సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలోనే కొంత విభిన్నమైన జిల్లా రంగారెడ్డి. సెమీ అర్బన్‌గా జిల్లాగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. రాజకీయ చైతన్యం కాస్త ఎక్కువ ఉన్న ప్రాంతం కూడా ఇదే. ఇక్కడ కేవలం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్లు మాత్రమే కాదు ఉత్తరాది ప్రాంతాలకు చెందిన భిన్న కులస్తులు, మతస్తులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అత్యధికంగా శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఉన్నారు. వీరి ఓట్లు ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి. సీట్లు ఖరారు కావడంతో అధికార బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గాలను ఓ దఫా చుట్టేశారు.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, కుల సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీ సంక్షేమ సంఘాలతో ఆతీ్మయ సభలు, సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీలతో పోలిస్తే కొంత ముందున్నట్లు కనిపిస్తోంది. విపక్షాలు అభ్యర్థుల పేర్లు ఇంకా అధికారికంగా వెల్లడించకపోయినా.. ఆయా పార్టీలు సైతం ఓటర్లను ఆకర్షించేందుకు పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి.
మహేశ్వరం.. త్రిముఖం..
విద్యాశాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. ఎన్నికల షెడ్యూల్డ్ విడుదలకు ముందు వరకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ఆమె బిజీగా మారారు. రోజుకు కనీసం 12 గంటలు నియోజకవర్గంలోనే ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌తో పోలిస్తే.. ఎన్నికల ప్రచారంలో ఆమె కొంత ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. అదే విధంగా బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న అందెల శ్రీరాములు సైతం పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ తప్పిదాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు, ఇళ్ల స్థలాల పంపిణీ వంటి అంశాల్లో స్థానికులకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూ.. ఎప్పటికప్పుడు అధికార పార్టీ టార్గెట్‌గా ముందుకెళ్తున్నారు.
ఈ సీటును హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఇదే నియోజకవర్గం వేదికగా ఇటీవల భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఆశించిన దానికంటే అధిక సంఖ్యలో జనం రావడంతో ఆ పార్టీకి కొత్త ఊపునిచ్చింది. తీరా టికెట్ల కేటాయింపు అంశం వివాదాస్పదంగా మారింది. ఇక్కడి నుంచి బడంగ్‌పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి పోటీ చేయనున్నారనే ప్రచారం జరిగింది. ఆయన కూడా ఇందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పటి వరకు ఫీక్ స్టేజీలో ఉన్న కాంగ్రెస్.. ఇటీవల బహిష్కృత నేత కొత్త మనోహర్‌రెడ్డి చేసిన ఆరోపణలతో రాజకీయంగా కోలుకోలేని స్థితికి చేరింది. సంస్థాగతంగా పార్టీ బలంగా ఉన్నప్పటికీ.. నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు పార్టీకి నష్టం తెచ్చిపెట్టే విధంగా ఉన్నాయి. ఆశావహులంతా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇబ్రహీంపట్నం.. ద్విముఖం
సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేసే ప్రక్రియలో బిజీగా ఉంటున్నారు. నియోజకవర్గానికి కొంత అభివృద్ధి పథంలో న డిపించారు. కాంగ్రెస్ నుంచి అధికారికంగా అభ్యర్థి పేరు వెల్లడించకపోయినప్పటికీ.. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పోటీలో ఉండనున్నట్లు సమాచారం. ఆయన ఇప్పటికే గ్రామాల వారీగా పర్యటిస్తూ బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. సంస్థాగతంగా పార్టీకి మంచి పట్టుండటం ఆయనకు కలిసి వచ్చే అంశం. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహులు మర్రి నిరంజన్‌రెడ్డి, దండెం రామిరెడ్డిలు ఆయనకు సహకరిస్తారా? లేదా? వేచి చూడాల్సిందే. ఇక్కడ బీజేపీ పెద్దగా ప్రచారంలో లేకపోవడంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ప్రధాన పోటీ నెలకోనుంది.
ఎల్బీనగర్.. ముక్కోణం..
పూర్తిగా అర్బన్ ఓటర్లు ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ తెలంగాణ, ఏపీ జిల్లాలకు చెందిన ఓటర్లు అధికం. సిట్టింగ్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి బీఆర్‌ఎస్ మళ్లీ అవకాశం కల్పించింది. గత ఎన్నికల్లో చేతి గుర్తుపై గెలుపొందిన ఆయన ఈసారి కారు గుర్తుతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ బీజేపీకి సంస్థాగతంగా బలంగా ఉంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 11 డివిజన్లకు 10 డివిజన్లలో విజయం సాధించింది. ఇక్కడి నుంచి అర్బన్‌జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీ పేరు దాదాపు ఖరారైంది. అధికారికంగా పేరు వెల్లడించక పోయినా.. అంతర్గతంగా ఆయన ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ నెలకొనే అవకాశం లేకపోలేదు.
రాజేంద్రనగర్.. నీదా.. నాదా?
బీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కే మళ్లీ టికెట్ వరించింది. ఇతర పార్టీలతో పోలిస్తే ఆయన ప్రచారంలో కొంత ముందున్నారు. బీజేపీ నుంచి పలువురు ఆశావహులు పోటీపడుతున్నారు. వీరిలో ముఖ్యంగా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బైతి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అధికారికంగా అభ్యర్థి పేరు వెల్లడించక పోయినా.. వీరిలో తోకల శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కాంగ్రెస్ నుంచి జ్ఞానేశ్వర్ ముదిరాజ్, గౌరీ సతీష్, నరేందర్ ముదిరాజ్ పోటీ పడుతున్నారు. ఎంఐఎం కూడా తమ అభ్యర్థిని బరిలో నిలిపే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్యే ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది.
శేరిలింగంపల్లి.. ఎవరిదో హవా?
రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఇక్కడ 6,98,133 మంది ఓటర్లు ఉన్నారు. బీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మళ్లీ తన అదృష్ణాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రచారంలో ఆయన దూసుకుపోతున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తనయుడు రవికుమార్ యాదవ్‌కు టికెట్ దాదాపు ఖరారైనట్లే. ఆయన అధికార పార్టీకి గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి యువ నేత రఘునాథ్ యాదవ్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ఈయన కూడా ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే.. ఇక్కడ అధికార బీఆర్‌ఎస్, బీజేపీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment