పోలీసుల అదుపులో అరవింద్‌రెడ్డి, రామిరెడ్డి, లిఖిత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈఎస్‌ఐకి చెందిన ఐఎంఎస్(ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్)లో రోజుకో సంచలనం వెలుగుచూస్తోంది. మాజీ డైరెక్టర్, మాజీ జాయింట్ డైరెక్టర్ పద్మ అక్రమాలు తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్నాయి. ఈఎస్‌ఐల మందుల కొనుగోళ్లలో ఇష్టానుసారంగా వ్యవహరించిన మాజీ జేడీ పద్మ మందుల కొనుగోళ్లు అధికరేట్లు, తప్పుడు ఇండెంట్లలో చేతివాటం చూపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈమెకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) దర్యాప్తులో బయటపడింది. అదనంగా వచ్చిన ఆర్డర్ల తాలూకు మందులను రహస్యంగా బయటకి పంపి, వాటినీ సొమ్ము చేసుకున్న విషయం ఏసీబీ గుర్తించింది. ఈ కుట్రలో ఆమెకు సహకరించిన ముగ్గురు సోమవారం అరెస్టయ్యారు.
ఎలా చేసింది..?
నిబంధనలకు విరుద్ధంగా, అవసరానికి మించి మందులు ప్రొక్యూర్ చేసిన పద్మ వాటిని అంతటితో ఆగలేదు. వాటిని వైద్యశిబిరాల పేరుతో రహస్యంగా బయటకి తరలించేది. తనకు పరిచయమున్న డాక్టర్ చెరకు అరవింద్‌రెడ్డి అనే వ్యక్తి ఈ వ్యవహారాన్ని ఎవరి కంటబడకుండా నడిపేవాడు. ఇతనికి వెంకటేశ్వర హెల్త్ సెంటర్ అనే మందుల కంపెనీ ఉంది. ఇతనికి బాలానగర్, సుచిత్రలలో మందుల గోదాములు ఉన్నాయి. వీటిలో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు ఈఎస్‌ఐ నుంచి వచ్చిన మందులు, కిట్లు కుప్పలుగా బయటపడ్డాయి.
వీటిని సీజ్ చేశారు. అసలు ఆ గోదాముల నడుస్తున్నదే ఈఎస్‌ఐ నుంచి వచ్చిన మందుల కోసమని తెలుసుకుని ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. వీటిని ఇతర హాస్పిటల్స్, మార్కెట్లలో విక్రయించగా వచ్చిన సొమ్మును పంచుకునేవారు. ఈ మందులను తెలంగాణలోనే కాదు, ఏపీకి కూడా విక్రయించినట్లు అధికారులు తేల్చారు. మొత్తం వ్యవహారంలో అతనికి కె.రామిరెడ్డి, లిఖిత్‌రెడ్డిలు సహకరించేవారు. ఈముగ్గురిని సోమవారం ఏసీబీ పోలీసులు అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. అసలు వెంకటేశ్వర హెల్త్ కేర్ కంపెనీ అరవింద్ ఎప్పుడు ప్రారంభించాడు? దీని వెనక పద్మ హస్తం ఏమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.
శశాంక్ గోయల్ పాత్రపైనా విచారించాల్సిందే..
ఐఎంఎస్ కుంభకోణంలో కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్ పాత్రపైనా విచారణ జరపాలని సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ 2018, 2019లో రెండుసార్లు విజిలెన్స్ విచారణ జరిపి నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు చేపట్టలేదో తెలపాలన్నారు. ఆ రెండు నివేదికలను తొక్కిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మాజీ డైరెక్టర్ దేవికారాణి విషయంలో ఆయన ఉదాసీనంగా వ్యవహరిస్తూ కేవలం లేఖలతో సరిపెట్టారని మండిపడ్డారు. కానీ, మాజీ జేడీ పద్మ విషయంలో మాత్రం అక్రమాలు జరిగాయంటూ ఏసీబీకి లేఖ రాయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment