పి.సింగ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఆయన సచివాలయంలో గొర్రెల పంపిణీ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, హరిత హారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ వెంకటే శ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎస్.పీ.సింగ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని, గొర్రెల పంపిణీకి పక్కాగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. మొదటి ఏడాదీ దాదాపు 3.5లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పథకం అమలులో అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. మొదటి విడత పంపిణీలో ఎంపిక చేసిన సొసైటీలు, సభ్యుల వివరాలను ఈ–లాబ్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. గొర్రెల ట్యాగింగ్, ఇన్సూరెన్స్ డాక్యుమెంటేషన్‌కు తగు సిబ్బందిని, గొర్రెల ఆరోగ్యాన్ని పరిరక్షించటానికి డాక్టర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. లబ్ధిదారుల వాటా 25 శాతం కంట్రిబ్యూషన్ వసూలు చేయాలన్నారు. స్టైలో గ్రాస్ పెంపకానికి తగు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా మాట్లాడుతూ, కలెక్టర్లు సొసైటీలు, గ్రామాల వారీగా తగిన ప్రాధాన్యం రూపొందించుకొని కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. చెల్లింపులన్ని అకౌంట్ పే ద్వారా జరగాలన్నారు. గొర్రెలను అమ్మే వారి ఆధార్ , ఐడి కార్డుల వివరాలను సేకరించాలన్నారు. పంపిణీ చేసిన గడ్డి విత్తనాలు పెంచడానికి స్థలాలను గుర్తించి, సొసైటీలకు బాధ్యత అప్పగించాలన్నారు. సాదాబైనామాలపై సమీక్ష పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా కేసులను పరిష్కరించి ఈ నెల 21వ తేదీ లోపు అప్ లోడ్ చేయాలని సీఎస్ ఎస్పీ సింగ్ జిల్లా కలెక్టర్లను ఆదేశిం చారు. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ అందు బాటులో ఉండదని అప్రమత్తం చేశారు. మరో 11.31 శాతం కేసులు పరిష్కరిం చాల్సి ఉందన్నారు. భూపాలపల్లి, ఖమ్మం, వరంగల్ (అర్బన్, రూరల్) జిల్లాల్లో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. -
సబ్సిడీపై గొర్రె పిల్లల పంపిణీకి నిధులు
బడ్జెట్లో కేటాయింపులు: మంత్రి తలసాని సాక్షి, హైదరాబాద్: గొల్ల, కుర్మల కుటుంబాలకు 75 శాతం సబ్సిడీపై గొర్రె పిల్లలను పంపిణీ చేసేందుకు బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగిందని పశుసంవర్థక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. సోమవారం సచివాలయంలో తలసాని అధ్యక్షతన మంత్రివర్గ ఉపసం ఘం భేటీ అయింది. ఈ సమావేశానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, గొర్రెల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ కన్నెబోయిన రాజ య్యయాదవ్, పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా, డైరెక్టర్ వెంకటే శ్వర్లు, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్ హాజరైయ్యా రు. అనంతరం తలసాని మాట్లాడుతూ... కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది సీఎం కేసీఆర్ ఆలోచనన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీపై రూ.1.25 లక్షల వ్యయంతో (20+1యూనిట్‌గా) గొర్రె పిల్లలను అందజేస్తామన్నారు. రాష్ట్రంలో 4 లక్షల కుటుంబాలు గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. అందులో 2 లక్షల కుటుంబాలకు ఈ సంవత్సరం, మిగిలినవారికి వచ్చే ఏడాది గొర్రె పిల్లలను పంపిణీ చేస్తామన్నారు.