శుక్రవారం నివేదికను విడుదల చేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, అధికారులు
సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక, మత్స్య, డెయిరీ అనుబంధ రంగాల్లో రాష్ట్రం అంతకంతకు అభివృద్ధి చెందుతూ వేల కోట్ల సంపద సృష్టిస్తోందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ ఐదేళ్లలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మాక మార్పులు, అభివృద్ధిపై 2018–19 వార్షిక నివేదికను శుక్రవారం ఆయన విడుదల చేశారు. గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు సంక్షేమ పథకాలు, ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై పాడి పశువుల పంపిణీ.. ఇలా కుల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ప్రతి తెలంగాణ బిడ్డను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలన్నదే మా లక్ష్యమని అన్నారు. వేసవి పూర్తవగానే రెండో విడత గొర్రెల పంపిణీ మొదలవుతుందని చెప్పారు.
విజయ డెయిరీ నెయ్యి అన్ని దేవాలయాలకు సరఫరా చేస్తామని, అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ విజయ డెయిరీ వాటర్ బాటిళ్లను వాడేలా ఆదేశాలు తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం కేసీఆర్ వద్ద ఉందన్నారు. కేంద్ర పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి నీల్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలు ఆచరించేలా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు మంజువాణీ, లక్ష్మారెడ్డి, రాంచందర్, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ పాల్గొన్నారు.
వార్షిక నివేదికలోని కొన్ని అంశాలు..
- గొర్రెల అభివృద్ధి పథకం కోసం 84 లక్షల గొర్రెలను పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ పథకం కింద 3.65 లక్షల మంది లబ్ధిదారులకు 3.65 లక్షల యూనిట్లు పంపిణీ చేశారు. వాటికి పుట్టిన గొర్రె పిల్లల (70.88 లక్షలు) ద్వారా రూ.3,189.60 కోట్ల ఆదాయం చేకూరింది. అలాగే ఈ జీవాల ద్వారా 38,182 మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి జరిగింది.
- పశు గణ రంగం 2018–19లో రాష్ట్ర స్థూల ఆదాయానికి రు.55,394 కోట్లతో రాష్ట్ర స్థూలఉత్పత్తికి 7% సమకూర్చింది.
- 100 సంచార పశు వైద్య శాల ద్వారా రైతు ఇంటి ముంగిటనే పశువులకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాం. దేశంలో గాలి కుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా తొలిసారి ప్రకటించారు.
- రాష్ట్రంలో గోపాలమిత్రలు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రస్తుత జీవనోపాధి భత్యాన్ని ప్రతినెల రూ.3,500 నుంచి రూ.8,500లకు పెంచింది.
- రాష్ట్రంలో పశువులు, గొర్రెలు, కోళ్ల సంఖ్య అధికంగా ఉంది. దేశంలోని పశు సంపదలో తెలంగాణ వాటా 6.51 శాతంగా ఉంది. దేశ గణాంకాలతో పోలిస్తే, తెలంగాణ కోడిగుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానం, మాంసం ఉత్పత్తిలో 5వ స్థానం, చేపల ఉత్పత్తిలో 8వ స్థానం, పాల ఉత్పత్తిలో 13వ స్థానంలో ఉంది.
- రాష్ట్రంలో రోజూ 12,170 మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోంది. తలసరి నెలవారీ వాడకం 4.6 లీటర్లతోను, తలసరి లభ్యత రోజుకు 300 గ్రాములతోను, జాతీయ సగటు లభ్యతతో పోలిస్తే రోజుకు 355 గ్రాములతో కాస్త వెనుకంజలో ఉంది.
- తెలంగాణ విజయ డెయిరీ రోజుకు 3.92 లక్షల లీటర్ల పాలసేకరణ, 3.20 లీటర్ల పాల ఉత్పత్తుల అమ్మకాలు చేస్తోంది.
- రాష్ట్రంలో 2.13 లక్షల పాడి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ.1,677.11 కోట్లు అంచనా ప్రాజెక్టు వ్యయంతో సహకార డెయిరీల ద్వారా పాడి పశువుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 2018–19లో ఈ పథకం కింద 57,538 పశువులను పంపిణీ చేశారు. విజయ తెలంగాణ ప్యాక్డ్ తాగునీరును అందుబాటులోకి తీసుకువచ్చారు.
- మత్స్యకారుల సమగ్రాభివృద్ధికై రూ.1,000 కోట్లతో ప్రభుత్వము సమీకృత మత్స్య అభివృద్ధి పథకం చేపట్టింది. ఈ పథకం కింద 2018–19లో 2,46,648 మత్స్యకారులు లబ్ధి పొందారు.
- వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ పథకం కింద గతేడాది 49.15 కోట్ల చేప పిల్లలను 10,776 జల వనరులలో, 3.19 కోట్ల రొయ్య పిల్లలను 24 జలాశయాలలో విడుదల చేశారు. ఫలితంగా గతంతో పోలిస్తే 13% ఉత్పత్తి పెరిగింది.
- రాష్ట్రంలో 27.14 లక్షల మంది మొత్తం మత్స్యకారుల జనాభా వుండగా అందులో 3.04 లక్షల మంది క్రియాశీలక మత్స్యకారులు నమోదయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment