హైదరాబాద్: బీ ఫామ్‌లు అందించిన మరుసటి రోజు శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్ తగిలింది. ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. మాదాపూర్ కార్పొరేటర్ జంగదీశ్వర్ గౌడ్, ఆయన సతీమణి, హఫీజ్‌పేట్ కార్పొరేటర్ పూజిత గౌడ్‌లు బీఆర్‌ఎస్ వీడనున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఊహాగానాలను ఖండించని జగదీశ్వర్ గౌడ్..ఎట్టకేలకు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పార్టీ కేడర్‌కు స్పష్టమైన సంకేతాలిచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
అక్కడి నుంచి నేరుగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. అభిమానులు, కార్యకర్తలు పెద్దమ్మతల్లి ఆలయం వద్దకు రావాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జగదీశ్వర్ గౌడ్ దంపతులు కాంగ్రెస్‌లో చేరుతుండటంతో బీఆర్‌ఎస్ నాయకులు ఎవరు వెళ్లారనే ఆసక్తి నెలకొంది. జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ నుంచి మొదటిసారి కార్పొరేటర్‌గా గెలిచారు. 2016లో మాదాపూర్ కార్పొరేటర్‌గా టీఆర్‌ఎస్ నుంచి రెండోసారి గెలిపొందారు.
2020లో డివిజన్ల పునర్విభజన జరగడంతో మాదాపూర్‌నుంచి జగదీశ్వర్ గౌడ్, హఫీజ్‌పేట్ నుంచి ఆయన సతీమణి పూజిత గెలుపొందారు. ఈ రెండు డివిజన్లలో ఆయనకు మంచి పట్టు ఉంది. వీరు పార్టీ వీడితే మాదాపూర్, హఫీజ్‌పేట్ డివిజన్లలో బీఆర్‌ఎస్‌కు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా జగదీశ్వర్‌గౌడ్ పార్టీ అధిష్టానానికి అందుబాటులోకి రాకపోవడంతో పార్టీ మారుతున్నట్లు బీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయా డివిజన్లలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా నాయకులెవరు బీఆర్‌ఎస్‌ను వీడవద్దని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సమావేశాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment