యాభయ్యేళ్లలో గత ప్రభుత్వాలు చేయలేని పనులెన్నో బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేళ్లలోనే చేసి చూపించిందని సనత్‌నగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఇప్పటి వరకూ చేసిన పనులేమిటో చెబుతూ, మున్ముందు మరిన్ని పనులు చేసేందుకు అవకాశమివ్వాలని కోరుతూ ప్రజల్లోకి వెళ్తున్నట్లు తెలిపారు. పోటీలో ఉన్న ఇతర పార్టీల వారెవరన్నది తాను పట్టించుకోనన్నారు. ఏ పనులు చేసేందుకు ఎన్ని నిధులు అవసరమో సరిగ్గా తెలియని కాంగ్రెస్ నేతలు.. బీఆర్‌ఎస్ కూడబెట్టిన అవినీతి సొమ్మును వెలికితీసి దాంతో తమ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెబుతున్న మాటలు హాస్యాస్పదమన్నారు. గాలి మాటలతోనే కాంగ్రెస్ హామీలు ఫేక్ అని వెల్లడవుతోందని వ్యాఖ్యానించారు. ‘సాక్షి’ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలను ఆయన వెల్లడించారు.
మీ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలేమిటి? వాటినెలా పరిష్కరిస్తారు?
సమస్యలనేవి నిరంతరం ఉంటాయి. ఒకటి పరిష్కరిస్తే మరొకటి పుట్టుకొస్తుంది. సమస్యల్ని క్రమేపీ తగ్గించుకుంటూ, శాశ్వత పరిష్కారం లక్ష్యంగా పనులు చేస్తున్నాను. అందుకు అవసరమైన నిధుల్ని ప్రభుత్వం ఇస్తోంది.
నగరానికి, మీ నియోజకవర్గానికి ఇస్తున్న హామీలు?
హైదరాబాద్ నగరానికి కేసీఆర్ ప్రభుత్వం చాలా చేసింది. దేశంలోనే అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దింది. ఈ అభివృద్ధిని ఇంకా విస్తరించుకుంటూ ముందుకు వెళ్తుంది. ప్రజలకు 24 గంటల కరెంటుకు ఢోకాలేదు. యాభయ్యేళ్ల వరకు తాగునీటి సమస్యల్లేకుండా చేస్తున్నాం. కృష్ణా, గోదావరి జలాలు ఇప్పటికే అందుతున్నాయి. కాళేశ్వరం, తదితర ప్రాజెక్టుల నుంచీ నీటిని రప్పించే పనులున్నాయి. ముంపు సమస్యల్లేకుండా ఎస్‌ఎన్‌డీపీ కింద పనులు చేపట్టాం. పూర్తయిన పనులతో వరద సమస్యలు కొంత తగ్గాయి. అన్నీ పూర్తయితే ఈ సమస్యలిక ఉండవు. వాటికోసం ఎంత ఖర్చయినా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
చేసిన పనుల్లో ముఖ్యమైనవి?
చెప్పాలంటే చాలా ఉన్నాయి. 70 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు జీఓ 58, 59ల ద్వారా ఇళ్ల పట్టాలు చేతికొచ్చాయి. పేదలకు ఇప్పటికే 70వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చాం. మరో 30వేల ఇళ్లు పంపిణీకి సిద్ధమవుతున్నాయి. దళితబంధు, కళ్యాణలక్ష్మి, పెన్షన్లు తదితర పథకాలు అమలవుతున్నాయి.
అధికార బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటారు ?
డబుల్‌బెడ్రూం ఇళ్లు వచ్చిన ప్రజలు సంతోషంగా ఉన్నారు. రానివారు బాధపడుతున్నారు. వారి బాధ కూడా తీరుస్తాం. మరో లక్ష ఇళ్లు నిర్మిస్తాం. అసలీ పథకాలు తెచ్చింది. అమలు చేస్తున్నదే కేసీఆర్ ప్రభుత్వం. గత పాలకులకు కనీసం ఇలాంటి ఆలోచనలు కూడా రాలేదు. చేసిన పనులు కళ్లముందే కనిపిస్తున్నాయి. దశల వారీగా అన్ని పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటాం. మిగతా పార్టీల మాటలు నమ్మొద్దు.
అభ్యర్థులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారనే ప్రచారం ఉంది. తగ్గించలేరా ?
డబ్బుతో ప్రజలను కొనలేరు. అభ్యర్థులు కూడా వీలైనంత మేరకు ఎన్నికల వ్యయం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇంటింటికీ వెళ్లి చేసిన పనులు, చేయబోయే పనులు చెప్పుకోవడం ద్వారా ఖర్చు చాలా వరకు తగ్గించుకోవచ్చు.
కాంగ్రెస్ హామీలను ఎలా చూడొచ్చు?
మాకు పాలనానుభవం ఉంది. వచ్చే రెవెన్యూ ఎంతో, ఎంత ఖర్చు చేయొచ్చో తెలిసిన నాయకుడున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలు ఇంతకుముందే విన్నా. బీఆర్‌ఎస్ దగ్గరి అవినీతి సొమ్ము వెలికితీసి వారి ఆరు గ్యారంటీలు అమలు చేస్తారట. గాలి మాటలు తప్ప అది సాధ్యమా ? అలాంటి హామీలు ఫేక్ కాక , వాటికి శాంక్టిటీ ఉంటుందా ? కాబట్టి కాంగ్రెస్‌ను ఎవరూ నమ్మరు కూడా.
నగరంలో సీఎం సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ?
ఈనె ల 25వ తేదీన గ్రేటర్ హైదరాబాద్‌కు సంబంధించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. భారీయెత్తున నిర్వహించనున్న ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా పార్టీ క్యాడరే కాక నగర ప్రజలకు, చదువుకున్న వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం బాగా పని చేస్తోందనే నమ్మకం ఉంటే అధిక సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.
సోషల్ మీడియాలో, కొన్ని సర్వేల్లో బీఆర్‌ఎస్ బలం కనిపించడం లేదు ఎందుకంటారు?
రాజకీయ నేతలపై, వివిధ రంగాల్లో ప్రముఖులపై కనీస గౌరవం లేకపోవడంతో పాటు సోషల్ మీడియాలో వారిని ఇష్టానుసారం చిత్రీకరించడం కొందరికి ఫ్యాషన్‌గా, ప్యాషన్‌గానూ మారింది. ఇంకొందరు సర్వేలపేరిట తోచింది రాస్తున్నారు. సర్వేల నివేదికలంటూ ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. వాటికెలాంటి శాంక్టిటీ లేదు. వాటి గురించి పట్టించుకోవద్దు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎవరేమిటో గ్రహిస్తున్నారు. చేసిన మంచి పనులు కళ్లముందే ఉన్నాయి. ఉదాహరణకు కరోనా వైరస్ తరుణంలోనూ ప్రభుత్వపరంగా ఏంచేశామో ప్రజలు చూశారు.
నియోజకవర్గంలో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు?
ప్రత్యర్థి గురించి ఆలోచించను. నియోజకవర్గంలో నేను చేసిన పనులు.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ముందుకెళ్తున్నా. గత ప్రభుత్వాలు యాభయ్యేళ్లలో చేయని పనులు తొమ్మిదిన్నరేళ్లలో చేశాం. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాం. వాటితోపాటు అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు, రాత్రుళ్లు ఎల్‌ఈడీ వీధి దీపాలు, ఇండోర్ స్టేడియాలు, తగినన్ని తాగునీటి రిజర్వాయర్లు తదితరమైన వాటిపైనే నా ఫోకస్.
Comments
Please login to add a commentAdd a comment