సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం అమలుకు అవసరమైన నిధులను రుణం కింద సమకూర్చుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వెంటనే సబ్సిడీ గొర్రెల పంపిణీ చేపట్టాలని సీఎం కేసీఆర్ స్వయంగా ఆదేశాలిచ్చారు. ఆ మేరకు పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా ఏర్పాట్లు కూడా చకచకా చేస్తున్నారు.
కానీ, ఈ పథకం రెండో దఫా రాష్ట్రంలో అమలు చేయాలంటే రూ.4,565 కోట్ల రుణం కావాలి. ఈ రుణాన్నిచ్చేందుకు జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) ఆమోదం తెలిపి కూడా ఆరునెలలు దాటిపోయింది. కానీ, ప్రభుత్వ పూచీకత్తు లభించకపోవడంతో ఆ ఆమోదం కాగితాలకే పరిమితం అయింది. ఇప్పుడు కేబినెట్ ఆమోదంతో ఆ రుణం ఎప్పుడు వస్తుందా అని పశుసంవర్ధక శాఖ అధికారులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
అప్పటివరకు గొర్రెల కొనుగోలు కోసం తమ వద్ద ఉన్న రూ.100 కోట్ల వరకు ఖర్చు పెట్టగలమని, ఆ తర్వాత ఎన్‌సీడీసీ రుణంపైనే ఆధారపడాల్సి ఉంటుందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు రుణం వస్తుందనే ఆశతో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అమలుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
నగదు బదిలీతో కాదు..
వాస్తవానికి, ఈ పథకం కింద గొర్రెల పంపిణీని నగదు బదిలీ ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించినా ఆ తర్వాత వెనక్కు తగ్గింది. పైలట్‌గా నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమచేసి గొర్రెలు కొనుగోలు చేపట్టింది. ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురుకావడంతో మళ్లీ పాత తరహాలోనే ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలు కొనుగోలు చేయనుంది.
ఇందుకోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సన్నాహాలు జరుగుతున్నాయి. కొనుగోలు చేసిన గొర్రెలను లబ్దిదారుల వద్దకు చేర్చేందుకు అవసరమైన రవాణా కాంట్రాక్టు టెండర్లను జిల్లా స్థాయిలో పిలవగా, ఇప్పుడు ఆ ప్రక్రియ జరుగుతోంది. ఈ టెండర్ల ఖరారయిన తర్వాత గొర్రెల కొనుగోలు, పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెపుతున్నారు.
కొనుగోలు బాధ్యత జిల్లా అధికారులకు..
కొనుగోలు కోసం జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పజెపుతున్నారు. గతంలో మండల స్థాయిలో పశుసంవర్ధక శాఖ అధికారులతో కొనుగోళ్లు జరిపించగా, ఈసారి మాత్రం జిల్లా స్థాయి అధికారులతో (డీఆర్‌వో, ఆర్డీవో, పీడీ డీఆర్‌డీఏ, జిల్లా వ్యవసాయాధికారులు, ఇతర శాఖలకు చెందిన జిల్లా అధికారులు) కొనుగోలు ప్రక్రియ చేపట్టనున్నారు.
గొర్రెల కోసం ఇప్పటివరకు 30వేల మందిలోపు లబ్దిదారులే డీడీలు తీయగా, మిగిలిన వారి చేత కూడా డీడీలు కట్టించే పనిలో స్థానిక అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం మీద ఏప్రిల్ 14 తర్వాత రెండో విడత గొర్రెల పంపిణీ పథకం అమలు చేపడతామని, ఏప్రిల్ నెలాఖరు కల్లా ఎన్‌సీడీసీ రుణం వస్తుందని ఆశిస్తున్నామని పశుసంవర్ధక శాఖ అధికారులు ఆశాభావంతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment