బతుకు ఎడారి | special story on gulf victims | Sakshi
Sakshi News home page

బతుకు ఎడారి

Published Sat, Jan 13 2018 12:31 PM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

special story on gulf victims - Sakshi

ఉపాధి కోసం గల్ఫ్‌ దేశానికి వెళ్లిన యువకుడు కుటుంబానికి ఆసరా అవుతాడని అనుకుంటే.. ఆ ఆశలు నెరవేరకపోగా, అక్కడే అసువులు బాసిన సంఘటన ఇది. అత్తిలి మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన కుడిపూడి కిశోర్‌నాగేంద్ర (పై ఫొటోలోని యువకుడు) గల్ఫ్‌ దేశంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గతేడాది నవంబర్‌లో అతడు చనిపోతే.. మృతదేహం రెండు నెలల తర్వాత స్వదేశానికి చేరింది.

తణుకు: గల్ఫ్‌... అంటే అంతా కాసుల గలగల అనుకుంటారు. ఓసారి వెళ్లొస్తే సెటిలైపోవచ్చని ఆశపడతారు... ఎడారి దేశానికి ఎవరెళ్లినా నాలుగు రాళ్లు సంపాదిస్తే కుటుంబం బాగుపడుతుందని ఆరాట పడతారు. సొంత ఊళ్లో పనులు లేక... వ్యవసాయం కలిసి రాక... పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇలా పేరుకుపోతున్న అప్పులు తీర్చుకునేందుకు దుబాయి ప్రయాణం. అక్కడ కూడా ఇబ్బందులే. సరైన పని దొరక్క... తిరిగి రాలేక... అప్పులు తీర్చే మార్గం కనిపించక అనేక మంది సతమతమవుతున్నారు. ఆదిలోనే ఏజెంటు చేతిలో మోసపోతే... వెళ్లాక చెప్పిన పనికి కుదరకపోతే... పని చేసినా చేతికి చిల్లిగవ్వ ఇవ్వనని సేఠ్‌లు‡ మొండికేస్తే ఎడారిలో ఒంటెల మధ్యే జీవితం తెల్లారిపోతోంది. ఇంకొంత మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం లేదంటే క్షతగాత్రులుగా మారుతున్నారు. ఇక మృతదేహం స్వదేశానికి తీసుకురావాలంటే అదనపు ఖర్చులు... రోజుల తరబడి కుటుంబ సభ్యుల ఎదురుచూపులు... జిల్లా నుంచి గల్ఫ్‌ దేశాలకు వలస వెళుతున్న అనేక మంది జీవితాలు దాదాపుగా ఇలాగే ఉంటున్నాయి.

కలల నరకం...
ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన ఎందరో జీవితాలు చీకట్లో మగ్గిపోతున్నాయి. పొట్ట చేతపట్టుకుని గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన వారెందరో కన్నీటి కడలిలో మునిగి తేలుతున్నారు. నిత్యం ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. లక్షలు వెచ్చించి ఏజెంట్ల మోసాలకు గురై మ«ధ్యలోనే ఆగిపోయేవారు కొందరైతే... మరికొందరిని ఇంటర్వ్యూల పేరుతో ఢిల్లీ, ముంబయి వంటి నగరాలకు తీసికెళ్లి వారికి అక్కడే వదిలి వచ్చే ఏజెంట్లు కూడా ఉన్నారు. కొందరైతే మహిళలను రోజుల తరబడి లాడ్జిల్లో ఉంచి మాయమాటలు చెప్పి లొంగదీసుకుంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కొందరైతే టూరిస్టు వీసాలతో వచ్చి గతిలేని పనులు చేస్తూ జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. జిల్లా నుంచి ఉపాధి కోసం వేలాది మంది కువైట్, మస్కట్, సౌదీ అరేబియా, బెహ్రయిన్, దుబాయ్, మలేషియా, సింగపూర్‌ వంటి దేశాలకు ఎక్కువగా వెళ్తున్నారు. ఆర్థికంగా కొందరు స్థిరపడినా ఎంతోమంది ఎండమావుల ఆశతో వెళ్లి అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. ఏజెంట్ల మోసాలకు బలై పనుల్లేక చేయని నేరాలకు జైళ్లలో మగ్గుతున్న వారి సంఖ్య వందల్లోనే ఉందంటే పరిస్థితి అర్థమవుతోంది. కొందరు యజమానులు అక్కడ పెట్టే చిత్రహింసలు భరించలేక ఇంటికొచ్చే దారి లేక కుటుంబాలతో సంబంధాలు లేక రెక్కలు తెగిన పక్షుల్లా విలవిల్లాడుతున్నారు. అక్కడ నరకకూపంలో చిక్కుకుని నరకయాతన అనుభవించే కంటే ఆత్మహత్యే శరణ్యమంటూ తనువు చాలిస్తున్నవారి సంఖ్య ఇటీవల ఎక్కువైంది.

