హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ సమీపిస్తుండటంతో నగర పోలీసు విభాగం అప్రమత్తమైంది. బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రి వరకు ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండనున్నారు. ఈవీఎంలు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి బయటకు వెళ్లి మళ్లీ స్ట్రాంగ్ రూమ్స్‌కు చేరే వరకు ఎక్కడిక్కడ ప్రత్యేక బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య మంగళవారం తన కార్యాలయం నుంచి సమీక్షించారు. నగర వ్యాప్తంగా 144వ సెక్షన్, నిషేధాజ్ఞలు విధిస్తూ కొత్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని 15 ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
బుధవారం ఉదయం నుంచి వీటి వద్ద ఈవీఎంల పంపిణీ ప్రారంభం కానుంది. సాయంత్రానికి ఈవీఎం బాక్సులు పోలింగ్ కేంద్రాలకు చేరతాయి. ఆపై గురువారం రాత్రి పోలింగ్ ముగిసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్‌కు ఈవీఎంలను తరలిస్తారు. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు విభాగం ప్రత్యేక బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రి వరకు సిబ్బంది, అధికారులు నిర్విరామంగా విధుల్లో ఉండనున్నారు. కీలక ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వారికి మాత్రం రిలీవర్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు.
దీని ప్రకారం నిర్ణీత సమయం తర్వాత ఆ ప్రాంతంలో కొత్త వాళ్ళు వస్తూ రోటేషన్ విధానంలో పని చేస్తారు. నగదు, మద్యం సహా ఇతర వస్తువులు పంపిణీ, ఓటర్ల తరలింపు పైనా నిఘా వేసి ఉంచుతున్నారు. నగర కమిషనరేట్‌లో ఉన్న 7 జోన్లలోనూ అధికారులు కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్‌మార్చ్‌లు ముమ్మరం చేశారు. పోలింగ్ కేంద్రాలను 200 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ విధిస్తూ కొత్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి 8 గంటల వరకు ఇవి అమలులో ఉండనున్నాయి. వీటికి తోడు నగర వ్యాప్తంగా నిషేధాజ్జలు విధించారు. వీటి ప్రకారం నలుగురి కంటే ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడటం, జెండాలతో సహా ఎలాంటి కర్రలు తదితరాలు కలిగి ఉండటం నిషేధం.
Comments
Please login to add a commentAdd a comment