గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్లను తీసుకెళ్తున్న ఏసీబీ అధికారులు
సాక్షి, గుంటూరు/ఒంగోలు/సాక్షి, అమరావతి/చేబ్రోలు/విజయవాడ లీగల్: టీడీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పొన్నూరు మండలం చింతలపూడిలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఉన్న సంగం డెయిరీ చైర్మన్‌గా ధూళిపాళ్ల నరేంద్ర కొనసాగుతున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో సంగం సొసైటీలో భారీ మొత్తం రుణం తీసుకోవడంతోపాటు డెయిరీలో పలు అక్రమాలు, అవినీతికి సంబంధించిన ఫిర్యాదులపై ఆయనను ఏసీబీ అరెస్టు చేసింది. ఆయనపై అవినీతి నిరోధక చట్టం–1988లోని 13(1)(సీ)(డీ), ఐపీసీ సెక్షన్‌లు 408, 409, 418, 420, 465, 471, 120బి రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు.
సంగం డెయిరీ ఎండీ కూడా అరెస్ట్
కాగా, సంగం డెయిరీలో ఎండీ గోపాలకృష్ణను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం డెయిరీ పరిపాలన కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే డెయిరీ ఉద్యోగులు సోదాలకు సహకరించలేదు. కొన్ని గదుల తాళాలు తీయకపోవడం, సంబంధిత ఉద్యోగులు అందుబాటులో లేకుండా పోవడం, ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం చేసినట్టు సమాచారం. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు డెయిరీలోనే ఏసీబీ అధికారులు వేచి ఉన్నారు. అందుబాటులో ఉన్నవాటిని పరిశీలించి, పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.
సహకార శాఖ మాజీ రిజిస్ట్రార్ కూడా..
కాగా, ప్రకాశం జిల్లా సహకార శాఖలో రిజిస్ట్రార్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన మేళం గురునాథంను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. శుక్రవారం ఉదయం ఒంగోలు ఎన్‌జీవో కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ధూళిపాళ్ల నరేంద్రకు సంబంధించిన కేసులోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా సహకార శాఖ రిజిస్ట్రార్‌గా పనిచేసిన కాలంలో సొసైటీ చట్టాన్ని దుర్వినియోగపరిచారనే అభియోగంపై ఏసీబీ ఆయనను అరెస్టు చేసింది. ఈ కేసులో నరేంద్రను ఏ1గా, డెయిరీ ఎండీ పి.గోపాలకృష్ణను ఏ2గా, గురునాథంను ఏ3గా ఏసీబీ చేర్చింది. వీరిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా కోర్టు పూర్తి అదనపు ఇన్‌చార్జి న్యాయమూర్తి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులను కోవిడ్ పరీక్షల నిమిత్తం విజయవాడలోని ఈఎస్‌ఐ కోవిడ్ సెంటర్‌కు తీసుకెళ్లగా గురునాథంకు పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఆయనను క్వారంటైన్‌కు తరలించారు.
ప్రాథమిక ఆధారాలతోనే అరెస్టు చేశాం: ఏసీబీ
కాగా, ధూళిపాళ్ల నరేంద్రను ప్రాథమిక ఆధారాలతోనే అరెస్టు చేశామని ఏసీబీ పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదే విషయాన్ని కోర్టుకు సమర్పించిన రిపోర్టులోనూ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీడీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ బాబు.ఎ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధూళిపాళ్లను అరెస్టు చేసినట్టు తెలిపింది. ధూళిపాళ్లతోపాటు సంగం డెయిరీ ఎండీ పి.గోపాలకృష్ణ, రిటైర్డ్ జిల్లా కో ఆపరేటివ్ అధికారి ఎం.గురునాథం, గతంలో ఎండీగా పనిచేసిన కె.గోపీనాథ్, సంగం డెయిరీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పి.సాంబశివరావు సహా మరికొందరిపై కేసు నమోదు చేశామని వివరించింది.
అక్రమాలకు, అవకతవకలకు అడ్డాగా మార్చేశారు..
గుంటూరు డిస్ట్రిక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఎయిడెడ్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ (జీడీఎంపీసీయూఎల్), గుంటూరు డిస్ట్రిక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ యూనియన్(జీడీఎంపీఎంఎసీయూఎల్), సంగం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌ఎంపీసీఎల్)గా రూపాంతరం చెందుతూ వచ్చిన సంగం డెయిరీని అక్రమాలు, అవకతవకలకు నిలయంగా మార్చేశారని ఏసీబీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన చట్టాలను, నిబంధనలను ఇష్టానుసారం ఉల్లంఘించారని తెలిపింది. సంగం డెయిరీకి కేటాయించిన భూములను నిబంధనలకు విరుద్ధంగా బదలాయించారంది. 1992, ఫిబ్రవరి 8న ధూళిపాళ్ల నరేంద్రకుమార్ జీడీఎంపీసీయూఎల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1994 మార్చిలో ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు మేనేజింగ్ ట్రస్టీగా ఉండేందుకు తీర్మానం చేయించుకుని అక్రమాలకు తెరలేపారని ఏసీబీ పేర్కొంది. ఆ తర్వాత సంగం డెయిరీకి చెందిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా ట్రస్ట్‌కు బదలాయించారు. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఆ భూములను బదలాయించినట్టు ఆధారాలు ఉన్నాయని ఏసీబీ పేర్కొంది. పలు సంస్థలు ఏర్పాటు చేసి సంగం డెయిరీ ఆదాయాన్ని, ఆస్తులను అడ్డగోలుగా మళ్లించారని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment