సబ్సిడీపై గొర్రె పిల్లల పంపిణీకి నిధులు
బడ్జెట్‌లో కేటాయింపులు: మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: గొల్ల, కుర్మల కుటుంబాలకు 75 శాతం సబ్సిడీపై గొర్రె పిల్లలను పంపిణీ చేసేందుకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరిగిందని పశుసంవర్థక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. సోమవారం సచివాలయంలో తలసాని అధ్యక్షతన మంత్రివర్గ ఉపసం ఘం భేటీ అయింది. ఈ సమావేశానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, గొర్రెల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ కన్నెబోయిన రాజ య్యయాదవ్, పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా, డైరెక్టర్ వెంకటే శ్వర్లు, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్ హాజరైయ్యా రు.
అనంతరం తలసాని మాట్లాడుతూ... కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది సీఎం కేసీఆర్ ఆలోచనన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీపై రూ.1.25 లక్షల వ్యయంతో (20+1యూనిట్‌గా) గొర్రె పిల్లలను అందజేస్తామన్నారు. రాష్ట్రంలో 4 లక్షల కుటుంబాలు గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. అందులో 2 లక్షల కుటుంబాలకు ఈ సంవత్సరం, మిగిలినవారికి వచ్చే ఏడాది గొర్రె పిల్లలను పంపిణీ చేస్తామన్నారు.