గోషామహల్‌, జూబ్లీహిల్స్‌ పోటీపై ఎంఐఎం ఆంతర్యం ఏమిటి? | - | Sakshi
Sakshi News home page

గోషామహల్‌, జూబ్లీహిల్స్‌ పోటీపై ఎంఐఎం ఆంతర్యం ఏమిటి?

Published Thu, Nov 16 2023 6:27 AM | Last Updated on Thu, Nov 16 2023 10:45 AM

- - Sakshi

హైదరాబాద్ముస్లిం గొంతును వినిపించే ఆల్‌ ఇండియా మజ్లిస్‌–ఏ– ఇత్తేహదుల్‌ ముస్లిమీన్‌న్‌ (ఏఐఎంఐఎం) పార్టీ ‘గోషామహల్‌ –జూబ్లీహిల్స్‌’ అసెంబ్లీ స్థానాలపై వ్యవహరిస్తున్న తీరు ముస్లిం సామాజిక వర్గంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పాతబస్తీ పరిధిలోకి వచ్చే గోషామహల్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, కరడుగట్టిన హిందుత్వవాది రాజాసింగ్‌పై పోటీకి దిగకపోవడం, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి, భారత క్రికెట్‌ దిగ్గజం అజహరుద్దీన్‌పై పోటీకి దింపడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ‘రెండింటి అపవాదు’ తలనొప్పిగా తయారై మజ్లిస్‌ ఆత్మరక్షణలో పడింది.

ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్‌ విమర్శలు, బీజేపీ సవాళ్లు ఎదురవతుండగా, సొంత పార్టీలో సైతం తీవ్ర అసంతృప్తి నివురుగప్పిన నిప్పుగా మారింది. గోషామహల్‌, జూబ్లీహిల్స్‌ స్థానాలపై మజ్లిస్‌ అధిష్టానం తీరును తప్పుబడుతూ ఆ పార్టీ మాజీ కార్పొరేటర్‌ ఖాజా బిలాల్‌ రాజీనామా చేశారు. ఏకంగా మజ్లిస్‌ లక్ష్యం గోషామహల్‌లో రాజాసింగ్‌ను గెలిపించడమా? జూబ్లీహిల్స్‌లో అజహరుద్దీన్‌ను ఓడించడమా? అంటూ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి ప్రశ్నలు సంధిస్తూ సోషల్‌ మీడియాలో వీడియో విడుదల చేయడం మరింత చర్చనీంశంగా మారంది. మజ్లిస్‌ పార్టీ అగ్ర నేతలు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిసూ ఎన్నికల ప్రచారం, సభలు సమావేశాల్లో మునిగిపోయారు.

గోషామహల్‌పై ఆంతర్యమేమిటో?
ఈసారి కూడా గోషామహల్‌ అసెంబ్లీ స్ధానంలో ఎంఐఎం పోటీకి దిగలేదు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 82 వేల మందికిపైనే ఓటర్లు ఉండగా, అందులో 79 వేల వరకు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ ఎన్నికల బరిలో దిగకపోవడానికి ఆంత్యరేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్టుకోవడమే తమ లక్ష్యంగా పేర్కొనే మజ్లిస్‌ గోషామహల్‌ నియోజకవర్గంలో ఎందుకు అడ్డుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే ప్రశ్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి లేవనెత్తారు. గతంలో మహరాజ్‌ గంజ్‌లో ఉన్న నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా గోషామహల్‌గా రూపాంతరం చెందింది.

 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించగా, ఆ తర్వాత వరుసగా రెండు పర్యాయాలుగా బీజేపీ గెలుపొందింది. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోకి గోషామహల్‌ సెగ్మెంట్‌ వస్తున్నప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉంటుంది. రాజకీయ మిత్ర పక్షం కావడంతో గతంలో కాంగ్రెస్‌కు, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తూ వస్తోంది. అయితే.. ఇక్కడి నుంచి వరుసగా రెండు పర్యాయాలు బీజేపీ పక్షానా గెలుపొందిన రాజాసింగ్‌ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ నుంచి సస్పెండయ్యారు. కానీ టికెట్ల ప్రకటనకు ముందు సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ రాజాసింగ్‌‎ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. 

ఇస్లాంపై విషం చిమ్ముతున్న రాజాసింగ్‌ను ఓడిస్తామని మజ్లిస్‌ ప్రకటించింది. ఈ నియోజవర్గంలోని ఆరు డివిజన్లలో రెండింటికి మజ్లిస్‌ పాతినిధ్యం వహిస్తోంది. మిగతా డివిజన్లలో సైతం పట్టు ఉంది. దీంతో పోటీ చేసేందుకు మజ్లిస్‌ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలువురు నేతలు ముందుకు వచ్చారు. కానీ.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి సహకరించేందుకు మజ్లిస్‌ పోటీలో దిగకపోవడాన్ని పార్టీతో పాటు ముస్లిం వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ముస్లిం సామాజిక వర్గం గర్వించ దగ్గ భారత క్రికెట్‌ దిగ్గజం అజహరుద్దీన్‌ ఓటమే లక్ష్యంగా మజ్లిస్‌ ఎన్నికల బరిలో దిగిందా? అనే ప్రశ్నకు సమాధానం అవుననే వస్తోంది. గతంలో జూబ్లీహిల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో దిగని మజ్లిస్‌ ఈసారి దిగడాన్ని ముస్లిం వర్గాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.

ఈ నియోజకవర్గంలో 1.20 లక్షల మందికి పైగా మైనారిటీ ఓటర్లు ఉన్నారు. గత రెండు పర్యాయాల క్రితం మజ్లిస్‌ పార్టీ పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. ఈసారి మిత్ర పక్షమైన బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానంపై పోటీ దిగింది. కేవలం కాంగ్రెస్‌ అభ్యర్థి, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అజహరుద్దీన్‌ను ఓడించేందుకు మజ్లిస్‌ ఎన్నికల బరిలో దిగడాన్ని మింగుడుపడని అంశంగా తయారైంది. దీంతో మజ్లిస్‌ తీరుతో ముస్లిం ఓటర్లు దూరమయ్యే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement