Goshamahal Constituency
-
గోషామహల్, జూబ్లీహిల్స్ పోటీపై ఎంఐఎం ఆంతర్యం ఏమిటి?
హైదరాబాద్: ముస్లిం గొంతును వినిపించే ఆల్ ఇండియా మజ్లిస్–ఏ– ఇత్తేహదుల్ ముస్లిమీన్‌న్ (ఏఐఎంఐఎం) పార్టీ ‘గోషామహల్ –జూబ్లీహిల్స్’ అసెంబ్లీ స్థానాలపై వ్యవహరిస్తున్న తీరు ముస్లిం సామాజిక వర్గంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పాతబస్తీ పరిధిలోకి వచ్చే గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, కరడుగట్టిన హిందుత్వవాది రాజాసింగ్‌పై పోటీకి దిగకపోవడం, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, భారత క్రికెట్ దిగ్గజం అజహరుద్దీన్‌పై పోటీకి దింపడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ‘రెండింటి అపవాదు’ తలనొప్పిగా తయారై మజ్లిస్ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ విమర్శలు, బీజేపీ సవాళ్లు ఎదురవతుండగా, సొంత పార్టీలో సైతం తీవ్ర అసంతృప్తి నివురుగప్పిన నిప్పుగా మారింది. గోషామహల్, జూబ్లీహిల్స్ స్థానాలపై మజ్లిస్ అధిష్టానం తీరును తప్పుబడుతూ ఆ పార్టీ మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ రాజీనామా చేశారు. ఏకంగా మజ్లిస్ లక్ష్యం గోషామహల్లో రాజాసింగ్‌ను గెలిపించడమా? జూబ్లీహిల్స్‌లో అజహరుద్దీన్‌ను ఓడించడమా? అంటూ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ప్రశ్నలు సంధిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేయడం మరింత చర్చనీంశంగా మారంది. మజ్లిస్ పార్టీ అగ్ర నేతలు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిసూ ఎన్నికల ప్రచారం, సభలు సమావేశాల్లో మునిగిపోయారు. గోషామహల్పై ఆంతర్యమేమిటో? ఈసారి కూడా గోషామహల్ అసెంబ్లీ స్ధానంలో ఎంఐఎం పోటీకి దిగలేదు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 82 వేల మందికిపైనే ఓటర్లు ఉండగా, అందులో 79 వేల వరకు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ ఎన్నికల బరిలో దిగకపోవడానికి ఆంత్యరేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్టుకోవడమే తమ లక్ష్యంగా పేర్కొనే మజ్లిస్ గోషామహల్ నియోజకవర్గంలో ఎందుకు అడ్డుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే ప్రశ్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేవనెత్తారు. గతంలో మహరాజ్ గంజ్‌లో ఉన్న నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా గోషామహల్‌గా రూపాంతరం చెందింది. ► 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, ఆ తర్వాత వరుసగా రెండు పర్యాయాలుగా బీజేపీ గెలుపొందింది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి గోషామహల్ సెగ్మెంట్ వస్తున్నప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉంటుంది. రాజకీయ మిత్ర పక్షం కావడంతో గతంలో కాంగ్రెస్‌కు, ఆ తర్వాత బీఆర్ఎస్కు మద్దతు ఇస్తూ వస్తోంది. అయితే.. ఇక్కడి నుంచి వరుసగా రెండు పర్యాయాలు బీజేపీ పక్షానా గెలుపొందిన రాజాసింగ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ నుంచి సస్పెండయ్యారు. కానీ టికెట్ల ప్రకటనకు ముందు సస్పెన్షన్ ఎత్తివేస్తూ రాజాసింగ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. ► ఇస్లాంపై విషం చిమ్ముతున్న రాజాసింగ్‌ను ఓడిస్తామని మజ్లిస్ ప్రకటించింది. ఈ నియోజవర్గంలోని ఆరు డివిజన్లలో రెండింటికి మజ్లిస్ పాతినిధ్యం వహిస్తోంది. మిగతా డివిజన్లలో సైతం పట్టు ఉంది. దీంతో పోటీ చేసేందుకు మజ్లిస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలువురు నేతలు ముందుకు వచ్చారు. కానీ.. బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించేందుకు మజ్లిస్ పోటీలో దిగకపోవడాన్ని పార్టీతో పాటు ముస్లిం వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ► ముస్లిం సామాజిక వర్గం గర్వించ దగ్గ భారత క్రికెట్ దిగ్గజం అజహరుద్దీన్ ఓటమే