అంగడి బొమ్మల్లా...
కువైట్, సౌదీ, ఒమన్, ఖతార్‌ వంటి దేశాల్లో పనివాళ్లను, కార్మికులను సప్లయి చేసే కార్యాలయాలు ఉంటాయి. అక్కడి ఏజెంట్లు ఇక్కడి ఏజెంట్లు ద్వారా ఎక్కువ సంపాదన ఆశ చూపించి పేదవారిని వలలో వేసుకుంటున్నారు. ఇక్కడి ఏజెంటు ద్వారా ఆ దేశంలో అడుగు పెట్టగానే వారి కార్యాలయాలకు తీసికెళతారు. అక్కడ వారు ఎవరి ఇంట్లో పనికి కుదిరితే వాళ్లు వచ్చి తీసికెళతారు. పని బాగుంటే పర్లేదు కానీ ఇబ్బందులు ఎదురైతే మాత్రం యజమాని తిరిగి తీసికెళ్లిన కార్యాలయానికే అప్పగించేస్తారు. ఎవరు వచ్చి పనికి తీసికెళతారో తెలియక ఇప్పటి వరకు కార్యాలయాల వద్దే అంగడి బొమ్మల్లా ఎదురు చూడాల్సిన పరిస్థితి. మరోవైపు ఉపాధి కోసం గంపెడాశతో గల్ఫ్‌ వెళితే అక్కడ పనులు లేక చాలా మంది ఎడారుల్లో గొర్రెలు, ఒంటెల కాపరులుగా బతుకుతున్నారు. భాష రాక, తిండి లేక ఎడారుల్లో, గుడారాల్లో ఎంతో మంది బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా గడుపుతున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో భారత రాయబార కార్యాలయాలు ఉంటాయి. భారతదేశానికి చెందిన వారికి సహాయం చేయడం. విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవడం, స్వస్థలాలకు పంపించడంలో చొరవ చూపడం వంటివి వీటి ప్రధాన విధి. వీటిని విస్తృత పరిచి అన్ని గల్ఫ్‌ దేశాల్లో ప్రధాన నగరాల్లో కార్యాలయాలు ఉంటాయి. అయితే అవి ఎక్కడ ఉంటాయో, ఎలా చేరుకోవాలో చాలా మందికి తెలియదు. ఆయా దేశాలకు వెళ్లే వారిలో ఎక్కువగా చదువురాని వారే ఉంటారు.

మోసాలకు గురికావద్దు...
ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారు ఎక్కువగా ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. ఏజెంట్ల మోసాలపై ఎన్నో కేసులు నమోదు చేస్తున్నాం. అయితే ఇలా గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారు సమగ్రంగా అవగాహన తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఏజెంట్లు ఇచ్చే వీసాలను సమగ్రంగా పరిశీలించుకున్న తర్వాతనే వెళ్లాలి. కొన్నిసార్లు టూరిస్టు వీసాలతో విదేశాలకు పంపుతున్న సంఘటనలు ఉంటున్నాయి. ఇలాంటి విషయాల్లో మోసపోకుండా జాగ్రత్త పడాలి. – కె.ఎ.స్వామి, సీఐ, తణుకు

ఉపాధి కోసం దుబాయి వెళ్లిన తణుకు పట్టణానికి చెందిన ఎలుబూడి సుబ్బారావు అక్కడ చిత్రహింసలు అనుభవిస్తున్నాడు. ఏజెంట్లు సూరిబాబు, భాస్కర్‌లు తాపీపని అని చెప్పి నమ్మించి గతేడాది సెప్టెంబరులో దుబాయికి పంపిం చారు. అయితే అక్కడ తనకు చేతకాని వడ్రంగి పని అప్పజెప్పడంతోపాటు బరువైన దుంగలను మోయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తక్కువ వేతనం ఇవ్వడమే కాకుండా రోజుకు 12 గంటలు పైగా పని చేయిస్తున్నారంటూ ఇక్కడి బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు బాధితుడి కుటుంబ సభ్యులు స్థానిక నేతల ద్వారా ఎంబసీకి ఫిర్యాదు చేశారు.

ఎలక్ట్రీషియన్‌ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి టూరిస్ట్‌ వీసాపై షార్జాకు పంపిన ఏజెంట్‌ తనను మోసం చేశాడంటూ ఒక బాధితుడు వాపోయాడు. కుంచనపల్లి గ్రామానికి చెందిన పృ«ధ్వీ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో అక్కడి నుంచి తన గోడును వెళ్లబోసుకున్నాడు. తణుకు పట్టణానికి చెందిన రాయల్‌ ట్రావెల్స్‌ యజమాని నర్సింహరాజు ద్వారా తాను షార్జా వచ్చి మోసపోయానని చెబుతున్నాడు. ఈ మేరకు సంబంధిత వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన వద్ద రూ. 80 వేలు తీసుకుని ఎలక్ట్రీషియన్‌ ఉద్యోగం ఉందని గతేడాది నవంబర్‌ 15న షార్జా పంపారని చెప్పాడు. షార్జాలో ఖాన్‌ అనే ఏజెంటు తనను హెల్పర్‌గా పని చేయాలని చెప్పాడన్నారు. అన్ని పనులు చేయాలని చెప్పడంతోపాటు తనను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement