anti-corruption bureau
-
బిగుస్తున్న ‘గొర్రెల’ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రజాప్రతినిధులు కేంద్రంగా ఉచ్చు బిగుస్తోంది. ఒకవైపు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు కొనసాగిస్తుండగా..మరోవైపు మనీలాండరింగ్ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. కొనుగోలు చేసిన గొర్రెలనే మళ్లీ మళ్లీ కొన్నట్టు చూపడంతో పాటు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై అప్పటి మంత్రి పేషీ కేంద్రంగా జరిగిన ఈ గోల్‌మాల్‌లో రూ.700 కోట్ల వరకు నిధులు దారి మళ్లినట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం విదితమే. ఈ మొత్తం కుంభకోణంలో ఇప్పటివరకు ఏసీబీ అరెస్టు చేసిన అధికారుల విచారణతో పాటు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు వేగవంతమైతే, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? నిబంధనలు తుంగలోతొక్కి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నదెవరనేది వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పీఎంఎల్ఏ చట్టం కింద లేఖ గొర్రెల పంపిణీ పథకంలో కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్టుగా ఏసీబీ దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు లభించడంతో.. ఈడీ అధికారులు ఈసీఐఆర్ (ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేశారు. వెంటనే కేసు దర్యాప్తు కోసం అవసరమైన వివరాలు ఇవ్వాలంటూ తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ (టీజీఎస్జీడీసీఎఫ్ఎల్) ఎండీకి లేఖ రాశారు. మొత్తం తొమ్మిది అంశాలకు సంబంధించిన సమాచారం కోరారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 54 కింద లేఖ రాసిన ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ మాగిమై అరోకియారాజ్.. కోరిన సమాచారాన్ని అత్యవసరంగా పరిగణించి అందజేయాలని సూచించారు. ఈ కుంభకోణంపై కేసు నమోదు చేయడం, ఆ వెంటనే వివరాలు కోరుతూ సంబంధిత శాఖకు లేఖ రాయడంతో ఈ కేసులో ఈడీ దూకుడు మీద ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లబ్ధిదారుల పేర్ల నుంచి చెక్కుల దాకా.. తెలంగాణలో ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది జూన్ 11 మధ్యకాలానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ అధికారులు కోరారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు, టీఎస్జీడీసీఎఫ్ఎల్ ద్వారా పంపిణీ అయిన చెక్కుల పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మొత్తం కుంభకోణంలో కీలకమైన గొర్రెల రవాణా కాంట్రాక్టుదారుల వివరాలు, వారికి జరిగిన చెల్లింపులు, గొర్రెల దాణా కొనుగోలు వివరాలు కూడా ఈడీ కోరింది. అంతర్గతంగా జరిగిన అవినీతికి సంబంధించి అదనపు వివరాలు ఏమైనా ఉంటే ఇవ్వాలని లేఖలో సూచించారు. ఆ ఇద్దరూ చెప్పే విషయాలే కీలకం! గత ప్రభుత్వ హయాంలో అమలైన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారు. గొర్రెలను విక్రయించినా తమకు డబ్బులు ఇవ్వలేదని, తమ పేరిట ఎవరో డబ్బులు తీసుకున్నారంటూ ఏపీ రైతుల ఫిర్యాదు చేయడంతో మొదటిసారిగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో కామారెడ్డి జిల్లా ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డా.రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ పసుల రఘుపతిరెడ్డి, నల్లగొండ వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్‌లను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మార్చిలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ పి.కృష్ణయ్యలను అదుపులోకి తీసుకున్నారు. తదనంతరం ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్ధ శాఖ మంత్రి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్కుమార్ల అరెస్టుతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. రాంచందర్, కల్యాణ్‌కుమార్‌లను కస్టడీకి తీసుకుని ఈ నెల 10 నుంచి 13 వరకు ఏసీబీ అధికారులు విచారించారు. దీంతో వారు ఏసీబీకి ఏం చెప్పారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఎవరెవరున్నారనే దిశగా దర్యాప్తు ఈ మొత్తం కుంభకోణంలో ఈ ఇద్దరే కీలకంగా పనిచేశారా? ఇంకా ఎవరైనా వీరిద్దరికీ ఆదేశాలు ఇచ్చారా? అప్పటి మంత్రి పేషీలో ఇంకెవరెవరు ఉన్నారు? గొర్రెల కొనుగోలుకు ఎంతమంది బ్రోకర్లు పనిచేశారు? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా గొర్రెల పంపిణీ పథకం కొనుగోల్ మాల్ వ్యవహారాలకు సంబంధించి బ్రోకర్లు ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవడం, ఒక్కో యూనిట్‌కు రూ.20 వేలు చేతులు మారినట్టు, ఒకసారి కొనుగోలు చేసిన గొర్రెల యూనిట్నే మళ్లీ మళ్లీ కొనుగోలు చేసినట్టు చూపిస్తూ బిల్లులు పెట్టడం..గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లాల నుంచి గొర్రెల కొనుగోలు చేయడంలో జరిగిన అక్రమాలు, పశుసంవర్ధకశాఖ లోని ఉద్యోగ సంఘాల నాయకులకు ఇందులో ఉన్న పాత్ర తదితర వివరాలు బహిర్గతం కావచ్చని అంటున్నారు. పరారీలో ఉన్న కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, అతడి కుమారుడు ఇక్రమ్ పట్టుబడితే మరికొన్ని కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. -
విధుల్లో ఉన్నప్పుడు రూ.1000 చేతిలో ఉంచుకోవచ్చు
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు తమ చేతిలో ఉంచుకునే మొత్తాన్ని ప్రభుత్వం రూ.1000కి పెంచింది. గతంలో ఇది రూ.500గా ఉండేది. మారిన పరిస్థితుల నేపథ్యంలో సమీక్షించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది. జిల్లాలు, హెచ్వోడీలు, రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు తమ దగ్గర రూ.500, పర్యటనలో ఉన్నప్పుడు రూ.10 వేలు ఉంచుకోవచ్చని గతంలో నిబంధన ఉండేది. ఏసీబీ దీన్ని సమీక్షించి చేతిలో ఉంచుకునే మొత్తాన్ని రూ.1000కి పెంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ యాప్స్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో చేతిలో డబ్బు ఉంచుకోవాల్సిన అవసరం పెద్దగా ఉండదని తెలిపింది. అయినా ఆ మొత్తాన్ని కొద్దిగా పెంచి రూ.1000కి పరిమితం చేయాలని సూచించింది. దీనికి సాధారణ పరిపాలన శాఖ ఆమోదం తెలిపి జీవో ఇచ్చింది. చదవండి: (Ashwini Vaishnaw: ఈ గ్రామాల్లో 4జినే లేదు!) -
ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టిన అంజనీ కుమార్
-
పాడేరు ఐటీడీఏ ఈఈపై ఏసీబీ దాడులు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : గిరిజన సంక్షేమ శాఖ అధికారిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) శనివారం దాడులు నిర్వహించింది. పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) కాట్రెడ్డి వెంకటసత్యనగేష్కుమార్పై అక్రమాస్తులపై ఫిర్యాదు రావడంతో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలపై ఏసీబీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖతో పాటు మూడు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగాయి. విశాఖ, అనకాపల్లిలోని నగేష్‌కుమార్ ఇళ్లు, పాడేరులోని కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నగేష్‌కుమార్, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో రెండు ఫ్లాట్లు, 9 ఇళ్ల స్థలాలు, 6.50 ఎకరాల సాగు భూమి, రెండు కార్లు, నగదు, బంగారు, వెండి వస్తువులను గుర్తించారు. వాటి విలువ రూ.2,06,17,622 ఉంటుందని అంచనా వేశారు. మొత్తంగా ప్రాథమిక దర్యాప్తులో ఆదాయానికి మించి రూ.1,34,78,180 ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించారు. బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉంది. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ ప్రధాన కార్యాలయం పేర్కొంది. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల అరెస్ట్
సాక్షి, గుంటూరు/ఒంగోలు/సాక్షి, అమరావతి/చేబ్రోలు/విజయవాడ లీగల్: టీడీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పొన్నూరు మండలం చింతలపూడిలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఉన్న సంగం డెయిరీ చైర్మన్‌గా ధూళిపాళ్ల నరేంద్ర కొనసాగుతున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో సంగం సొసైటీలో భారీ మొత్తం రుణం తీసుకోవడంతోపాటు డెయిరీలో పలు అక్రమాలు, అవినీతికి సంబంధించిన ఫిర్యాదులపై ఆయనను ఏసీబీ అరెస్టు చేసింది. ఆయనపై అవినీతి నిరోధక చట్టం–1988లోని 13(1)(సీ)(డీ), ఐపీసీ సెక్షన్లు 408, 409, 418, 420, 465, 471, 120బి రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. సంగం డెయిరీ ఎండీ కూడా అరెస్ట్ కాగా, సంగం డెయిరీలో ఎండీ గోపాలకృష్ణను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం డెయిరీ పరిపాలన కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే డెయిరీ ఉద్యోగులు సోదాలకు సహకరించలేదు. కొన్ని గదుల తాళాలు తీయకపోవడం, సంబంధిత ఉద్యోగులు అందుబాటులో లేకుండా పోవడం, ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం చేసినట్టు సమాచారం. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు డెయిరీలోనే ఏసీబీ అధికారులు వేచి ఉన్నారు. అందుబాటులో ఉన్నవాటిని పరిశీలించి, పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సహకార శాఖ మాజీ రిజిస్ట్రార్ కూడా.. కాగా, ప్రకాశం జిల్లా సహకార శాఖలో రిజిస్ట్రార్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన మేళం గురునాథంను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. శుక్రవారం ఉదయం ఒంగోలు ఎన్జీవో కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ధూళిపాళ్ల నరేంద్రకు సంబంధించిన కేసులోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా సహకార శాఖ రిజిస్ట్రార్‌గా పనిచేసిన కాలంలో సొసైటీ చట్టాన్ని దుర్వినియోగపరిచారనే అభియోగంపై ఏసీబీ ఆయనను అరెస్టు చేసింది. ఈ కేసులో నరేంద్రను ఏ1గా, డెయిరీ ఎండీ పి.గోపాలకృష్ణను ఏ2గా, గురునాథంను ఏ3గా ఏసీబీ చేర్చింది. వీరిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా కోర్టు పూర్తి అదనపు ఇన్చార్జి న్యాయమూర్తి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులను కోవిడ్ పరీక్షల నిమిత్తం విజయవాడలోని ఈఎస్ఐ కోవిడ్ సెంటర్‌కు తీసుకెళ్లగా గురునాథంకు పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఆయనను క్వారంటైన్‌కు తరలించారు. ప్రాథమిక ఆధారాలతోనే అరెస్టు చేశాం: ఏసీబీ కాగా, ధూళిపాళ్ల నరేంద్రను ప్రాథమిక ఆధారాలతోనే అరెస్టు చేశామని ఏసీబీ పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదే విషయాన్ని కోర్టుకు సమర్పించిన రిపోర్టులోనూ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీడీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ బాబు.ఎ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధూళిపాళ్లను అరెస్టు చేసినట్టు తెలిపింది. ధూళిపాళ్లతోపాటు సంగం డెయిరీ ఎండీ పి.గోపాలకృష్ణ, రిటైర్డ్ జిల్లా కో ఆపరేటివ్ అధికారి ఎం.గురునాథం, గతంలో ఎండీగా పనిచేసిన కె.గోపీనాథ్, సంగం డెయిరీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పి.సాంబశివరావు సహా మరికొందరిపై కేసు నమోదు చేశామని వివరించింది. అక్రమాలకు, అవకతవకలకు అడ్డాగా మార్చేశారు.. గుంటూరు డిస్ట్రిక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఎయిడెడ్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ (జీడీఎంపీసీయూఎల్), గుంటూరు డిస్ట్రిక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ యూనియన్(జీడీఎంపీఎంఎసీయూఎల్), సంగం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌ఎంపీసీఎల్)గా రూపాంతరం చెందుతూ వచ్చిన సంగం డెయిరీని అక్రమాలు, అవకతవకలకు నిలయంగా మార్చేశారని ఏసీబీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన చట్టాలను, నిబంధనలను ఇష్టానుసారం ఉల్లంఘించారని తెలిపింది. సంగం డెయిరీకి కేటాయించిన భూములను నిబంధనలకు విరుద్ధంగా బదలాయించారంది. 1992, ఫిబ్రవరి 8న ధూళిపాళ్ల నరేంద్రకుమార్ జీడీఎంపీసీయూఎల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1994 మార్చిలో ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు మేనేజింగ్ ట్రస్టీగా ఉండేందుకు తీర్మానం చేయించుకుని అక్రమాలకు తెరలేపారని ఏసీబీ పేర్కొంది. ఆ తర్వాత సంగం డెయిరీకి చెందిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా ట్రస్ట్‌కు బదలాయించారు. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఆ భూములను బదలాయించినట్టు ఆధారాలు ఉన్నాయని ఏసీబీ పేర్కొంది. పలు సంస్థలు ఏర్పాటు చేసి సంగం డెయిరీ ఆదాయాన్ని, ఆస్తులను అడ్డగోలుగా మళ్లించారని వివరించింది. -
సచివాలయ అధికారుల పాత్ర
సాక్షి, అమరావతి: నకిలీ చెక్కులతో ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎం ఆర్ఎఫ్) నుంచి రూ.117.15 కోట్లు కాజేసే కుట్ర వెనుక రాష్ట్ర సచివాలయంలోని కొందరు అధికారుల పాత్ర ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఆ అధికారుల సహకారంతోనే నకిలీ ఎస్బీఐ చెక్కులతో స్వాహా చేసేందుకు పథకం వేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్ర ఉండటంతో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)తోనే ఈ కేసు దర్యాప్తు చేయించాలని తాజాగా నిర్ణయించారు. కేసు దర్యాప్తులో సీఐడీ విభాగం ఏసీబీకి సహకరించనుంది. ► ఈ కేసు విచారణ చేపట్టాల్సిందిగా ఏసీబీని కోరుతూ రెవెన్యూ శాఖ ఇటీవల లేఖ రాసింది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ కేంద్రంగా సీఎంఆర్ఎఫ్ నిధులు కొల్లగొట్టడానికి ప్రయత్నించినట్లు వెలుగులోకి రావడంతో ఆయా రాష్ట్రాల్లో దర్యాప్తు చేసేందుకు సీఐడీ విభాగానికి అప్పగించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సీఐడీకి బదిలీ చేశారు. ఈ క్రమంలో సీఐడీ విభాగం మూడు బృందాలను మంగుళూరు, కోల్‌కతా, ఢిల్లీకి కూడా పంపింది. ఏసీబీకి కేసు ఫైల్.. ► అయితే సచివాలయంలోని కొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించడంతో ఈ కేసు ఏసీబీతో దర్యాప్తు చేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ మేరకు ఏసీబీకి ఫైల్ పంపించారు. ► ఇతర రాష్ట్రాల్లో దర్యాప్తు జరపటంలో ఏసీబీకి సీఐడీ విభాగం సహకారం అందించనుంది. ఈ రెండు విభాగాలు సమన్వయంతో కేసును దర్యాప్తు చేయనున్నాయి. ► ఈ ఘరానా మోసంలో సూత్రధారులుగా భావిస్తున్న సచివాలయంలోని కొందరు అధికారుల పాత్రను వెలుగులోకి తెస్తామని ఏసీబీ వర్గాలు తెలిపాయి. -
తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించింది. సంతకవిటి (శ్రీకాకుళం జిల్లా), బలిజిపేట (విజయనగరం జిల్లా), కశింకోట (విశాఖ జిల్లా), కొయ్యలగూడెం (పశ్చిమగోదావరి జిల్లా), ఇబ్రహీంపట్నం(కృష్ణా జిల్లా), రాజుపాలెం (గుంటూరు జిల్లా), ఉలవపాడు (ప్రకాశం జిల్లా), ఎమ్మిగనూరు (కర్నూలు జిల్లా), కూడేరు (అనంతపురం జిల్లా) తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది లెక్కల్లో చూపించని నగదును స్వాధీనం చేసుకున్నారు. ► రైతులకు పంపిణీ చేయకుండా ఉన్న పట్టాదార్ పాస్‌పుస్తకాలను గుర్తించారు. ‘స్పందన’, ‘మీ సేవ’ పోర్టళ్లలో చేసిన దరఖాస్తులను నిర్ణీత గడువు ముగిసినప్పటికీ పరిష్కరించ లేదని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. కొన్ని కార్యాలయాల్లో ప్రైవేట్ సిబ్బంది పని చేస్తున్నారని గుర్తించారు. ► తహసీల్దార్ కార్యాలయాలపై జరిపిన సోదాల్లో మొత్తం మీద లెక్కల్లో చూపించని రూ.3,50,277 నగదును స్వాధీనం చేసుకున్నారు. ► బిక్కవోలు (తూర్పు గోదావరి జిల్లా), జగ్గయ్యపేట (కృష్ణా జిల్లా), బద్వేలు (వైఎస్సార్ జిల్లా), పీలేరు (చిత్తూరు జిల్లా) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ► సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అనధికార వ్యక్తులు పని చేస్తున్నట్టు గుర్తించారు. మొత్తం మీద లెక్కల్లో చూపించని రూ.9,23,940 స్వాధీనం చేసుకున్నారు. ► నెల్లూరు జిల్లా గూడురు మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం ఆఫీసు సమయం ముగిసిన తర్వాత కూడా నిబంధనలకు విరుద్ధంగా 33 భవన నిర్మాణ అనుమతులు ఇచ్చినట్టు గుర్తించారు. ఈ సోదాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని ఏసీబీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. -
మాజీమంత్రి పితాని పాత్రపైనా ఆరా
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన ఈఎస్ఐ భారీ స్కామ్‌లో అప్పటి కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పాత్ర ఎంత అనే దానిపైనా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆరా తీస్తోంది. కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు తర్వాత పితాని ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ పాలనలో ఈఎస్ఐలో 988.77కోట్ల నిధులు ఖర్చుపెట్టారు. వీటిలో టెలీ హెల్త్ సర్వీసెస్, మందులు, ఫర్నీచర్, వైద్య సామాగ్రి కొనుగోళ్లతోపాటు అనేక లావాదేవీలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. వీటిలో రూ.150 కోట్లకు పైగా అవినీతి, అక్రమాలు జరిగాయని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిగ్గు తేల్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ ఈ కుంభకోణంలో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించి.. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసింది. పితాని హయాంలోనూ అవే అక్రమాలు ► పితాని మంత్రిగా వ్యవహరించిన కాలంలోనూ అవే అక్రమాలు, అవకతవకలు కొనసాగినట్టు ఏసీబీ గుర్తించింది. ► పితానికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన మురళీమోహన్, పితాని కుమారుడు వెంకట సురేష్లను నిందితులుగా చేర్చింది. ► హైదరాబాద్‌కు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకోవాలని ఈఎస్ఐ అధికారులకు తాను లేఖ ఇచ్చిన మాట వాస్తవమే అయినా తన హయాంలో లావాదేవీలు జరగలేదని, ఆ తర్వాతే జరిగాయని ఏసీబీ విచారణలో స్పష్టం చేసిన అచ్చెన్నాయుడు తన తర్వాత పితాని ప్రమేయాన్ని చెప్పకనే చెప్పినట్టయ్యింది. ► తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ కాంట్రాక్టర్లతో లావాదేవీలు జరిపారని, బిల్లులు చెల్లింపులు వంటి అంశాలపై సురేష్ నేరుగా అధికారులకు ఫోన్లు చేసి మాట్లాడేవారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ► ఇందుకు సంబంధించి పితాని కుమారుడి ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషిస్తున్నట్టు సమాచారం. ► పితాని వ్యక్తిగత కార్యదర్శిని ఇప్పటికే అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. ► పితాని కుమారుడు, అతడి మాజీ పీఎస్ ముందస్తు బెయిల్‌కు ప్రయత్నించగా.. హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో పితాని కుమారుడిని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ బృందాలు పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముచిక్కాల, భీమవరం, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో గాలింపు ముమ్మరం చేశాయి. అచ్చెన్న బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా పడింది. మంగళవారం అచ్చెన్నాయుడు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ.. ఏసీబీ అధికారులు చట్టం నిర్దేశించిన విధి విధానాలను పాటించకుండానే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారని చెప్పారు. ఇలాంటప్పుడు బెయిల్ మంజూరు చేయవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందన్నారు. ఆ తీర్పు కాపీలు న్యాయమూర్తి ముందు లేకపోవడంతో విచారణ గురువారానికి వాయిదా వేస్తూ జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్
అబ్దుల్లాపూర్‌మెట్ (పెద్దఅంబర్‌పేట): మరో మూడు నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన తరుణంలో ఓ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపల్ కమిషనర్ రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఓ ఇంటి నిర్మాణం విషయంలో ప్రవాస భారతీయుడిని కమిషనర్, టౌన్‌ప్లానింగ్ అధికారి కలసి రూ.2.5 లక్షలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కమిషనర్ రూ.1.5 లక్షలు తీసుకోగా.. తన వాటాను మధ్యవర్తికి ఇవ్వాలని చెప్పి టీపీఓ లిప్తపాటు కాలంలో తప్పించుకున్నాడు. కుంట్లూర్ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు సురభి వెంకట్‌రెడ్డికి తన తండ్రి నుంచి సంక్రమించిన 300 గజాల స్థలంలోని పాత ఇంటిని తొలగించి దాని స్థానంలో కొత్త ఇల్లు నిర్మాణం చేస్తుండగా మున్సిపల్ కమిషనర్ రవీందర్రావు, టీపీఓ రమేశ్ పనులు నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు. కుంట్లూర్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి తమకు ఫిర్యాదు చేశారంటూ పలుమార్లు నోటీసులు పంపించి సిబ్బందితో పనులు అడ్డుకున్నారు. దీంతో బాధితుడు కమిషనర్ రవీందర్రావు, టీపీఓ రమేశ్‌ను సంప్రదించగా రూ.2.5 లక్షలు (కమిషనర్‌కు రూ.1.5 లక్షలు, టీపీఓకు రూ.లక్ష) ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వెంకట్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం పెద్దఅంబర్‌పేట కార్యాలయంలోనే వెంకట్‌రెడ్డి నుంచి కమిషనర్ రవీందర్రావు రూ.1.5 లక్షల లంచం తీసుకుంటుండగా అప్పటికే మాటేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. టీపీఓ తన వాటాను మధ్యవర్తి అయిన లైసెన్స్డ్ ప్లానర్ ఆదినారాయణ రూ.లక్ష తీసుకుంటుగా అతడిని కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కమిషనర్ రవీందర్రావుతోపాటు ఆదినారాయణపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. -
సిద్దిపేట అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి అరెస్ట్
సాక్షి, సిద్ధిపేట : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సిద్దిపేట అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గోవిందు నర్సింహారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయనను ఏసీబీ అధికారులు గురువారం కోర్టులో హాజరు పరచగా, ఏసీబీ న్యాయస్థానం 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నర్సింహారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా అక్రమ ఆస్తుల ఆరోపణలతో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి నివాసంతో పాటు ఆయన బినామీల ఇళ్లపై గత రెండు రోజులుగా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి, సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సిద్ధిపేట, హైదరాబాద్, మహబూబ్ నగర్, జహీరాబాద్, షాద్‌నగర్‌తో పాటు ఆయన స్వగ్రామం వనపర్తి జిల్లా అయ్యవారిపల్లిలోనూ దాడులు చేశారు. సోదాల్లో కిలోన్నర బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల 33వేలు నగదు, నర్సింహారెడ్డి బ్యాంక్ బ్యాలెన్స్ రూ.6.37 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. గొల్కొండలో ఒక విల్లా, శంకర్‌పల్లిలో 14 ఫ్లాట్లు, జహీరాబాద్, సిద్ధిపేట, మహబూబ్ నగర్లో 20 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. రెండు కార్లు సీజ్ చేశారు. ఏసీబీ అధికారుల సోదాల్లో రూ.5 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. -
‘అరవింద సమేత..’ దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఐఎంఎస్(ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్)లో రోజుకో సంచలనం వెలుగుచూస్తోంది. మాజీ డైరెక్టర్, మాజీ జాయింట్ డైరెక్టర్ పద్మ అక్రమాలు తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్నాయి. ఈఎస్‌ఐల మందుల కొనుగోళ్లలో ఇష్టానుసారంగా వ్యవహరించిన మాజీ జేడీ పద్మ మందుల కొనుగోళ్లు అధికరేట్లు, తప్పుడు ఇండెంట్లలో చేతివాటం చూపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈమెకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) దర్యాప్తులో బయటపడింది. అదనంగా వచ్చిన ఆర్డర్ల తాలూకు మందులను రహస్యంగా బయటకి పంపి, వాటినీ సొమ్ము చేసుకున్న విషయం ఏసీబీ గుర్తించింది. ఈ కుట్రలో ఆమెకు సహకరించిన ముగ్గురు సోమవారం అరెస్టయ్యారు. ఎలా చేసింది..? నిబంధనలకు విరుద్ధంగా, అవసరానికి మించి మందులు ప్రొక్యూర్ చేసిన పద్మ వాటిని అంతటితో ఆగలేదు. వాటిని వైద్యశిబిరాల పేరుతో రహస్యంగా బయటకి తరలించేది. తనకు పరిచయమున్న డాక్టర్ చెరకు అరవింద్‌రెడ్డి అనే వ్యక్తి ఈ వ్యవహారాన్ని ఎవరి కంటబడకుండా నడిపేవాడు. ఇతనికి వెంకటేశ్వర హెల్త్ సెంటర్ అనే మందుల కంపెనీ ఉంది. ఇతనికి బాలానగర్, సుచిత్రలలో మందుల గోదాములు ఉన్నాయి. వీటిలో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు ఈఎస్ఐ నుంచి వచ్చిన మందులు, కిట్లు కుప్పలుగా బయటపడ్డాయి. వీటిని సీజ్ చేశారు. అసలు ఆ గోదాముల నడుస్తున్నదే ఈఎస్ఐ నుంచి వచ్చిన మందుల కోసమని తెలుసుకుని ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. వీటిని ఇతర హాస్పిటల్స్, మార్కెట్లలో విక్రయించగా వచ్చిన సొమ్మును పంచుకునేవారు. ఈ మందులను తెలంగాణలోనే కాదు, ఏపీకి కూడా విక్రయించినట్లు అధికారులు తేల్చారు. మొత్తం వ్యవహారంలో అతనికి కె.రామిరెడ్డి, లిఖిత్‌రెడ్డిలు సహకరించేవారు. ఈముగ్గురిని సోమవారం ఏసీబీ పోలీసులు అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. అసలు వెంకటేశ్వర హెల్త్ కేర్ కంపెనీ అరవింద్ ఎప్పుడు ప్రారంభించాడు? దీని వెనక పద్మ హస్తం ఏమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. శశాంక్ గోయల్ పాత్రపైనా విచారించాల్సిందే.. ఐఎంఎస్ కుంభకోణంలో కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్ పాత్రపైనా విచారణ జరపాలని సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ 2018, 2019లో రెండుసార్లు విజిలెన్స్ విచారణ జరిపి నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు చేపట్టలేదో తెలపాలన్నారు. ఆ రెండు నివేదికలను తొక్కిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మాజీ డైరెక్టర్ దేవికారాణి విషయంలో ఆయన ఉదాసీనంగా వ్యవహరిస్తూ కేవలం లేఖలతో సరిపెట్టారని మండిపడ్డారు. కానీ, మాజీ జేడీ పద్మ విషయంలో మాత్రం అక్రమాలు జరిగాయంటూ ఏసీబీకి లేఖ రాయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. -
ఇరిగేషన్ అధికారిపై ఏసీబీ దాడులు.. భారీగా ఆస్తులు!
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నీటిపారుదలశాఖలో ఏఈఈగా పనిచేస్తున్న పల్లా సుబ్బయ్య ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. సుమారు రూ. రెండుకోట్ల విలువైన స్థలాల పత్రాలను, 560 గ్రాముల బంగారాన్ని, రూ. లక్ష నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంతో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మైలవరం ఇరిగేషన్ కార్యాయలంలో ఏఈఈగా పల్లా సుబ్బయ్య విధులు నిర్వర్తిస్తున్నారు. -
ముగ్గురు చిరుద్యోగులు.. ఆస్తులు రూ. 100 కోట్లు
-
ముగ్గురు చిరుద్యోగులు.. ఆస్తులు రూ. 100 కోట్లు
సాక్షి, అమరావతి/విశాఖ క్రైం : విశాఖ కేంద్రంగా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై శనివారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పంజా విసిరింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇద్దరు వీఆర్వోలు, ఒక జీవీఎంసీ జోన్–3 చైన్మెన్ల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిపారు. చిన్న అధికారులే అయినా వారి ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులు కంగుతిన్నారు. ఆస్తుల విలువను రికార్డుల ప్రకారం వెల్లించిన ఏసీబీ అధికారులు బహిరంగ మార్కెట్లో వాటి విలువ భారీగా ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. ఆ ముగ్గురిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం కోర్టుకు హాజరుపరచనున్నట్టు తెలిపారు. వీఆర్వో సంజీవ్‌కుమార్ ‘భూమ్ ఫట్’.. ప్రభుత్వ సర్వీసులో 2008 మే 30న చేరిన కాండ్రేగుల సంజీవ్‌కుమార్ ప్రస్తుతం విశాఖ నగర పరిధిలోని మల్కాపురం సబ్‌డివిజన్ ములగాడ వీఆర్వోగా పనిచేస్తున్నాడు. అయన ఏకంగా తహసీల్దార్ పేరిట ఓ కారు వినియోగిస్తూ రూ. కోట్ల ఆస్తులు సంపాదించాడు. అనకాపల్లిలోని అతని ఇంట్లో డమ్మీ పిస్టల్ ఒకటి స్వాధీనం చేసుకున్నారు. కాగా,అతని మొత్తం ఆస్తుల విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.3 కోట్ల 77లక్షల 12 వేలుగా లెక్కించగా, బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.70 కోట్లకు పైమాటేనని అంచనా. నాలుగు చోట్ల సోదాలు: ప్రభుత్వ సర్వీసులో 2008 మే 30న చేరిన పోలిశెట్టి వెంకటేశ్వరరావు ప్రస్తుతం విశాఖ అర్బన్ మండలంలోని మద్దిలపాలెం వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఆయన ఇంటితోపాటు మరో నాలుగు ప్రాంతాల్లోని కుటుంబ సభ్యులకు చెందిన ఇళ్లపైనా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రికార్డుల ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.కోటి 11 లక్షల 25వేల ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ రూ. 15 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. చైన్మన్ నాగేశ్వరరావు ఆస్తులపై దాడులు.. ప్రస్తుతం జీవీఎంసీ(విశాఖ) జోన్–3 చైన్మన్గా పనిచేస్తున్న మునికోటి నాగేశ్వరరావు 1997లో సర్వీసులో చేరారు. ఆయన ఆస్తుల విలువ రికార్డుల ప్రకారం రూ.కోటి 31లక్ష 66వేలు ఉంటుందని ఏసీబీ అధికారులు చెప్పారు. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ రూ. 15 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా -
ముడుపులకు మూల్యం
ముడుపులకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రతి బిల్లుకు డబ్బులు వసూలు చేస్తున్నందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. పర్సెంటేజీల పేరిట వేధింపులకు తగిన శాస్తి జరిగింది. ప్రజోపయోగానికి రోడ్డు నిర్మించేందుకు లంచాలు చెల్లించాలి. ఆ పని దక్కించుకోవడానికి పర్సంటేజీలు ఇవ్వాలి. ఇక పని పూర్తి చేశాక ఆ కాంట్రాక్టర్‌కు దక్కిందేమిటి. కడుపు మండిన ఓ కాంట్రాక్టర్ వేధిస్తున్న ఇంజినీరింగ్ అధికారిని అవినీతి నిరోధక శాఖకు పట్టించారు. ఏసీబీకి చిక్కిన ఇంజినీరింగ్ అధికారి ఎంబుక్‌లో నమోదు చేసేందుకు రూ. 20వేలు డిమాండ్ కడుపుమండి ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్ సాక్షి ప్రతినిధి, విజయనగరం :పర్సంటేజీలు, ముడుపులు ఇచ్చుకోలేక చిన్నపాటి కాంట్రాక్టర్లు చితికిపోతున్నారు. సహనం ఉన్న వాళ్లు భరిస్తున్నారు. తట్టుకోలేని వాళ్లు అవినీతికి పాల్పడుతున్న వారికి తిరిగి బుద్ధి చెబుతున్నారు. ఇప్పుడా విధంగానే సాలూరు మండల ఇంజినీరింగ్ అధికారి రాంగోపాల్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. ఎంబుక్‌లో రికార్డు చేసేందుకు చిన్నపాటి కాంట్రాక్టర్ నుంచి రూ. 20వేలు లంచం తీసుకుని విజయనగరం కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద పబ్లిక్‌గా దొరికిపోయారు. పని చేతికొచ్చిన దగ్గరి నుంచే ముడుపులే పనులు మంజూరైన దగ్గరి నుంచి చేపట్టిన వరకు అడ్డుగోలు కార్యక్రమమే. నామినేటేడ్ పద్ధతిలో మంజూరైన పనులను సంబంధిత సర్పంచ్‌లు, నీటి సంఘాల అధ్యక్షులు చేపట్టాల్సి ఉంది. కొందరు అధికార పార్టీ నేతలు కష్టపడకుండానే సొమ్ము చేసుకోవాలన్న అత్యాశతో మంజూరైన పనులను పర్సంటేజీకి చిన్నపాటి కాంట్రాక్టర్లకు అమ్మేస్తున్నారు. నాలుగు డబ్బులొస్తాయని ఆశపడి కాంట్రాక్టర్లు ఏదో ఒక రకంగా పని కానిచ్చేస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులకు మామూళ్లు ఇక సర్పంచ్‌లనుంచి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లను ఇంజినీరింగ్ అధికారులు వదలడంలేదు. తమకు రావల్సినవి ఇచ్చేయాల్సేందంటూ పర్సంటేజీలు తీసుకుంటున్నారు. కొందరు పని విలువలో 10నుంచి 12శాతం తీసుకుంటుండగా, మరికొందరు 15శాతం వరకు గుంజేస్తున్నారు. ఇరిగేషన్ పనుల్లోనైతే 20శాతం వరకు లాగేస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులు వాటితో సంతృప్తి చెందడం లేదు. ఎంబుక్‌లో రికార్డు చేసిన ప్రతీసారి పిండేస్తున్నారు. అప్పుడు కూడా తమను సంతృప్తి పరచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడా రకంగా ఇవ్వలేకే సాలూరు మండలం పురోహితునివలసకు చెందిన కాంట్రాక్టర్ బి.సూర్యనారాయణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వ్యూహాత్మకంగా ఎంబుక్ రికార్డు చేసేందుకు డబ్బులు అడిగిన మండల ఇంజినీరింగ్ అధికారి రాంగోపాల్‌రెడ్డిని బుక్ చేయించారు. పట్టు బడేంతవరకు తొందరే బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ రాంగోపాల్‌రెడ్డి వ్యవహారం చూస్తే లంచం సొమ్ము కోసం తానెంత ఆత్రుత పడ్డాడన్నది స్పష్టమవుతుంది. రూ. 5లక్షల విలువైన సీసీ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే రూ. 3.50లక్షల బిల్లు చేసేశారు. మిగతా రూ. లక్షా 50వేలు బిల్లు కోసం రూ. 20వేలు డిమాండ్ చేశారు. లంచమిస్తేనే ఎంబుక్ రికార్డు చేస్తానని మొండికేయడంతో కాంట్రాక్టర్ సూర్యనారాయణ మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి ప్రణాళిక ప్రకారం అడిగినంత ఇస్తామంటూ ఇంజినీరింగ్ అధికారికి చెప్పించారు. బుధవారం తెల్లవారు జామునుంచి లంచం సొమ్ము కోసం ఇంజినీరింగ్ అధికారి తెగ ఆరాట పడ్డారు. ఉదయం 7.30గంటలకు కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి సాలూరు రావడం లేదని... కలెక్టరేట్లో సమావేశం ఉందని... ఇక్కడికొచ్చి ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మళ్లీ 9గంటలకు ఫోన్ చేసి వస్తున్నావా...అని అడిగారు. 9.30గంటలకు మరోసారి ఎక్కడున్నావని అడిగారు. 10గంటలకు ఫోన్ చేసి కలెక్టరేట్ వద్దకు వచ్చేశానని, తెలిపారు. ఇదిగో వచ్చేస్తున్నానంటూ కాంట్రాక్టర్ సూర్యనారాయణ ఏసీబీ అధికారులను వెంటబెట్టుకుని కలెక్టరేట్ ప్రధాన గేటు వద్దకు వచ్చారు. ఆ పక్కనే చెట్లు కింద ఉన్న ఇంజినీరింగ్ అధికారిని కలిశారు. లంచం సొమ్మును ఇచ్చేందుకు ప్రయత్నించగా తన బ్యాగ్‌లో పెట్టాలని ఇంజనీరింగ్ అధికారి కోరారు. కానీ, కాంట్రాక్టర్ బ్యాగ్‌లో పెట్టకుండా నేరుగా చేతికిచ్చాడు. అదే అదనుగా మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు పబ్లిక్‌గా పట్టుకున్నారు. వెంటనే కారులోకి ఎక్కించి, విచారించారు. మీడియా కంట పడకుండా గంటన్నరకు పైగా కారులోనే ఇంజనీరింగ్ అధికారి ఉండిపోయారు. కొసమెరుపు ఏంటంటే ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఇంజినీరింగ్ అధికారికి మరో రెండేళ్లే సర్వీసు ఉంది. దాడుల్లో విజయనగరం ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి, సీఐలు రమేష్, లక్మోజులు పాల్గొన్నారు. -
ఏసీబీ ఏర్పాటు ఎందుకంటే...
సోనియా, రాహుల్‌కు లేఖ రాసిన సీఎం సిద్ధరామయ్య బెంగళూరు: రాష్ట్రంలో అవినీతి నిరోధక దళం(యాంటీ కరప్షన్ బ్యూరో-ఏసీబీ) ఏర్పాటు పై విపక్షాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏసీబీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందనే అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ హైకమాండ్‌కు వివరణ ఇచ్చుకున్నారు. రాష్ట్రంలో ఏసీబీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఇతర రాష్ట్రాల్లో ఏసీబీ పనితీరు తదితర అంశాలను వివరిస్తూ ఏఐసీసీ అధ్యక్షరాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలతో పాటు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, కర్ణాటక కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్‌లకు లేఖ రాశారు. ఈ లేఖలో ‘ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఏసీబీ విధులు నిర్వర్తిస్తోంది. అందులో భాగంగానే కర్ణాటకలో సైతం ఏసీబీని ఏర్పాటు చేశాం. ఇక అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ అవినీతిపై తన పోరాటాన్ని కొనసాగిస్తుందనే సందేశాన్ని ప్రజలకు అందించడానికే ఏసీబీని ఏర్పాటు చేశాము’ అని తన లేఖలో వివరించారు. ఈ లేఖతో పాటు ఏసీబీ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సైతం సీఎం సిద్ధరామయ్య జత చేసినట్లు సమాచారం. కాగా, లోకాయుక్తను బలహీనపరచడంలో భాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏసీబీని రద్దు చేయాల్సిందిగా సీఎం సిద్దరామయ్యకు సూచించండంటూ జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి సైతం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు లేఖలు రాశారు. -
రాష్ర్టంలో ఏసీబీ ఏర్పాటు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకేనని సీఎం సిద్ధరామయ్య వెల్లడి బెంగళూరు: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే రాష్ట్రంలో యాంటీ కరప్షన్ బ్యూరో(ఏసీబీ)ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం సిద్దరామయ్య వెల్లడించారు. ఏసీబీని ఏర్పాటు చేయడం వెనక లోకాయుక్త సంస్థను నీరుగార్చే ఉద్దేశమేదీ తమ ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. లోకాయుక్త సంస్థ పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, ఏసీబీ ఏర్పాటు తర్వాత కూడా లోకాయుక్త ఎప్పటిలాగే తన విధులను నిర్వర్తించనుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోకాయుక్త విధులకు అడ్డుతగిలేలా నడుచుకోబోమని తెలిపారు. అవినీతి ఆరోపణలకు సంబంధించిన విచారణల సమయంలో కొన్ని గందరగోళ పరిస్థితులు చోటు చేసుకుంటుండడంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే రాష్ట్రంలో ఏసీబీని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. మైసూరులో హత్యకు గురైన బీజేపీ కార్యకర్త రాజు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5లక్షల పరిహారాన్ని అందించనుందని చెప్పారు. మైసూరు శాం తి, సౌభ్రాతృత్వాలకు నిలయమైన నగరమని, అలాంటి చోట ఇ లాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రస్తుతానికి మైసూరు నగరంలో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయ న్నారు. -
ముప్పేటదాడి
సాంబశివరావు ఇళ్లలో ఏసీబీ సోదాలు ఏకకాలంలో ఐదు చోట్ల తనిఖీలు రూ.1.30 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు భవనాలు, బంగారం స్వాధీనం వరంగల్ క్రైం/ఎంజీఎం : అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పంజా విసిరారు. డీఎంహెచ్‌వో, రాష్ట్ర సంచాలకుడిగా విధులు నిర్వహించి ఇటీవల అవినీతి ఆరోపణలతో సస్పెండైన పిల్లి సాంబశివరావు స్వగృహంలో గురువారం సోదాలు చేశారు. ఈ విషయూలను ఏసీబీ కార్యాలయంలో వరంగల్ ఏసీబీ డీఎస్పీ సారుుబాబా వెల్లడించారు. ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు బృందాలుగా విడిపోరుు ఏకకాలంలో సాంబశివరావు బంధువులు, బినామీలుగా భావిస్తున్న వారి ఇళ్లపై ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు సోదాలు చేశారు. హన్మకొండలోని సర్క్యూట్ హౌస్‌లో గల ఆయన స్వగృహంతోపాటు అశోక్‌నగర్‌లో నివాసముంటున్న ఆయన సోదరుడు సారంగం ఇంటిపై, ఆరెపల్లిలోని కార్తికేయన్ ఎడ్యుకేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో, హైదరాబాద్ ఉప్పల్‌లోని ఫ్లాట్‌లో, సాంబశివరావుకు అత్యంత సన్నిహితుడైన జైహింద్ సెక్యూరిటీ ఏజెన్సీస్‌కు చెందిన జయేందర్‌రెడ్డి స్వగృహం, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని మామ బబ్బెట ఉపేందర్ ఇళ్లలో మూకుమ్మడి దాడులు నిర్వహించారు. అక్రమ ఆస్తుల చిట్టా.. పిల్లి సాంబశివరావుకు హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్‌హౌస్ సమీపంలో ఇల్లు, జేపీఎన్ రోడ్డులో రెండు కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఆరెపల్లిలో కార్తికేయన్ ఎడ్యుకేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా రూ.24 లక్షల విలువ చేసే 85 తులాల బంగారం, ఐదు కిలోల వెండి, పైడిపల్లి, జఫర్గఢ్లలో 4 ఎకరాల 30 గుంటల వ్యవసాయ భూమికి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తులు 1990 నుంచి 2000 సంవత్సరం మధ్యలో కొనుగోలు చేసినట్లు పత్రాల ద్వారా వెల్లడవుతుంది. కాగా, అప్పటి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రూ.1.30 కోట్లుగా నిర్ధారించారు. ప్రస్తుతం వీటి మార్కెట్ విలువ కోట్లాది రూపాయాలు ఉంటుంది. అక్రమ ఆస్తులు కలిగి ఉన్న సాంబశివరావును గురువారం సాయంత్రం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చి చర్లపల్లి జైలుకు తరలించారు. బినామీలపై ఏసీబీ నజర్ ఏసీబీ అధికారులు సాంబశివరావుకు సంబంధించిన బినామీలపై దృష్టి సారించారు. అత్యంత సన్నిహితుడిగా ఉంటున్న జయేందర్‌రెడ్డి ఇంటిపై దాడి చేసి కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు బినామీలు ఉన్నట్లు గుర్తించారు. అయితే వారి ఆస్తులపై ప్రత్యేకంగా నిఘా వేసి దాడులు చేసే అవకాశం ఉంది. ఈ దాడుల్లో వరంగల్ డీఎస్పీ సాయిబాబా, కరీంనగర్, ఆదిలాబాద్ ఇన్చార్జి డీఎస్పీ సుదర్శన్‌గౌడ్, నల్గొండ ఏసీబీ డీఎస్పీ కోటేశ్వర్రావు, హైద్రాబాద్‌లో డీఎస్పీ ప్రభాకర్‌లతోపాటు సీఐ సాంబయ్య, రాఘవేందర్రావు, వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు. ఎంజీఎంలో వైద్య పరీక్షలు సాంబశివరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న అనంతరం గురువారం రాత్రి ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ భిక్షపతిరావు సాంబశివరావుకు వైద్య పరీక్షలు చేశారు. సాంబశివరావును ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో ఈ వైద్యపరీక్షలు నిర్వహించారు. -
ధైర్యంగా ఫిర్యాదు చేయండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అవినీతి నిరోధక శాఖ అంటే భయం వద్దు.. లంచం తీసుకునే వారిపై ధైర్యంగా మాకు ఫిర్యాదు చేయండి. మీ పెండింగ్ పనిని మేమే దగ్గరుండి పూర్తి చేయిస్తాం.’ అని అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) డీఎస్పీ పి.ప్రభాకర్ పేర్కొన్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే అందుకు సంబంధించిన పని పూర్తి కాదనే అపోహ ప్రజల్లో ఉందని, అలాంటి ఆందోళన నుంచి బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా ఆదివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నాటుకుపోయిన అవినీతిని అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ ఏసీబీకి సహకరించాలని, లంచం పుచ్చుకునే ఉద్యోగి వివరాలు, తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే చాలని, మిగతా సంగతి తాము చూసుకుంటామన్నారు. కేవలం ప్రభుత్వం ఉద్యోగులపైనే కాదని, ప్రభుత్వ సంబంధిత పనులు చేపట్టే అందరిపైనా ఏసీబీకి అధికారం ఉందన్నారు. బాధితులే డబ్బు సర్దుబాటు చేసుకోవాలి.. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే చాలు డబ్బులు వాళ్లే సర్దుబాటు చేసుకుంటారని చాలా మంది అనుకుంటారు. కానీ ఏసీబీ ఆ బాధ్యత తీసుకోదు. లంచం ఇచ్చే డబ్బులు బాధితులే సర్దుబాటు చేసుకోవాలి. అయితే ఆ డబ్బును వీలైనంత త్వరగా తిరిగి బాధితుడికి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. గరిష్టంగా రెండు నెలల్లో బాధితుడికి సదరు డబ్బును ముట్టజెప్పుతాం అదేవిధంగా బాధితుడి పెండింగ్ పనిని సైతం మేమే పూర్తి చేయిస్తాం. ఇందుకు సంబంధిత అధికారులతో టచ్‌లో ఉండి పని పూర్తి చేసేందుకు ఒత్తిడి తెస్తాం. ప్రభుత్వ ప్రమేయమున్న ప్రతీ వ్యక్తిపైనా.. అవినీతి నిరోధక శాఖ పరిధిలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు.. సర్కారు నిధులను ఖర్చు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం నుంచి వేతనం తీసుకునే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరిపైనా దాడులు చేస్తాం. బాధితులు మాత్రం స్పష్టమైన ఆధారాలు ఇవ్వాలి. ఏసీబీ చరిత్రలోనే మొదటగా.. ధారూరు మండలంలోని ఒక సర్పంచ్‌పై దాడి చేసి కేసు నమోదు చేశాం. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 12 మందిపై ఏసీబీ దాడులు నిర్వహించగా.. శేరిలింగంపల్లి మున్సిపాలిటీలోని టౌన్‌ప్లానింగ్ అధికారి రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ లంచం (రూ.2 లక్షలు) తీసుకున్న వ్యక్తిగా రికార్డుకెక్కారు. కేవలం కార్యాలయంలో ఉన్నప్పుడే కాకుండా ఎక్కడైనా లంచం తీసుకుంటే చాలు నేరుగా రైడ్ చేస్తాం. అక్రమాస్తులున్నా ఫిర్యాదు చేయొచ్చు.. లంచం తీసుకున్నప్పుడే ఏసీబీకి పట్టించాలనుకోకుండా.. ఇతర పద్ధతుల్లోనూ పట్టించవచ్చు. కొందరు లంచం కాకుండా ఇతర రూపాల్లో ముడుపులు తీసుకుంటారు. అలాంటి వాళ్లను అక్రమాస్తుల కోణంలో ఫిర్యాదు చేయొచ్చు. అయితే ఏసీబీకి ఇచ్చే ఆధారాల్లో స్పష్టత ఉంటే సులువుగా పట్టుకోవచ్చు. అదేవిధంగా ఆర్టీఏ, రిజిస్ట్రేషన్ తదితర కార్యాలయాల్లో లంచాలు ఎక్కువగా ఇస్తుంటారు. వారిపై ఫిర్యాదు చేయడం అరుదు. అయితే ఎక్కువగా డబ్బులు వసూళ్లు జరిగే అంశంపైనా మాకు ఫిర్యాదు చేయొచ్చు. మేము ఆకస్మిక తనిఖీ నిర్వహించి కేసులు నమోదు చేస్తాం. ఇటీవల ఎల్బీనగర్ మున్సిపాలిటీ, ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయాల్లో దాడులు చేశాం. అవినీతి జరిగే చోటును, వివరాలను నేరుగా నా మొబైల్ నంబర్ 94404 46140కు ఫోన్ చేసి చెప్పండి. సిబ్బంది కొరతతో కొంత ఇబ్బందులు.. ఏసీబీ ఆధ్వర్యంలో దాడుల ప్రక్రియను మరింత పెంచేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అయితే మాకు సిబ్బంది కొరత వేదిస్తోంది. అరకొర సిబ్బందిలో రెగ్యులర్‌గా ఇద్దరు కానిస్టేబుళ్లు కోర్టులకు హాజరుకావడం, మరికొందరు కార్యాలయంలో మెమోలు, చార్జిషీట్లు దాఖలు చేసే పనిలో ఉండడంతో ఆకస్మిక దాడులు చేసే సమయం దొరకట్లేదు. త్వరలో ఈ సమస్యను అధిగమిస్తాం. అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం. ఈ నెల 3 నుంచి 9వరకు ఇప్పటికే కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నాం. జిల్లా స్థాయిలో ఈ ఉత్సవాల్ని పెద్ద ఎత్తున చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభాకర్ తెలిపారు. -
అవినీతిపై ఏసీబీ గురి
నేటినుంచి వారోత్సవాలు ప్రజల్లో అవగాహనకు ప్రయత్నం విజయవాడ సిటీ : ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలన అంశంపై ప్రజలు పెద్దగా స్పందించరు. ఎంతోకొంత ముట్టచెప్పి తమ పని పూర్తి చేసుకుంటారు తప్ప అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు ఫిర్యాదు చేసి అక్రమార్కుల ఆట కట్టించేందుకు ప్రయత్నించరు. ప్రజల భావనలో మార్పు తెచ్చేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఏటా డిసెంబర్ మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహించే వారోత్సవాలను ఇందుకు వేదికగా చేసుకోవాలని నిర్ణయించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థులు, యువత, అవినీతిని పారదోలాలనే అభిప్రాయం ఉన్న వారిని ఒక చోటకు చేర్చి తమ ఉద్దేశాలను వివరించనున్నారు. వారం రోజుల పాటు పలు కార్యక్రమాలతో పాటు అవినీతికి సంబంధించిన అవకాశాలపై విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించనున్నారు. ఆఖరి రోజు జరిగే కార్యక్రమంలో విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందించనున్నారు. అన్ని కార్యక్రమాల్లోను ఆరోపణలు లేని స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయనున్నారు. పోస్టర్ల ప్రచారం: జిల్లాలో అవినీతిపై వ్యతిరేక నినాదాలతో కూడిన పోస్టర్లను విరివిగా ప్రదర్శించనున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద, ప్రజలు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో అందరికీ కనిపించే విధంగా వీటిని ఏర్పాటు చేస్తారు. కరపత్రాలు, స్టిక్కర్లను కూడా పెద్ద సంఖ్యలో అన్ని ప్రాంతాల్లో అంటించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అవినీతి నిరోధక శాఖ లక్ష్యం, నినాదం, ఫోన్ నంబర్లను వీటిలో పొందుపరుస్తున్నారు. అవినీతి మెండు : ప్రభుత్వ శాఖలో అవినీతి పెరిగిందనే అభిప్రాయం సర్వత్రా ఉంది. చేయి తడపనిదే ప్రభుత్వ ఉద్యోగులు పని చేయడం అరుదు. తర్వాత తమ పని కాదనే భావన.. కోర్టుల చుట్టూ తిరగాలనే అభిప్రాయంతో ఏసీబి అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపరు. అన్ని శాఖల్లోనూ అవినీతిపై సమర శంఖం పూరించాలని ఏసీబీ నిర్ణయించింది. అపోహలు వద్దు ఏసీబి అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇబ్బందులుంటాయనే అపోహ వద్దు. బాధితుల సొమ్ము మా శాఖ నుంచే ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాము. డీజీపీ అనుమతితో ట్రాప్‌కు అవసరమైన సొమ్ము మేమే సమకూర్చుతాం. కోర్టు ద్వారా ఆ సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చేర్చుతాం. ఈ దిశగా ఇప్పటికే అధికారులతో చర్చిస్తున్నాం. పని కాదనే భయం కూడా వద్దు. ఆ పని పూర్తి చేసేందుకు మేమే చొరవ తీసుకుంటాం. - వి.గోపాలకృష్ణ, ఏసీబీ డీఎస్పీ, కృష్ణా -
ఏసీబీ వలలో జిల్లా వైద్య అధికారి
కరీంనగర్: ఓ వ్యక్తి నుంచి పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎం అండ్ హెచ్‌వో) కొమరం బాలు గత రాత్రి ఏసీబీకి చిక్కాడు. దీంతో ఏసీబీ అధికారులు కరీంనగర్, వరంగల్‌లోని కొమరం బాలు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్బంగా రూ. 50 లక్షల నగదుతోపాటు అర కిలో బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొమరం బాలు అతడి కుటుంబ సభ్యులకు దాదాపు 10కిపైగా బ్యాంకు లాకర్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఆ లాకర్లను ఒకటి రెండు రోజుల్లో తెరవనున్నట్లు తెలిపారు. వీణవంకలో విధులు నిర్వహిస్తున్న అనస్థీషియా వైద్యుడు ఎన్. సుధాకర్‌కు ఇటీవల చీర్లవంక బదిలీ అయింది. అయితే తన బదిలీని రద్దు చేసి స్వస్థలంలోనే విధులు నిర్వహించేలా కొనసాగించాలని జిల్లా డీఎం అండ్ హెచ్వోను కలిశారు. ఆ క్రమంలో భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశారు. తాను రూ. 60 వేల మాత్రమే ఇవ్వగలనని తెలిపారు. అందుకు డీఎంహెచ్‌వో అంగీకరించాడు. దాంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ అధికారుల వల వేసి డీఎంహెచ్‌వోను పట్టుకున్నారు. ఆ వ్యవహారంలో పాత్ర ఉన్న జూనియర్ అసిస్టెంట్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
ట్రాన్స్‌కో ఏఈకి ఏసీబీ షాక్
కాగజ్‌నగర్‌టౌన్ : అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం కాగజ్‌నగర్ విద్యుత్ శాఖ (ట్రాన్స్‌కో) కార్యాలయంలో దాడులు నిర్వహించారు. విద్యుత్ కనెక్షన్ షిఫ్టింగ్ కోసం డిమాండ్ నోటిస్ ఇవ్వడానికి 20 వేల రూపాయలు లంచం తీసుకున్న రూరల్ ఇన్చార్జి ఏఈ వేణుగోపాల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ విలేకరులతో మాట్లాడారు. కాగజ్‌నగర్ మండలం రాస్పెల్లి గ్రామానికి చెందిన పెకర శ్రీకాంత్ తన మినీ రైస్ మిల్లును గ్రామ శివారులోకి మార్చే క్రమంలో విద్యుత్ కనెక్షన్ షిఫ్టింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రాస్పెల్లి మెయిన్ రోడ్డు వద్ద మినీ రైస్ మిల్లును ఏర్పాటు చేసి, త్రీఫేజ్ కరెంట్ షిఫ్టింగ్ కోసం ట్రాన్స్‌కో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో రూరల్ ఇన్చార్జి ఏఈ వేణుగోపాల్ షిఫ్టింగ్ కోసం ఇచ్చే డిమాండ్ నోటీస్ ఇవ్వడానికి మొదట 35 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువచ్చాడు. పథకం ప్రకారం శనివారం కార్యాలయంలో రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని డీఎస్పీ సుదర్శన్ గౌడ్ పేర్కొన్నారు. నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఏఈ వేణుగోపాల్ డీఈఈ ఒత్తిడి మేరకే తాను రూ.20 వేలు అడిగినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. షిఫ్టింగ్ చేయడానికి డీఈఈ డబ్బులు అడిగినందుకే తాను పెరక శ్రీకాంత్‌ను తీసుకుని కార్యాలయానికి రావాలని సూచించినట్లు వివరించాడు. ఇదిలా ఉండగా.. ఈ అంశంలో డీఈఈ పాత్రపైనా విచారణ చేపడుతామని డీఎస్పీ సుదర్శన్ గౌడ్ వెల్లడించారు. ఇన్చార్జి ఏఈ వేణుగోపాల్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ చెప్పారు. దాడిలో ఆదిలాబాద్ సీఐ సీహెచ్ వేణుగోపాల్, కరీంనగర్ సీఐ వీవీ రమణామూర్తితో పాటు సిబ్బంది వెంకటస్వామి, షేక్ జమీర్, వేణు తదితరులు పాల్గొన్నారు. లంచం అడిగితే నిర్భయంగా ఫిర్యాదు చేయండి.. - అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సుదర్శన్ గౌడ్ కాగజ్‌నగర్ టౌన్ : జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో అవినితి పేరుకుపోయిందని, లంచం అడిగే అధికారులపై ప్రజలు నిర్భయంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ కరీంనగర్ రేంజి డీఎస్పీ సుదర్శన్ గౌడ్ సూచించారు. శనివారం కాగజ్‌నగర్ ట్రాన్స్‌కో కార్యాలయంలో దాడులు నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దశలవారీగా ఆయా శాఖల అధికారులపై నిఘా ఏర్పాటు చేసి వారి అక్రమాలకు చెక్ పెడుతామన్నారు. అనేక మండలాల్లో పహాని, పాస్ బుక్కులు, టైటిల్ బుక్కుల కోసం ఆయా తహశీల్దార్లు వీఆర్వోలపై డబ్బుల కోసం ఒత్తిడి తెస్తున్నారని, తద్వారా విలేజి రెవెన్యూ అధికారులు రైతుల నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారని తమకు ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడే సిబ్బందితోపాటు డబ్బుల కోసం ఒత్తిడి చేసే అధికారిపైనా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. దళారులు ఎంతటివారైనా వారిపై కేసులు నమోదు చేసి, జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఏ ప్రభుత్వ శాఖలోనూ అవినీతి, అక్రమాలు జరిగినా బాధితులు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా నేరుగా జిల్లాలోని తమ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. సెల్ నెంబర్ 9440446150 (డీఎస్పీ), 9440446153 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఎస్ఎంఎస్ పంపినా ఫర్వాలేదని పేర్కొన్నారు. ఈ మెయిల్ చేయొచ్చని అన్నారు. -
కేసుల నిరూపణలో ఏసీబీ విఫలం
సాక్షి, ముంబై: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పథకం ప్రకారం వలపన్ని అనేక మంది అవినీతిపరులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. కాని కోర్టులో తగిన రుజువులు సమర్పించడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా కొంతమంది అవినీతిపరులకు మాత్రమే జైలు శిక్ష పడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ ఆఖరు వరకు వేయి మందికిపైగా అవినీతిపరులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాని నేరం రుజువు కాకపోవడంతో కేవలం 23 శాతం మందికి మాత్రమే జైలు శిక్ష పడింది. కాగా 2009-2014 (అక్టోబర్ ఆఖరు వరకు) కాలవ్యవధిలో 2,266 మందిని పట్టుకోగా వారిలో కేవలం 519 మందికి శిక్ష పడింది. మిగిలిన 1,747 మంది నిర్ధోషులుగా విడుదలయ్యారు. సర్ధార్ వల్లభాయి పటేల్ జయంతి పురస్కరించుకుని ఏసీబీ అక్టోబర్ 27 నుంచి నవంబర్ ఒకటి వరకు భద్రత జనజాగృతి వారోత్సవాలు నిర్వహించింది. ఇందులో అవినీతిపరుల వివరాలు వెల్లడించింది. అవినీతి, ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకోవడం తదితర కేసుల్లో పట్టుబడిన వారిలో అత్యధిక శాతం నాసిక్‌కు చెందినవారున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక కోర్టుల్లో ప్రస్తుతం మొత్తం 2,794 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న 318 కేసులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఏసీబీ అధికారులు కూడా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కాగా, అవినీతి పరులు లంచం తీసుకుంటుండగా రహస్యంగా తీసిన ఫొటోలు లేదా స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా వీడియో చిత్రీకరణ దృశ్యాలు ఏసీబీకి పంపిస్తే కొంత ఫలితముంటుందని నాసిక్ రీజియన్ సూపరింటెండెంట్ ప్రవీణ్ పవార్ అభిప్రాయపడ్డారు. -
ఏసీబీకి చిక్కిన తహశీల్దార్
ఉట్నూర్ : ఉట్నూర్ తహశీల్దార్ ఎండీ అర్షద్ రహమాన్ మంగళవారం రూ.10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కాడు. వివరాలిలా ఉన్నాయి. ఆగస్టు 19న ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ఆన్లైన్లో డాటా ఎంట్రీ చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఉట్నూర్ డివిజన్లోని నార్నూర్, జైనూ ర్, సిర్పూర్(యు), ఇంద్రవెల్లి, ఉట్నూర్, కెరమెరి మండలాలకు చెందిన సర్వేను ఆన్లైన్ డాటా ఎంట్రీ చేయడానికి ఉట్నూర్ మండల కేంద్రంలోని క్లాసిక్ కంప్యూటర్స్ నిర్వాహకుడు సయ్యద్ నసీర్ తీసుకున్నాడు. ఉట్నూర్ మండలంలోని దాదాపు 54 వేల కుటుంబాల సర్వే వివరాలు నమోదు చేయడానికి రూ.76 వేలు బిల్లు అయింది. ఇందులో రూ.35 వేలు చెల్లించిన తహశీల్దార్ మిగతా రూ.41 వేలు చెల్లించడానికి రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సయ్యద్ నసీర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఉట్నూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో తహశీల్దార్ రూ.10 వేలు లంచం తీసుకుని ఉట్నూర్ వైపు కారులో వస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాగా, కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎవరైన లం చం అడిగితే 9440446150, 9440446153కి ఫోన్ చేసి చెప్పవచ్చన్నారు. -
అవినీతిపై పోరులో ప్రాణాలను సైతం లక్ష్యపెట్టను: కేజ్రీవాల్
అవినీతిపై పోరాడే క్రమంలో ప్రాణాలు సైతం లెక్క చేయనని న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అంతేకాని అవినీతిపై రాజీ పడే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఆదివారం ఆయన న్యూఢిల్లీలో మాట్లాడారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వీర్యమైందని ఆయన ఆరోపించారు. ఏసీబీకి నూతన జవసత్వాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు కేజ్రీవాల్ తెలిపారు. అందుకోసం సమర్థవంతమైన అధికారులతో ఏసీబీని బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు వివరించారు. అవినీతి నిరోధక శాఖలో ఒక్కసారి సమర్థవంతమైన అధికారులను నియమిస్తే అవినీతి తిమింగలాల పని పట్టడం చాలా సులువు అవుతుందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా 'ఆప్'ని విస్తరించేందుకు ఇప్పటికే కేజ్రీవాల్ ముమ్మర ఏర్పాట్లులో నిమగ్న మైయ్యారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలఅసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్ వెల్లడించారు.