లక్ష్యంగా మజ్లిస్ ఎన్నికల బరిలో దిగిందా? అనే ప్రశ్నకు సమాధానం అవుననే వస్తోంది. గతంలో జూబ్లీహిల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో దిగని మజ్లిస్ ఈసారి దిగడాన్ని ముస్లిం వర్గాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ► ఈ నియోజకవర్గంలో 1.20 లక్షల మందికి పైగా మైనారిటీ ఓటర్లు ఉన్నారు. గత రెండు పర్యాయాల క్రితం మజ్లిస్ పార్టీ పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. ఈసారి మిత్ర పక్షమైన బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంపై పోటీ దిగింది. కేవలం కాంగ్రెస్ అభ్యర్థి, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అజహరుద్దీన్‌ను ఓడించేందుకు మజ్లిస్ ఎన్నికల బరిలో దిగడాన్ని మింగుడుపడని అంశంగా తయారైంది. దీంతో మజ్లిస్ తీరుతో ముస్లిం ఓటర్లు దూరమయ్యే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. -
గోషామహల్ టికెట్ కోసం పోటాపోటీ
హైదరాబాద్: అధికార బీఆర్ఎస్ సస్పెన్స్‌లో ఉంచిన గోషామహల్ టికెట్ కోసం ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేది మళ్లీ తానేనని రాజాసింగ్ పునరుద్ఘాటించడంతో అధికార బీఆర్ఎస్ టికెట్ ఎవరికి కేటాయించనుందనే ఉత్కంఠను రేపుతోంది. లోకల్, సెటిలర్స్ (ఇక్కడే వ్యాపారాల్లో స్థిరపడిన నార్త్ ఇండియన్స్) వర్గాలుగా టికెట్ తమకంటే తమకివ్వాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. మరోవైపు, సెటిలర్స్ అయిన నార్త్ ఇండియన్లలోనూ రెండు వర్గాలు వేటికవిగా తమ వర్గానికి టికెట్ కేటాయించాలని కోరుతున్నాయి. నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న నందకిశోర్ వ్యాస్ బిలాల్‌కు టికెట్ ఖాయమైనట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సెటిలర్లకు కాకుండా స్థానికులమైన తమకు కేటాయించాలని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఆశిష్‌కుమార్ యాదవ్ తదితరులు కోరుతున్నారు. మరోవైపు, నార్త్ ఇండియన్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారికిస్తేనే గెలుస్తారనే అభిప్రాయాలున్నప్పటికీ, వారిలోనూ మార్వాడీలకు బదులుగా తమ వర్గానికి టికెట్లివ్వాల్సిందిగా మరాఠీలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో రెండు పర్యాయాలు మార్వాడీలకిచ్చినా గెలవకపోవడాన్ని వారీ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మార్వాడీ వర్గాలు కూడా తమకే టికెట్ ఇవ్వాలని, గతంలో ఓడినా ఈసారి సత్తా చూపుతామంటున్నాయి. మరాఠీలకివ్వాలి టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు కృషి చేస్తున్న తరుణంలో మరాఠీలకు తగిన ప్రాధాన్యమిస్తే రాష్ట్రంలో, దేశంలో రెండు విధాలా ప్రయోజన ముంటుందని మరాఠీ నేతలు చెబుతున్నారు. ఎంతో కాలంగా ఇక్కడే స్థిరపడి వ్యాపారాల నిర్వహణతో పాటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్న తమ వారికి టికెట్ ఇస్తే పార్టీ గెలుస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ సామాజికవర్గానికి చెందిన దిలీప్ ఘనాటేకు ఇవ్వాలంటూ మరాఠీ సంఘాల నేతలు ఆయన సుదీర్ఘ రాజకీయ నేపథ్యాన్ని వివరిస్తూ బీఆర్ఎస్ ముఖ్యులను, కొందరు మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. గోషామహల్‌గా మారక ముందు మహరాజ్‌గంజ్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1989లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నేతలు బండారు దత్తాత్రేయ, ముఖేశ్గౌడ్లపై పోటీ చేసిన చరిత్ర ఆయనకు ఉందని చెబుతున్నారు. మార్వాడీ సామాజిక వర్గానికి చెందిన నందకిశోర్వ్యాస్ను దృష్టిలో ఉంచుకొని వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. 13 నియోజకవర్గాలపై ప్రభావం ► రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరాఠీలకు కనీసం ఒక్క సీటు కేటాయించినా అది ఎంతో ప్రభావం చూపుతుందని వివరిస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గంలో వారి ఓట్లు ఎక్కువగా ఉన్నందున ఆ నియోజకవర్గాన్ని కేటాయించాలంటున్నారు. మరాఠీలు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోని 13 నియోజక వర్గాలతో పాటు మహారాష్ట్రలో కూడా పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఆదిలాబాద్, బోధన్, నిర్మల్, ముథోల్, బాన్స్వాడ, జుక్కల్, బోథ్, నారాయణ్ ఖేడ్, ఆందోల్, జహీరాబాద్ లతో పాటు తాండూరు, కొడంగల్ నారాయణ్‌పేట నియోజకవర్గాల్లో మరాఠీ మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారంటున్నారు. ► నగరంలో నిజాం కాలం నుంచీ ఉన్న మహారాష్ట్రకు చెందిన మరాఠీల ఓట్లు గోషామహల్ నియోజకవర్గంలో 25వేలకు పైగా ఉన్నాయని, గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ గెలుపులోనూ అవి కీలక పాత్ర పోషించాయని చెబుతున్నారు. తమ వారు లేనందున మహారాష్ట్రీయులు యూపీకి చెందిన రాజాసింగ్‌కు ఓట్లేశారని పేర్కొంటున్నారు. గతంలో మహరాజ్‌గంజ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన గడ్డం రామస్వామి తమవాడేనంటున్నారు. ఇలా నేటివ్స్, సెటిలర్స్గా.. సెటిలర్స్‌లో మార్వాడీలు, మరాఠీలుగా ఎవరికి వారు తమకే టికెట్ కావాలని కోరుతున్నారు. మహారాష్ట్రలో విస్తరించేందుకు కృషి చేస్తున్న బీఆర్ఎస్ ఇక్కడి మరాఠీలకు టిక్కెట్ ఇస్తే.. మహారాష్ట్రలోనూ పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామంటున్నారు. అక్కడ ఎదగాలనుకుంటున్న పార్టీ ఇక్కడ కూడా తమకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందిగా పార్టీనేతలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇంతకీ.. బీఆర్ఎస్ మదిలో ఏముందో, ఎవరికి టిక్కెట్ కేటాయించనుందో తెలిసేందుకు సమయం పట్టనుంది. -
గోషామహాల్ BLP ఆభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి
-
బరిలో... అబ్బాయ్ - బాబాయ్!?
గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్లో అబ్బాయి-బాబాయిలు బరిలో ప్రత్యర్థులుగా నిలిచే పరిస్థితులు కన్పిస్తున్నాయి. మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రం గౌడ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుండగా...ముఖేష్ గౌడ్ సోదరుడు మధుగౌడ్ బీజేపీ నుంచి ఇదే స్థానంలో పోటీ చేసేందుకు ఉద్యుక్తుడవుతున్నారు. మధు గౌడ్ గతేడాది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. వాస్తవానికి విక్రంగౌడ్ గన్‌ఫౌండ్రి డివిజన్‌పై ఆశలు పెట్టుకోగా ఆ స్థానం మహిళలకు రిజర్వు అయింది. వెంటనే ఆయన తాను జాంబాగ్ నుంచి పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు. తానేమీ తక్కువ కాదంటూ మధుగౌడ్ సైతం జాంబాగ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని తన అనుచరులతో కలిసి ప్రకటించారు. దీంతో ఈ స్థానంలో అబ్బాయి-బాబాయిల పోటీ చూడాల్సి వస్తుందేమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. - అబిడ్స్ -
వాగ్దానాలను అమలు చేస్తాం: నాయిని
హైదరాబాద్: ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం బేగంబజార్ శృంగరుషి భవన్లో టీఆర్ఎస్ నేతలు శంకర్లాల్యాదవ్, న్యాయవాది రాజశేఖర్‌లు ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. ఇళ్ల నిర్మాణాలు, పోలీస్ వ్యవస్థలో మార్పులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరుస్తామన్నారు. గోషామహల్ నియోజకవర్గంతోపాటు బేగంబజార్ ప్రాంతంలో తనకు ఎంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. నియోజకవర్గంలో పార్టీని పటి ష్టపర్చాలని సూచించారు. 14 సంవత్సరాల పాటు ఉద్యమాలుచేసి సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా రూపొందించడమే పార్టీ ధ్యేయమన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేసే విధంగా చూడాలన్నారు. ఈ సందర్భంగా శంకర్లాల్యాదవ్, రాజశేఖర్‌లు నాయినికి పగడికట్టి సన్మానించారు.