హైదరాబాదులో ఆర్య సమాజ్‌లో వివాహం సందర్భంగా పూలదండలు మార్చుకుంటున్న కల్యాణ్‌కుమార్‌రెడ్డి, జోత్స్న
వైఎస్‌ఆర్ జిల్లా, రాయచోటి: మహిళలకు అనుకూలంగా ఎన్ని చట్టాలు వచ్చినా... మహిళల సాధికారితే తమ ప్రభుత్వాల ధ్యేయమంటున్నా నేటికీ అనేక మంది మహిళలకు న్యాయం లభించక దిక్కుతోచక దీన స్థితిలో ఉన్నారు. నయవంచనకు, మోసపూరిత మాటలకు, యుక్త వయసులో కనిపించే వ్యామోహాల ఫలితమో తెలియదు కానీ కన్న పెద్దలను ఎదిరించి వివాహాలు చేసుకున్న కొద్ది రోజులకే యువతీ యువకుల అంచనాలు తలకిందులై పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ ఎన్నో జంటలు తిరుగుతున్నాయి. నమ్మించి, ప్రేమించి తనను వివాహం చేసుకున్న భర్త బి.కల్యాణకుమార్‌రెడ్డి ఏడాది తిరగక ముందే తనను వదలి గుట్టు చప్పుడు కాకుండా గల్ఫ్ దేశాలకు వెళ్లిపోయాడంటూ రాయచోటి పట్టణానికి చెందిన ఎం.జోత్స్న అనే వివాహిత రోధిస్తోంది. గల్ఫ్ దేశానికి వెళ్లిన కల్యాణకుమార్‌రెడ్డి రెండేళ్లవుతున్నా తిరిగి రాకపోగా కొంత డబ్బులు చెల్లిస్తాను, నీ బతుకు నువ్వు బతుక్కోమంటూ ఫోన్ ద్వారా చెబుతున్నారంటోంది.
ఇష్టపడి, వెంటబడి ప్రేమించి పెళ్లి చేసుకున్న కల్యాణ్‌ను మా అత్త, అమ్మమ్మలు కలిసి తన నుంచి దూరం చేసే కుట్ర చేశారంటూ బోరున విలపిస్తోంది. తనకు జరుగుతున్న అన్యాయంపై పోలీసు స్టేషన్లు, కోర్టులు, పెద్ద మనుషుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదంటూ కన్నీటి పర్యంతమవుతోంది. బిటెక్ చదివే రోజుల్లోనే ప్రేమించలేనని చెప్పినా మత్తుమందు తిని బెదిరించడంతో నమ్మించి ప్రేమిం చానంటోంది. అదే సమయంలోనే కల్యాణ్ తల్లి సరస్వతి నాకున్నది ఒక్క మగబడ్డేనని, అతను ఏమైనా అయితే తట్టుకోలేనంటూ గల్ఫ్ దేశం నుంచి ఫోన్ ద్వారా మాట్లాడిందన్నారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కాదు కాబట్టి మీరిద్దరు కలిసి పెళ్లి చేసుకోండని చెప్పడంతో పాటు సంసారం చేసుకునేందుకు కొంత వంట సామగ్రి కొనుగోలుకు డబ్బులు కూడా పంపిందన్నారు. దాంతో ఇద్దరం కలిసి హైదరాబాదులోని ఆర్య సమాజంలో 2014వ సంవత్సరం ఆగస్టు 24వ తేదీన వివాహం చేసుకున్నామన్నారు.
ఇద్దరం బిటెక్ పూర్తి చేసుకున్నా స్థానికంగా ప్రయివేటు పాఠశాలలో తాను మాత్రమే టీచరుగా పని చేస్తూ ఏడాది పాటు కాలం గడిపామన్నారు. ఈ సమయంలో రెండు పర్యాయాలు గర్భం దాల్చినా ఇప్పట్లో సంతానం కలిగితే ఆర్థికంగా ఇబ్బందులు పడతా మంటూ నమ్మించి అబార్షన్ కూడా చేయించాడని వాపోయింది. 2016 జనవరి 16వ తేదీన గల్ఫ్ దేశానికి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లబోయాడని, వెంటనే విషయాన్ని తమ అమ్మనాన్నలకు తెలియపరిచి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. వెంటనే ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో చెన్నై వెళ్లి పాస్‌పోర్టును సీజ్ చేయడంతో పాటు అరెస్టు చేయించామన్నారు. కానీ అప్పటి సీఐ తమకు ఎలాంటి న్యాయం చేయకపోగా స్టేషన్ బెయిల్ ఇచ్చి కళ్యాణ్‌ను భయటకు పంపించేశారన్నారు. అదే ఏడాది మార్చి 18వ తేదీన ఎవ్వరికీ తెలియకుండా కువైట్ దేశానికి వెళ్లిపోయాడన్నారు. నాటి నుంచి తిరిగి రాకపోకా ఫోన్ల ద్వారా బెదిరిస్తూ విడిపోదామంటూ వేధనకు గురి చేస్తున్నాడని ఆవేదనను వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment