సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుంచి అమల్లోకి వచ్చిన ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ (కోడ్) ఏయే పథకాలకు వర్తిస్తుందనే అంశంపై ప్రభుత్వ వర్గాల్లో గందరగోళం నెలకొంది. గతంలో ఉన్న పథకాలే అయినప్పటికీ ఆ పథకం కింద కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసే వెసులుబాటు కోడ్ అమల్లో ఉంటే సాధ్యం కాదు. కానీ, ఈ కోడ్ సాకుగా కొన్ని పాత పథకాలు, ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసిన పథకాలను అమలు చేయడంలో కొందరు అధికారుల గందరగోళ వైఖరి చర్చకు దారితీస్తోంది.
రెవెన్యూ కార్యకలాపాలు ‘యథాతథం’
ఇక, కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రెవెన్యూ కార్యకలాపాల్లో ఎలాంటి అవాంతరాలు ఉండవని, రెవెన్యూ సిబ్బంది ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమవుతారే తప్ప దైనందిన రెవెన్యూ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
ముఖ్యంగా ధ్రువీకరణ పత్రాల మంజూరు, ధరణి దరఖాస్తుల పరిష్కారం లాంటివి కోడ్ కారణంగా ఆగిపోవని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న జీవో 58, 59ల ద్వారా భూముల క్రమబద్ధీకరణ కూడా ఆగదని అంటున్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి కూడా ఒక విడత నిధులు మంజూరైన లబ్ధిదారునికి రెండో విడత నిధులు మంజూరుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా అధికారులు చెబుతున్నారు.
జిల్లాకో తీరుగా గొర్రెల పంపిణీ
సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం విషయంలో ఎన్నికల కోడ్‌ను జిల్లాకో రీతిలో అమలుపరుస్తున్న తీరు విస్మయపరుస్తోంది. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు రెండో విడత రాష్ట్రంలో అమలవుతోంది. మొత్తం 3.5లక్షలకు పైగా లబ్ధిదారులను ఎంపిక చేయగా, అందులో 1.25లక్షల మందికి పైగా లబ్ధిదారులు వారి వాటా మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేశారు.
ఇందులో కోడ్ అమల్లోకి వచ్చే నాటికి కేవలం 28వేల మందికి మాత్రమే గొర్రెలు పంపిణీ చేశారు. ఇక కోడ్ అమల్లోకి వచ్చిందే తడవుగా ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకోకుండా చేతులెత్తేసిన పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్ణయాధికారాన్ని పూర్తిగా కలెక్టర్లకు వదిలేశారు. దీంతో కొన్ని జిల్లాల కలెక్టర్లు గొర్రెలను పంపిణీ చేయవద్దని ఆదేశాలు జారీ చేస్తుండడంతో ఆయా జిల్లాల్లో గొర్రెల కొనుగోళ్ల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన పశుసంవర్ధక శాఖ అధికారులు వెనక్కు వచ్చేస్తున్నారు.
మరికొన్ని జిల్లాల్లో మాత్రం కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా యథావిధిగా కొనుగోళ్లు చేస్తుండడం గమనార్హం. కొసమెరుపేమిటంటే... 2018 ఎన్నికల సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన తర్వాత గొర్రెల పథకం అమలు కావడం గమనార్హం.
ఆ బాధ్యత అధికారులదే..
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుపై సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘కోడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు, ప్రజలపై ఉంది. కోడ్ అడ్డురాని పథకాలను, కార్యక్రమాలను, జీవోలను, రోజువారీ కార్యకలాపాలను యథాతథంగా అమలు చేసే బాధ్యత అధికారులదే. ఈ విషయంలో అధికారులదే తుది నిర్ణయం’ అని స్పష్టం చేశారు.
డబ్బుల్లేవని కోడ్ మాట చెపుతున్నారు
‘అసలు కోడ్‌కు గొర్రెల పథకానికి సంబంధం లేదు. 2018లో ఎన్నికలు జరిగే రోజున కూడా గొర్రెలు పంపిణీ చేశారు. ఇప్పుడు కూడా కోడ్ సమస్య కాదు. సరిగా నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేసి గొల్లకుర్మలను మోసం చేసింది. ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓట్లేస్తారనే భయంతో కోడ్ అనే సాకు చూపెడుతున్నారు.’
– ఉడుత రవీందర్, జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment