హైదరాబాద్: అధికార బీఆర్‌ఎస్ సస్పెన్స్‌లో ఉంచిన గోషామహల్ టికెట్ కోసం ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేది మళ్లీ తానేనని రాజాసింగ్ పునరుద్ఘాటించడంతో అధికార బీఆర్‌ఎస్ టికెట్ ఎవరికి కేటాయించనుందనే ఉత్కంఠను రేపుతోంది. లోకల్, సెటిలర్స్ (ఇక్కడే వ్యాపారాల్లో స్థిరపడిన నార్త్ ఇండియన్స్) వర్గాలుగా టికెట్ తమకంటే తమకివ్వాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. మరోవైపు, సెటిలర్స్ అయిన నార్త్ ఇండియన్లలోనూ రెండు వర్గాలు వేటికవిగా తమ వర్గానికి టికెట్ కేటాయించాలని కోరుతున్నాయి.
నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న నందకిశోర్ వ్యాస్ బిలాల్‌కు టికెట్ ఖాయమైనట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సెటిలర్లకు కాకుండా స్థానికులమైన తమకు కేటాయించాలని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఆశిష్‌కుమార్ యాదవ్ తదితరులు కోరుతున్నారు. మరోవైపు, నార్త్ ఇండియన్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారికిస్తేనే గెలుస్తారనే అభిప్రాయాలున్నప్పటికీ, వారిలోనూ మార్వాడీలకు బదులుగా తమ వర్గానికి టికెట్లివ్వాల్సిందిగా మరాఠీలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో రెండు పర్యాయాలు మార్వాడీలకిచ్చినా గెలవకపోవడాన్ని వారీ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మార్వాడీ వర్గాలు కూడా తమకే టికెట్ ఇవ్వాలని, గతంలో ఓడినా ఈసారి సత్తా చూపుతామంటున్నాయి.
మరాఠీలకివ్వాలి
టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌గా మారి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు కృషి చేస్తున్న తరుణంలో మరాఠీలకు తగిన ప్రాధాన్యమిస్తే రాష్ట్రంలో, దేశంలో రెండు విధాలా ప్రయోజన ముంటుందని మరాఠీ నేతలు చెబుతున్నారు. ఎంతో కాలంగా ఇక్కడే స్థిరపడి వ్యాపారాల నిర్వహణతో పాటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్న తమ వారికి టికెట్ ఇస్తే పార్టీ గెలుస్తుందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తమ సామాజికవర్గానికి చెందిన దిలీప్ ఘనాటేకు ఇవ్వాలంటూ మరాఠీ సంఘాల నేతలు ఆయన సుదీర్ఘ రాజకీయ నేపథ్యాన్ని వివరిస్తూ బీఆర్‌ఎస్ ముఖ్యులను, కొందరు మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. గోషామహల్‌గా మారక ముందు మహరాజ్‌గంజ్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1989లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నేతలు బండారు దత్తాత్రేయ, ముఖేశ్‌గౌడ్‌లపై పోటీ చేసిన చరిత్ర ఆయనకు ఉందని చెబుతున్నారు. మార్వాడీ సామాజిక వర్గానికి చెందిన నందకిశోర్‌వ్యాస్‌ను దృష్టిలో ఉంచుకొని వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
13 నియోజకవర్గాలపై ప్రభావం
► రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరాఠీలకు కనీసం ఒక్క సీటు కేటాయించినా అది ఎంతో ప్రభావం చూపుతుందని వివరిస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గంలో వారి ఓట్లు ఎక్కువగా ఉన్నందున ఆ నియోజకవర్గాన్ని కేటాయించాలంటున్నారు. మరాఠీలు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోని 13 నియోజక వర్గాలతో పాటు మహారాష్ట్రలో కూడా పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఆదిలాబాద్, బోధన్, నిర్మల్, ముథోల్, బాన్స్‌వాడ, జుక్కల్, బోథ్, నారాయణ్ ఖేడ్, ఆందోల్, జహీరాబాద్ లతో పాటు తాండూరు, కొడంగల్ నారాయణ్‌పేట నియోజకవర్గాల్లో మరాఠీ మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారంటున్నారు.
► నగరంలో నిజాం కాలం నుంచీ ఉన్న మహారాష్ట్రకు చెందిన మరాఠీల ఓట్లు గోషామహల్ నియోజకవర్గంలో 25వేలకు పైగా ఉన్నాయని, గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ గెలుపులోనూ అవి కీలక పాత్ర పోషించాయని చెబుతున్నారు. తమ వారు లేనందున మహారాష్ట్రీయులు యూపీకి చెందిన రాజాసింగ్‌కు ఓట్లేశారని పేర్కొంటున్నారు. గతంలో మహరాజ్‌గంజ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన గడ్డం రామస్వామి తమవాడేనంటున్నారు. ఇలా నేటివ్స్, సెటిలర్స్‌గా.. సెటిలర్స్‌లో మార్వాడీలు, మరాఠీలుగా ఎవరికి వారు తమకే టికెట్ కావాలని కోరుతున్నారు.
మహారాష్ట్రలో విస్తరించేందుకు కృషి చేస్తున్న బీఆర్‌ఎస్ ఇక్కడి మరాఠీలకు టిక్కెట్ ఇస్తే.. మహారాష్ట్రలోనూ పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామంటున్నారు. అక్కడ ఎదగాలనుకుంటున్న పార్టీ ఇక్కడ కూడా తమకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందిగా పార్టీనేతలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇంతకీ.. బీఆర్‌ఎస్ మదిలో ఏముందో, ఎవరికి టిక్కెట్ కేటాయించనుందో తెలిసేందుకు సమయం పట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment