బిగుస్తున్న ‘గొర్రెల’ ఉచ్చు | ED enters field along with ACB on Sheep Distribution Scheme Scam | Sakshi
Sakshi News home page

బిగుస్తున్న ‘గొర్రెల’ ఉచ్చు

Published Fri, Jun 14 2024 3:19 AM | Last Updated on Fri, Jun 14 2024 3:19 AM

ED enters field along with ACB on Sheep Distribution Scheme Scam

కుంభకోణంలో ప్రజాప్రతినిధులు కేంద్రంగా దర్యాప్తు!

ఏసీబీతో పాటు రంగంలోకి ఈడీ 

మనీలాండరింగ్‌ అంశంపై  కేసు నమోదు... ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్‌ 

సమగ్ర సమాచారం కోరుతూ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ ఎండీకి లేఖ 

అత్యవసరంగా పరిగణించి అందజేయాలంటూ సూచన  

ఇప్పటికే 9 మంది అరెస్టు.. పరారీలో ఉన్న కాంట్రాక్టర్లు దొరికితే కొత్త కోణాలు వెలుగులోకి!... నేడు పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఈడీ అధికారులు?

సాక్షి, హైదరాబాద్‌: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రజాప్రతినిధులు కేంద్రంగా ఉచ్చు బిగుస్తోంది. ఒకవైపు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు కొనసాగిస్తుండగా..మరోవైపు మనీలాండరింగ్‌ అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసు నమోదు చేసింది. కొనుగోలు చేసిన గొర్రెలనే మళ్లీ మళ్లీ కొన్నట్టు చూపడంతో పాటు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై అప్పటి మంత్రి పేషీ కేంద్రంగా జరిగిన ఈ గోల్‌మాల్‌లో రూ.700 కోట్ల వరకు నిధులు దారి మళ్లినట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం విదితమే. ఈ మొత్తం కుంభకోణంలో ఇప్పటివరకు ఏసీబీ అరెస్టు చేసిన అధికారుల విచారణతో పాటు మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు వేగవంతమైతే, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? నిబంధనలు తుంగలోతొక్కి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నదెవరనేది వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

పీఎంఎల్‌ఏ చట్టం కింద లేఖ 
గొర్రెల పంపిణీ పథకంలో కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్టుగా ఏసీబీ దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు లభించడంతో.. ఈడీ అధికారులు ఈసీఐఆర్‌ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌) నమోదు చేశారు. వెంటనే కేసు దర్యాప్తు కోసం అవసరమైన వివరాలు ఇవ్వాలంటూ తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ (టీజీఎస్‌జీడీసీఎఫ్‌ఎల్‌) ఎండీకి లేఖ రాశారు. మొత్తం తొమ్మిది అంశాలకు సంబంధించిన సమాచారం కోరారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్‌ 54 కింద లేఖ రాసిన ఈడీ హైదరాబాద్‌ జోనల్‌ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్‌ మాగిమై అరోకియారాజ్‌.. కోరిన సమాచారాన్ని అత్యవసరంగా పరిగణించి అందజేయాలని సూచించారు. ఈ కుంభకోణంపై కేసు నమోదు చేయడం, ఆ వెంటనే వివరాలు కోరుతూ సంబంధిత శాఖకు లేఖ రాయడంతో ఈ కేసులో ఈడీ దూకుడు మీద ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

లబ్ధిదారుల పేర్ల నుంచి చెక్కుల దాకా.. 
తెలంగాణలో ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది జూన్‌ 11 మధ్యకాలానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ అధికారులు కోరారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, చిరునామాలు, ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు, టీఎస్‌జీడీసీఎఫ్‌ఎల్‌ ద్వారా పంపిణీ అయిన చెక్కుల పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మొత్తం కుంభకోణంలో కీలకమైన గొర్రెల రవాణా కాంట్రాక్టుదారుల వివరాలు, వారికి జరిగిన చెల్లింపులు, గొర్రెల దాణా కొనుగోలు వివరాలు కూడా ఈడీ కోరింది. అంతర్గతంగా జరిగిన అవినీతికి సంబంధించి అదనపు వివరాలు ఏమైనా ఉంటే ఇవ్వాలని లేఖలో సూచించారు.  

ఆ ఇద్దరూ చెప్పే విషయాలే కీలకం! 
గత ప్రభుత్వ హయాంలో అమలైన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారు. గొర్రెలను విక్రయించినా తమకు డబ్బులు ఇవ్వలేదని, తమ పేరిట ఎవరో డబ్బులు తీసుకున్నారంటూ ఏపీ రైతుల ఫిర్యాదు చేయడంతో మొదటిసారిగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో కామారెడ్డి జిల్లా ఏరియా వెటర్నరీ హాస్పిటల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డా.రవి, మేడ్చల్‌ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ముంత ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్‌ వాటర్‌ ఆఫీసర్‌ పసుల రఘుపతిరెడ్డి, నల్లగొండ వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్‌ సంగు గణేష్‌లను అరెస్ట్‌ చేశారు. 

ఆ తర్వాత మార్చిలో పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ అంజిలప్ప, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి.కృష్ణయ్యలను అదుపులోకి తీసుకున్నారు. తదనంతరం ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్‌ రాంచందర్, అప్పటి పశుసంవర్ధ శాఖ మంత్రి  దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్‌కుమార్‌ల అరెస్టుతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. రాంచందర్, కల్యాణ్‌కుమార్‌లను కస్టడీకి తీసుకుని ఈ నెల 10 నుంచి 13 వరకు ఏసీబీ అధికారులు విచారించారు. దీంతో వారు ఏసీబీకి ఏం చెప్పారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  

ఇంకా ఎవరెవరున్నారనే దిశగా దర్యాప్తు 
ఈ మొత్తం కుంభకోణంలో ఈ ఇద్దరే కీలకంగా పనిచేశారా? ఇంకా ఎవరైనా వీరిద్దరికీ ఆదేశాలు ఇచ్చారా? అప్పటి మంత్రి పేషీలో ఇంకెవరెవరు ఉన్నారు? గొర్రెల కొనుగోలుకు ఎంతమంది బ్రోకర్లు పనిచేశారు? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా గొర్రెల పంపిణీ పథకం కొనుగోల్‌ మాల్‌ వ్యవహారాలకు సంబంధించి బ్రోకర్లు ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవడం, ఒక్కో యూనిట్‌కు రూ.20 వేలు చేతులు మారినట్టు, ఒకసారి కొనుగోలు చేసిన గొర్రెల యూనిట్‌నే మళ్లీ మళ్లీ కొనుగోలు చేసినట్టు చూపిస్తూ బిల్లులు పెట్టడం..గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లాల నుంచి గొర్రెల కొనుగోలు చేయడంలో జరిగిన అక్రమాలు, పశుసంవర్ధకశాఖ లోని ఉద్యోగ సంఘాల నాయకులకు ఇందులో ఉన్న పాత్ర తదితర వివరాలు బహిర్గతం కావచ్చని అంటున్నారు. పరారీలో ఉన్న కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, అతడి కుమారుడు ఇక్రమ్‌ పట్టుబడితే మరికొన్ని కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement