
సాక్షి, హైదరాబాద్: ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) స్కామ్ దర్యాప్తులో కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో ప్రైవేట్ ఆస్పత్రుల పాత్ర బయటపడుతోంది. పలు ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కై.. ఈఎస్ఐ సిబ్బంది అవినీతికి పాల్పడినట్టుగా ఏసీబీ విచారణలో తేలింది. డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఆరుగురిని రెండురోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు... సమగ్రంగా విచారణ జరిపారు. ప్రతి డిస్పెన్సరీ పరిధిలో నాలుగు పెద్ద ఆస్పత్రులకు ఈఎస్‌ఐ మందుల విక్రయాలు జరిగినట్టుగా ఏసీబీ విచారణలో బయటపడింది. పటాన్ చెరువు, వనస్థలి పురం, చర్లపల్లి, ఆర్‌సీ పురం డిస్పెన్సరీలో మందుల విక్రయాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది.
ఓమీ ఫార్మాతో పాటు ఇద్దరు జాయింట్ డైరెక్టర్స్ పద్మ, వసంత, ఫార్మాసిస్ట్ రాధిక ప్రైవేట్ ఆస్పత్రులకు మందులు తరలించామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. కొనుగోలు చేసిన మెడిసిన్స్‌ను డిస్పెన్సరీలకు పంపించి.. అక్కడి నుంచి కార్మికులకు ఇచ్చినట్టుగా చూపించారు అక్రమార్కులు. తద్వారా ఈ మందులను దొడ్డిదారిన ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ఇలా ప్రతీ డిస్పెన్సరీ పరిధిలో నాలుగు పెద్ద ఆస్పత్రులకు ఈఎస్‌ఐ మందులను సరఫరా చేసినట్టు ఏసీబీ విచారణలో వెలుగుచూసింది. అక్రమంగా ఈఎస్‌ఐ మందులు కొనుగోలు చేసిన ప్రైవేట్ ఆస్పత్రులపై కూడా కేసులు నమోదు చేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే జాబితా కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment