తలసాని శ్రీనివాస యాదవ్
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా నుంచి గొర్రెలను కొనుగోలు చేసి పంపిణీ చేశామని, ఇకపై రాజస్తాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. బుధవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గొర్రెల పంపిణీలో 96.13 శాతంతో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా 94.04 శాతంతో రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు.
రంగారెడ్డి, సూర్యాపేట, నిర్మల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గొర్రెల పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి, కొమురంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో తొలి జాబితా లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ పూర్తయిందని, రెండో జాబితా లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తలసాని తెలిపారు. త్వరలో గొర్రెల పెంపకందారులు, మత్స్యకార సొసైటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చెరువులు, రిజర్వాయర్లలో గతేడాది 22 కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా, ఈ ఏడాది 51 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో ఆక్వా ఎక్స్‌పో నిర్వహిస్తున్నామని, 25 దేశాల ప్రతినిధులు రానున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment