Insurance Medical Services
-
దరఖాస్తు గడువు నేడు.. కాంట్రాక్టు ముగిసేది ఎల్లుండి!
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ సర్విసెస్ (ఐఎంఎస్) డైరెక్టరేట్ పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఉద్యోగ ప్రకటననుంచి దరఖాస్తు ప్రక్రియ వరకు అపోహలు తలెత్తుతుండటం..దీనిపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఐఎంఎస్ ఆ«ద్వర్యంలో నిర్వహిస్తున్న ఈఎస్ఐ ఆస్పత్రుల్లో 231 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అత్యవసర కేటగిరీకి చెందిన ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలంటూ కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణికుముదిని ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం ఐఎంఎస్.. జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటిస్తూ నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటిని జిల్లా స్థాయి కమిటీల ద్వారా భర్తీ చేస్తారు. కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, ఐఎంఎస్ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడుకన్వీనర్గా, డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్, ఈఎస్ఐ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్లు సభ్యులుగా ఉంటారు. దరఖాస్తు ప్రక్రియలో లోపాలు దరఖాస్తులను మాన్యువల్ పద్ధతిలోనే స్వీకరించనున్నట్లు ఐఎంఎస్ నోటిఫికేషన్లో పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణకు ఐఎంఎస్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. సాధారణంగా మాన్యువల్ పద్ధతిలో దరఖాస్తు తీసుకున్నాక.. దరఖాస్తుకు జతచేసిన పత్రాలకు సంబంధించిన చెక్లిస్ట్ను అభ్యర్థికి రసీదు రూపంలో ఇవ్వాలి. అయితే, ఇక్కడ అలాంటిదేమీ జరగట్లేదు. దీంతో పోస్టుల భర్తీలో అవకతవకలకు ఆస్కారం ఉందంటూ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు జిల్లాల వారీగా ఉద్యోగ ప్రకటనలో రోస్టర్, రిజర్వేషన్ అంశాలను ప్రస్తావించకపోవడాన్నీ తప్పుబడుతున్నారు. కాంట్రాక్టు ఎప్పటివరకు? కారి్మకశాఖ జారీచేసిన జీఓ 25 ప్రకారం ఐఎంఎస్‌లో 231 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి సంబంధించినఏడాది కాంట్రాక్టు గడువు ఈనెల 31తో ముగియనుంది. ఒకవైపు 31వ తేదీతో కాంట్రాక్టు గడువు ముగియనుండగా.. 29 వరకు దరఖాస్తులను స్వీకరిస్తుండటం గమనార్హం. ఈనెల 30కల్లా ఇంటర్వ్యూలు నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు వెనువెంటనే జారీచేసినా అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరే నాటికే కాంట్రాక్టు గడువు ముగుస్తుందని ఐఎంఎస్ అధికారులే చెబుతున్నారు. ఈ నిబంధన కూడా ఉద్యోగార్థుల్లో గందరగోళం రేకెత్తిస్తోంది. -
ఈఎస్ఐ కుంభకోణం: మాజీ మంత్రి పేషీ నుంచే..!
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ (ఐఎంఎస్) కుంభకోణం కేసులో దరాప్తు, సోదాలు చేసిన కొద్దీ అనేక అక్రమాలు, అక్రమార్జనలు వెలుగు చూస్తున్నాయి. అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. రాష్ట్ర కార్మిక శాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి, నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డిల ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సోదాలు చేయడం, వారి నుంచి దాదాపు రూ.3 కోట్ల నగదు, రూ.కోటి విలువైన నగలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో వీరికి కూడా సంబంధాలు ఉన్నప్పుడు మరి రెండేళ్లుగా కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ వీరిని ఎందుకు అరెస్టు చేయలేదు? కనీసం విచారించ లేదా? విచారించినా ఆ విషయాన్ని బయటికి చెప్పలేదా? ఒకవేళ ఏసీబీ వీరిని ప్రశ్నించేందుకు యత్నించినా.. ఏవైనా రాజకీయశక్తులు అడ్డు పడ్డాయా? అప్పటి మంత్రి పేషీ నుంచి కథంతా నడిచిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2019లో ఏసీబీ విచారణ ప్రారం భమవుతున్న దశలో కార్మిక శాఖకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి ఏసీబీకి ఓ లేఖ రాశారు. అందులో అక్రమాలు కిందిస్థాయిలోనే జరిగాయని, ఉన్నతాధికారులకు సంబంధం లేవన్నట్టుగా పేర్కొన్నారు. అయితే ఇప్పుడదే ఉన్నతాధికారులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా మారి అరెస్టు కావడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఏసీబీ నివేదిక ఆధారంగా రంగంలోకి ఈడీ మనీలాండరింగ్ జరిగిందన్న ఏసీబీ నివేదిక (8ఎఫ్ఐఆర్లు) ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని డిసెంబర్ నుంచి ప్రశ్నిస్తోంది. వారిచ్చిన సమాచారం ఆధారంగానే కొత్తగా శ్రీనివాసరెడ్డి, ముకుందరెడ్డిల పేర్లు తెరపైకి రావడం గమనార్హం. కాగా ఇదే పనిని గతంలో ఏసీబీ ఎందుకు చేయలేకపోయింది? అన్న చర్చ సాగుతోంది. ఏపీలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఇదే తరహా కేసులో అరెస్టయ్యారు. ఇక్కడా, అక్కడా కుంభకోణం జరిగిన తీరు (మోడస్ ఆపరెండి) ఒకటే కావడం గమనార్హం. ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై కన్ను ముకుందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, దేవికారాణి, శ్రీహరిబాబు తదితరుల బ్యాంకు ఖాతాలు, ఆస్తులపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. 2014 నుంచి 2019లో ఈ కేసు వెలుగు చూసే వరకు వీరు, వీరి బంధువుల బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన ఆన్లైన్ లావాదేవీలు, కొనుగోలు చేసిన ఆస్తులు, వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కూడబెట్టిన నగలు, చెల్లించిన ఆదాయపు పన్ను తదితరాలను విశ్లేషిస్తోంది. ముఖ్యంగా బ్యాంకు లాకర్లు తెరిచేందుకు అంతే వేగంగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇంతకాలం అధికారులు మాత్రమే ఈ కుంభకోణంలో ఉన్నారనుకున్నప్పటికీ తాజాగా ఈడీ రంగప్రవేశంతో వాతావరణం వేడెక్కింది. ఈ కుంభకోణానికి మంత్రి కార్యాలయం నుంచే కుట్ర జరిగిందా? అన్న అనుమానాలు వాస్తవానికి ముందు నుంచీ ఉన్నాయి. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ డిప్యూటీ డైరెక్టర్ కలకుంట్ల పద్మలు ఇష్టానుసారంగా, నిబంధనలకు విరుద్ధంగా మందుల సరఫరా కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు మంత్రి కార్యాలయం అభ్యంతరం తెలపలేదు. ‘‘కార్మిక శాఖ నిబంధనలకు విరుద్ధంగా నాలుగేళ్లు కాంట్రాక్టులు ఇచ్చినా ఏనాడూ వివరణ కోరలేదు. విజిలెన్స్ రంగప్రవేశం చేసేవరకూ ఆడిటింగ్‌లో ఎలాంటి లోపాలు వెలుగుచూడలేదు’’ అంటూ ఈఎస్ఐ సిబ్బంది అనేక సందేహాలు లేవనెత్తినప్పటికీ వీటిపై ఏసీబీ అంతగా దృష్టి సారించలేదు. కానీ, ఈడీ కేంద్ర దర్యాప్తు సంస్థ కావడంతో కొత్తపేర్లు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. పేద కార్మికుల సొమ్మును తినేశారు! ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు రూ.700 కోట్లకుపైగా మందుల కొనుగోళ్లలో దాదాపు రూ.200 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టి ఉంటాయని ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈఎస్ఐ ఆసుపత్రి పేద కార్మికులకు ఒక వరం లాంటిది. రూ.25 వేలలోపు వేతనం ఉన్న కార్మికుల నుంచి నెలానెలా రూ.500 వరకు చందా కింద వసూలు చేస్తారు. అలా సేకరించిన నిధులతో పాటు ప్రభుత్వం ఇచ్చే నిధులు కలిపి అనారోగ్యం బారిన పడిన కార్మికులకు వైద్యసేవలు అందిస్తారు. అలాంటి బీద కార్మికులకు దక్కాల్సిన మందులను, వైద్య పరీక్షలకు కావాల్సిన మెడికల్ కిట్లను తదితరాల ధరలను ఇష్టారీతిన పెంచుకుంటూ పోవడం, కమీషన్ల రూపంలో అందినకాడికి దండుకోవడం నాలుగేళ్లపాటు యధేచ్ఛగా సాగింది. ‘‘ఆరుగాలం శ్రమించిన పంటను పందికొక్కులు తిన్నట్లు, తాము చందాగా చెల్లించిన డబ్బులను కొందరు అవినీతిపరులు అదేవిధంగా పంచుకుతిన్నారంటూ’’ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఏపీలో కూడా ఇదే తరహాలో రూ.988 కోట్ల కొనుగోళ్లలో సుమారు రూ.150 కోట్లకుపైగా కుంభకోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇక్కడా, అక్కడా.. పాత్రధారులు వేరైనా.. సూత్రధారులు ఒకరేనా? అన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. ఏపీలో జరిగిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదల అయిన బుర్రా ప్రమోదరెడ్డి పేరిట తెలంగాణ, ఏపీల్లో 7 డొల్ల కంపెనీలు ఉన్నాయి. కాగా శనివారం హైదరాబాద్‌లో శ్రీనివాసరెడ్డి, ముకుందరెడ్డి ఇంటితో పాటు ప్రమోదరెడ్డి ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించడం, రూ.1.15 కోట్లను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. -
‘లెజెండ్’ శ్రీహరికి బినామీనే..
సాక్షి, హైదరాబాద్: ‘వడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు’అన్న సామెత ఈఎస్ఐ మందుల గోల్‌మాల్‌లో అక్రమాలకు చక్కగా సరిపోతుంది. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్)లో మందుల కోనుగోళ్ల గోల్‌మాల్‌కు సంబంధించి ఓమ్నీ ఫార్మా ఎండీ శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కీలక సాక్ష్యాలు సేకరించింది. ఐఎంఎస్‌లో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులను తన గుప్పిట పెట్టుకున్న శ్రీహరి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టినట్లు గుర్తించింది. తన కంపెనీకి అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టించుకున్నదే కాకుండా.. తన బినామీ కంపెనీలకూ నకిలీ అర్హత పత్రాలతో కాంట్రాక్టులు ఇప్పించుకున్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. బినామీ కంపెనీకి ఐఎంఎస్ చెల్లించిన డబ్బును తర్వాత తన ఖాతాలోకి ఎలా మళ్లించుకున్నాడో ఆధారాలూ సంపాదించింది. నకిలీ చిరునామా, కంపెనీ, సర్టిఫికెట్లు ఐఎంఎస్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా అనేక కాంట్రాక్టులు పొందిన శ్రీహరిబాబు 2017–18లో ఏకంగా లెజెండ్ ఎంటర్ప్రైజెస్ పేరిట ఓ డొల్ల కంపెనీని సృష్టించాడు. దానికి కృపాసాగర్‌రెడ్డి అనే వ్యక్తిని యజమానిగా పెట్టాడు. దానికి డ్రగ్ కంట్రోల్ అథారిటీ వద్ద రిజిస్ట్రేషన్ చేయించే సమయంలో కూకట్పల్లి, రాజీవ్‌గాంధీనగర్ చిరునామాగా పేర్కొన్నాడు. అసలు ఈ చిరునామాలో ఎలాంటి కంపెనీ లేదు. మరోవైపు స్వీడన్‌కు చెందిన హోమోక్యూ అనే కంపెనీ తెల్ల రక్తకణాలను పరీక్షించే కిట్ల (డబ్ల్యూబీసీ)ను భారత్‌లో సరఫరా చేస్తోంది. వీటిని సరఫరా చేసే అనుమతులు ఓమ్నీకి ఉన్నాయి. ఇక్కడే శ్రీహరి తన తెలివితేటలు చూపించాడు. తాను హోమోక్యూ కంపెనీ నుంచి డబ్ల్యూబీసీ కిట్లను ఒక్కోటి రూ.11,800లకు కొన్నాడు. వీటిని లెజెండ్ కంపెనీ ద్వారా రూ.36,800లకు ఐఎంఎస్‌కు విక్రయించాడు. రెండు కంపెనీల ఇన్వాయిస్లను పరిశీలించగా.. 2017 ఆగస్టు 11న ఈ కిట్లు ఓమ్నీ కంపెనీకి హోమోక్యూ సరఫరా చేయగా.. లెజెండ్ కంపెనీ 12న ఐఎంఎస్‌కు సరఫరా చేసింది. దీనివల్ల రూ.54 కోట్లు ఐఎంఎస్ ద్వారా లెజెండ్ కంపెనీ ఖాతాలోకి వెళ్లాయి. ఈ తతంగానికి హోమో క్యూ కంపెనీ ఏపీ–తెలంగాణ రీజినల్ మేనేజర్ వెంకటేశ్ పూర్తిగా సహకరించాడు. ఫలితంగా ప్రభుత్వానికి రూ.11.07 కోట్లు నష్టం వాటిల్లింది. విషయం తెలిసిన హోమోక్యూ కంపెనీ తమకూ లెజెండ్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. రెండు కంపెనీల కిట్లకు ఒకటే బ్యాచ్ నంబర్.. వాస్తవానికి లెజెండ్ కంపెనీ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ద్వారా రిజిస్టరైనా.. దానికి ఈ కిట్లను సరఫరా చేయాలంటే హోమోక్యూ నుంచి డిస్ట్రిబ్యూటరై ఉండాలి. కానీ, లెజెండ్ హోమోక్యూ డిస్ట్రిబ్యూటర్ అంటూ శ్రీహరి ఓ నకిలీ సర్టిఫికెట్‌ను కూడా సృష్టించాడు. ఇక శ్రీహరి చెప్పిన రేటును ఆమోదిస్తూ అప్పటి డైరెక్టర్ దేవికారాణి, డిప్యూటీ డైరెక్టర్ కలకుంట్ల పద్మలు సంతకాలు చేసి బిల్లులు చెల్లించారు. అలా లెజెండ్ కంపెనీకి చెల్లించిన రూ.54 కోట్లను తిరిగి శ్రీహరి తన ఓమ్నీ ఫార్మా ఖాతాకు మళ్లించుకున్నాడు. ఈ మేరకు ఏసీబీ లెజెండ్ బ్యాంకు ఖాతా లావాదేవీల ప్రతులను సేకరించింది. శ్రీహరి లెజెండ్ కంపెనీ కోసం సృష్టించిన నకిలీ సర్టిఫికెట్లు కూడా సంపాదించింది. అంతేకాకుండా ఓమ్నీ కంపెనీని హోమోక్యూ సరఫరా చేసిన డబ్ల్యూబీసీ కిట్ల బ్యాచ్ నంబర్లు, లెజెండ్ సరఫరా చేసిన బ్యాచ్ నంబర్లు ఒకటే కావడం గమనార్హం. దీంతో ఈ రెండు కంపెనీల వెనక ఉన్నది శ్రీహరిబాబే ఉన్నట్లు తేటతెల్లమైందని అధికారులు వ్యాఖ్యానించారు. ఇటీవల ఫార్మా కంపెనీ ఎండీ శ్రీహరి బాబుతో పాటు, హోమోక్యూ రీజినల్ మేనేజర్ టంకశాల వెంకటేశ్‌లు అరెస్టయిన విషయం తెలిసిందే. -
ఖాళీ ఇన్వాయిస్లతో కాజేశారు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ కలకుంట్ల పద్మలు నకిలీ బిల్లులతో, బినామీ కంపెనీలతో ఇష్టానుసారంగా పాల్పడ్డ అక్రమాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దేవికారాణికి ఈ కుంభకోణంలో సహకరించిన సికింద్రాబాద్‌లోని విశాల్ ఎంటర్ ప్రైజెస్‌కి చెందిన పందిల్ల భూపాల్‌రెడ్డి, సికింద్రాబాద్‌లోని వసుధ మార్కెటింగ్‌కి చెందిన రెడ్డిమల్లి నాగేందర్‌రెడ్డిలను ఏసీబీ శనివారం అరెస్టు చేసింది. ఎలా మోసం చేశారంటే..? ఎలాంటి టెండర్లు లేకుండా నాన్ రేటెడ్ కంపెనీ (ఎన్ఆర్సీ)లతో కుమ్మక్కయిన దేవికారాణి కొందరితో ఏకంగా డొల్ల కంపెనీలు ప్రారంభించింది. తేజ ఫార్మా కంపెనీకి చెందిన పందిరి రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు ఈ దందాలో భూపాల్‌రెడ్డి, నాగేందర్‌రెడ్డి బాగా సహకరించారు. అధిక ధరలకు కోట్ చేసిన ఖాళీ బిల్లులు, ఇన్వాయిస్లు, సాఫ్ట్‌కాపీలు సృష్టించి, సనత్‌నగర్‌లోని దేవికారాణి నమ్మిన బంటు ఫార్మాసిస్టు కొడాలి నాగలక్షి్మకి ఇచ్చేవారు. ఆమె వాటిని దేవికారాణి వద్దకు తీసుకెళ్లి సంతకాలు చేయించి నిధులు విడుదలయ్యేలా చూసేది. వీరిచేత దేవికారాణి దాదాపు 25 డొల్ల కంపెనీలు తెరిపించినట్లుగా ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. లేని కంపెనీలతో బిల్లులు పెట్టడం, వాటికి చెల్లింపులు చేయడం, తర్వాత అంతా కలిసి పంచుకోవడం ద్వారా ఈఎస్ఐ సొమ్మును కాజేశారని ఏసీబీ ఉన్నతాధికారులు వివరించారు. వచ్చిన సొమ్ముతో భూముల కొనుగోలు డొల్ల కంపెనీలు తెరిపించడంలో, నకిలీ బిల్లులు సృష్టించడంలో తేజఫార్మా, దేవికారాణికి సహకరించినందుకు వీరికీ భారీగా ముడుపులు ద క్కాయి. ఈ డబ్బులతో భూపాల్‌రెడ్డి, నాగేందర్‌రెడ్డిలు కామారెడ్డి జిల్లా బికనూర్ వద్ద భారీగా వ్యవసాయ భూములు కొనుగోలు చేశారని విచారణలో తేలింది. నిందితులిద్దరిపైనా కుట్ర, మో సం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌పై చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
ఈఎస్ఐ స్కాం: మరో ఇద్దరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల గోల్మాల్ కేసులో అరెస్ట్‌ల పర్వం ఇంకా కొనసాగుతూ ఉంది. తాజాగా మరో ఇద్దరిని అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. మెడికల్ ఏజెన్సీ ప్రతినిధులుగా వ్యవహరించిన భూపాల్ రెడ్డి, నాగేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలు దేవికారాణి బినామీ కంపెనీలకు వీరిద్దరూ సహకరించినట్లు ఏసీబీ విచారణలో వెల్లడి అయింది. ఫార్మా కంపెనీల పేరుతో తప్పుడు లెక్కలు చూపించి, అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు నిర్థారణకు వచ్చారు. -
ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం చేశారు. మనస్తాపంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఈ ఘటనకు పాల్పడ్డారు. కాగా ఈఎస్ఐ కుంభకోణంలో పద్మను ఏసీబీ అధికారులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైల్లో పద్మ నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. కాగా తెలంగాణలో సంచలనం రేపిన ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణం వ్యవహారంలో ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మా, వసంత, రాధిక, హర్షవర్ధన్‌తో పాటు మరో ఇద్దరిని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. -
ఈఎస్ఐ కుంభకోణంలో మరో ముగ్గురు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ కుంభకోణంలో మరో ముగ్గురిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం అరెస్ట్ చేసింది. తేజ ఫార్మా ఎండి రాజేశ్వర్‌రెడ్డి, చర్లపల్లి డిస్పెన్సరీ ఫార్మాసిస్ట్ లావణ్య, వరంగల్ జేడీ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి పాషాలను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ. 28 కోట్ల మందుల కొనుగోళ్ల వ్యవహారంలో రాజేశ్వర్‌రెడ్డి అవకతవకలకు పాల్పడినట్లు ఏబీసీ గుర్తించింది. గతంలో అరెస్టయిన వెంకటేశ్వర హెల్త్ కేర్ ఎండీ అరవింద్‌రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ముగ్గురు నిందితులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌లతో ఇప్పటి వరకూ ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయిన వారి సంఖ్య 16కి చేరింది. ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
ఈఎస్ఐ స్కాం: ప్రైవేట్ ఆస్పత్రుల భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) స్కామ్ దర్యాప్తులో కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో ప్రైవేట్ ఆస్పత్రుల పాత్ర బయటపడుతోంది. పలు ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కై.. ఈఎస్ఐ సిబ్బంది అవినీతికి పాల్పడినట్టుగా ఏసీబీ విచారణలో తేలింది. డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఆరుగురిని రెండురోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు... సమగ్రంగా విచారణ జరిపారు. ప్రతి డిస్పెన్సరీ పరిధిలో నాలుగు పెద్ద ఆస్పత్రులకు ఈఎస్ఐ మందుల విక్రయాలు జరిగినట్టుగా ఏసీబీ విచారణలో బయటపడింది. పటాన్ చెరువు, వనస్థలి పురం, చర్లపల్లి, ఆర్సీ పురం డిస్పెన్సరీలో మందుల విక్రయాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఓమీ ఫార్మాతో పాటు ఇద్దరు జాయింట్ డైరెక్టర్స్ పద్మ, వసంత, ఫార్మాసిస్ట్ రాధిక ప్రైవేట్ ఆస్పత్రులకు మందులు తరలించామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. కొనుగోలు చేసిన మెడిసిన్స్‌ను డిస్పెన్సరీలకు పంపించి.. అక్కడి నుంచి కార్మికులకు ఇచ్చినట్టుగా చూపించారు అక్రమార్కులు. తద్వారా ఈ మందులను దొడ్డిదారిన ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ఇలా ప్రతీ డిస్పెన్సరీ పరిధిలో నాలుగు పెద్ద ఆస్పత్రులకు ఈఎస్ఐ మందులను సరఫరా చేసినట్టు ఏసీబీ విచారణలో వెలుగుచూసింది. అక్రమంగా ఈఎస్ఐ మందులు కొనుగోలు చేసిన ప్రైవేట్ ఆస్పత్రులపై కూడా కేసులు నమోదు చేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే జాబితా కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. -
ఈఎస్ఐ కుంభకోణం: కస్టడీకి నిందితులు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) స్కామ్ దర్యాప్తులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ఈ కేసులో ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణితో పాటు ఆరుగురు నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు బుధవారం తెలిపారు. విచారణ నిమిత్తం నిందితులను బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు నిందితులను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 13 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇంకా ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయనీ, మరికొంత మందిని అరెస్ట్ చేయనున్నట్లు ఆ విభాగ అధికారులు పేర్కొన్నారు. ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఫార్మసిస్ట్ రాధిక, ఉద్యోగి నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ హర్షవర్ధన్, ఎండీ శ్రీహరిలను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వీరందరినీ విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. నిందితుల వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్నారు. తాజాగా జరిపిన ఏసీబీ సోదాల్లో అరవింద్ రెడ్డి కార్యాలయంలో దొరికిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. సాక్ష్యాలు మొత్తం నిందితుల ముందు పెట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. నిందితులు ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొంత మందిని ఏసీబీ అదుపులోకి తీసుకోనుందని తెలుస్తోంది. -
‘అరవింద సమేత..’ దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఐఎంఎస్(ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్)లో రోజుకో సంచలనం వెలుగుచూస్తోంది. మాజీ డైరెక్టర్, మాజీ జాయింట్ డైరెక్టర్ పద్మ అక్రమాలు తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్నాయి. ఈఎస్‌ఐల మందుల కొనుగోళ్లలో ఇష్టానుసారంగా వ్యవహరించిన మాజీ జేడీ పద్మ మందుల కొనుగోళ్లు అధికరేట్లు, తప్పుడు ఇండెంట్లలో చేతివాటం చూపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈమెకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) దర్యాప్తులో బయటపడింది. అదనంగా వచ్చిన ఆర్డర్ల తాలూకు మందులను రహస్యంగా బయటకి పంపి, వాటినీ సొమ్ము చేసుకున్న విషయం ఏసీబీ గుర్తించింది. ఈ కుట్రలో ఆమెకు సహకరించిన ముగ్గురు సోమవారం అరెస్టయ్యారు. ఎలా చేసింది..? నిబంధనలకు విరుద్ధంగా, అవసరానికి మించి మందులు ప్రొక్యూర్ చేసిన పద్మ వాటిని అంతటితో ఆగలేదు. వాటిని వైద్యశిబిరాల పేరుతో రహస్యంగా బయటకి తరలించేది. తనకు పరిచయమున్న డాక్టర్ చెరకు అరవింద్‌రెడ్డి అనే వ్యక్తి ఈ వ్యవహారాన్ని ఎవరి కంటబడకుండా నడిపేవాడు. ఇతనికి వెంకటేశ్వర హెల్త్ సెంటర్ అనే మందుల కంపెనీ ఉంది. ఇతనికి బాలానగర్, సుచిత్రలలో మందుల గోదాములు ఉన్నాయి. వీటిలో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు ఈఎస్ఐ నుంచి వచ్చిన మందులు, కిట్లు కుప్పలుగా బయటపడ్డాయి. వీటిని సీజ్ చేశారు. అసలు ఆ గోదాముల నడుస్తున్నదే ఈఎస్ఐ నుంచి వచ్చిన మందుల కోసమని తెలుసుకుని ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. వీటిని ఇతర హాస్పిటల్స్, మార్కెట్లలో విక్రయించగా వచ్చిన సొమ్మును పంచుకునేవారు. ఈ మందులను తెలంగాణలోనే కాదు, ఏపీకి కూడా విక్రయించినట్లు అధికారులు తేల్చారు. మొత్తం వ్యవహారంలో అతనికి కె.రామిరెడ్డి, లిఖిత్‌రెడ్డిలు సహకరించేవారు. ఈముగ్గురిని సోమవారం ఏసీబీ పోలీసులు అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. అసలు వెంకటేశ్వర హెల్త్ కేర్ కంపెనీ అరవింద్ ఎప్పుడు ప్రారంభించాడు? దీని వెనక పద్మ హస్తం ఏమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. శశాంక్ గోయల్ పాత్రపైనా విచారించాల్సిందే.. ఐఎంఎస్ కుంభకోణంలో కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్ పాత్రపైనా విచారణ జరపాలని సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ 2018, 2019లో రెండుసార్లు విజిలెన్స్ విచారణ జరిపి నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు చేపట్టలేదో తెలపాలన్నారు. ఆ రెండు నివేదికలను తొక్కిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మాజీ డైరెక్టర్ దేవికారాణి విషయంలో ఆయన ఉదాసీనంగా వ్యవహరిస్తూ కేవలం లేఖలతో సరిపెట్టారని మండిపడ్డారు. కానీ, మాజీ జేడీ పద్మ విషయంలో మాత్రం అక్రమాలు జరిగాయంటూ ఏసీబీకి లేఖ రాయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. -
ఈఎస్ఐ స్కాంలో మరో ముగ్గురి అరెస్ట్
-
వెంకటేశ్వర హెల్త్ కేర్ ఎండీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్‌లు పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈఎస్ఐకి చెందిన ఇన్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ అరవింద్ రెడ్డి, కె.రామిరెడ్డి, కె. లిఖిత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్వర హెల్త్‌కేర్ ఎండీగా కొనసాగుతున్న అరవింద్ రెడ్డి ఈఎస్ఐకి పరికరాలు సరఫరా చేసినట్లు డబ్బులు కాజేశారు. జాయింట్ డైరెక్టర్ పద్మతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారు. 2013 నుంచి అరవింద్ రెడ్డి ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ఇప్పటివరకూ అరెస్ట్‌ల సంఖ్య 13కు చేరింది. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఈఎస్ఐ కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గడిచిన నాలుగేళ్ళలో రూ. 1000 కోట్ల మేర మందుల కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఏటా సుమారు రూ. 250కోట్ల మందులు కొనుగోలు చేసినట్లుగా ఆధారాలను సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 డిస్పెన్సరీల వద్ద తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం దర్యాప్తులో భాగంగా.. పలు మెడికల్ ఏజెన్సీ కార్యాలయాల్లో కూడా ఇప్పటికీ సోదాలు చేస్తున్నారు. -
గ్యాంగ్ లీడర్ నాగలక్ష్మి.. రూ.50 కోట్లు స్వాహా!
సాక్షి,హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్)లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ఈ కేసులో నాచారం ఫార్మాసిస్ట్ నాగలక్ష్మిని అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు ఆదివారం తెలిపారు. నాచారం డిస్పెన్సరీలో గ్రేడ్–2 ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్న కొడాలి నాగలక్ష్మి ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణికి కీలకమైన వ్యక్తి. ఇండెంట్లను ట్యాంపరింగ్ చేయడంలో ఈమె దిట్ట. దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ కలకుంట పద్మ సూచన మేరకు లైఫ్‌కేర్ డ్రగ్స్ అండ్ ఫార్మా ఎండీ సుధాకర్‌రెడ్డితో కుమ్మక్కై మందుల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడినట్లు ఏసీబీ ఆధారాలు సంపాదించింది. వీరి కారణంగా ఐఎంఎస్‌కు రూ.9.28 కోట్ల నష్టం వాటిల్లిందని తేల్చింది. ఈ వ్యవహారంలో 23 మందిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. అరెస్టయిన వారి సంఖ్య 10కి చేరింది. రాష్ట్రంలోని పలు డిస్పెన్సరీల ఫార్మాసిస్టులకు గ్యాంగ్‌లీడర్ నాగలక్ష్మి అనే ఆరోపణలున్నాయి. దేవికారాణికి సన్నిహితురాలు.. నాగలక్ష్మిని నాచారం నుంచి సనత్‌నగర్‌లో సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు హెడ్‌గా దేవికారాణి నియమించింది. సీనియర్లు ఉన్నా నాగలక్ష్మీని ఏరికోరి తీసుకువచ్చి పెట్టారు. డ్రగ్‌స్టోర్‌లో ఆమె ఎంత చెబితే అంత. అక్కడ సీసీ కెమెరాలను నాగలక్ష్మినే ఏర్పాటు చేయించింది. ఏసీబీ దర్యాప్తు ప్రారంభించగానే సీసీ కెమెరాలను, హార్డ్ డిస్కులను హడావిడిగా తీయించేసింది. నాగలక్ష్మికి 5 నకిలీ మందుల కంపెనీలు కూడా ఉన్నాయి. అవన్నీ పేపర్ల మీదే ఉంటాయి. వీటి ద్వారా వచ్చే బిల్లులను దేవికారాణికి పంపుతూ సొమ్ము చేసుకునేవారు. నాగలక్ష్మి అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బులతో రూ.50 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఐఎంఎస్‌కు చెందిన వివిధ డిస్పెన్సరీల్లో ఫార్మాసిస్టుగా పనిచేసే వడ్డెం రేణుక, వి.లావణ్య, కె.వసంత ఇందిరా, నూన్సావత్ గాయత్రీబాయి, కుంచం కరుణ సహకరించారు. ఏసీబీ అదుపులో సుదర్శన్‌రెడ్డి..? ఈ కుంభకోణంలో ఓ ఫార్మా కంపెనీ యజమాని సుదర్శన్‌రెడ్డిని ఏసీబీ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో బాలానగర్‌లోని అతని కంపెనీలో దాడులు నిర్వహించారు. ఎలా చేస్తుందంటే..? దేవికారాణి చెప్పినట్లుగా నాగలక్ష్మి చేసేది. మెడికల్ క్యాంపుల్లో సరఫరా చేయాల్సిన ఇండెంట్‌ను వారికి అనుకూలంగా మార్చి పంపడంలో ఈమె సిద్ధహస్తురాలు. రాష్ట్రంలోని వివిధ డిస్పెన్సరీల నుంచి గత నాలుగేళ్లుగా వెళ్లిన మందులను పరిశీలించిన ఏసీబీ ఇదే విషయాన్ని గుర్తించింది. పలుచోట్ల మార్చిన అంకెలను, మార్చిన ఇంకుల్లో వ్యత్యాసాలను అధికారులు పట్టుకోగలిగారు. ఇలా పెంచిన బిల్లులను దేవికారాణికి పంపడం.. వాటికి ఆమోదం రావడం.. ఫార్మా కంపెనీకి చెల్లింపులు.. వీరికి కమీషన్ రావడం.. చకచకా జరిగిపోయేవి. -
ఈఎస్ఐ కుంభకోణంలో మరొకరి అరెస్ట్
-
ఈఎస్ఐ కుంభకోణం, నాగలక్ష్మి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ కుంభకోణంలో మరొకరిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదివారం అరెస్ట్ చేసింది. ఫార్మా కంపెనీ ఎండీ సుధాకర్‌రెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్‌గా పని చేస్తున్న నాగలక్ష్మిని అరెస్ట్ చేశారు. ఎనిమిదిన్నర కోట్ల రూపాయల మందుల కొనుగోలు వ్యవహారంలో ఆమె పాత్ర ఉందని తెలుస్తోంది. ఫార్మా కంపెనీ ఎండీ సుధాకర్, నాగలక్ష్మి కలిసి పెద్దమొత్తంలో అక్రమాలకు చేసినట్లుగా ఏసీబీ గుర్తించింది. నాగలక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ అరెస్ట్‌తో ఇప్పటి వరకూ ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయిన వారి సంఖ్య 10కి చేరింది. లైఫ్ కేర్ డ్రగ్స్ ఎండీ సుధాకర్‌రెడ్డిని అవినీతి ఆరోపణతో పాటు కుంభకోణంలో ఇతరులతో కుమ్మక్కయ్యారనే అభియోగాలతో శనివారం ఏసీబీ అరెస్ట్ చేసింది. డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఇతర అధికారులతో కలిసి కుట్ర పన్ని తమ సంస్థకు రూ.8.25 కోట్ల మందుల కొనుగోలు ఆర్డర్‌ను సుధాకర్‌రెడ్డి సంపాదించారని ఏసీబీ పేర్కొంది. -
ఈఎస్ఐ స్కాంలో ఫార్మా కంపెనీ ఎండీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ కుంభకోణంలో మరొకరిని ఏసీబీ అరెస్ట్ చేసింది. శనివారం లైఫ్ కేర్ డ్రగ్స్ ఎండీ బద్దం సుధాకర్‌రెడ్డిని అవినీతి ఆరోపణలతోపాటు కుంభకోణంలో ఇతరులతో కుమ్మక్కయ్యారనే అభియోగాలతో అరెస్ట్ చేసినట్టు, జ్యుడీషియల్ కస్టడీ కోసం ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరచనున్నట్టు ఏసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఇతర అధికారులతో కలిసి కుట్ర పన్ని తమ సంస్థకు రూ. 8.25 కోట్ల మందుల కొనుగోలు ఆర్డర్‌ను సుధాకర్‌రెడ్డి సంపాదించారని ఆ ప్రకటనలో ఏసీబీ పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలతో ఈ మందులు కొనుగోలు చేశారని తెలిపింది. ఈ అరెస్ట్‌తో ఇప్పటి వరకు ఈ కుంభకోణంలో అరెస్టయిన వారి సంఖ్య 9కి చేరింది. -
ఈఎస్ఐ స్కాం; వెలుగులోకి కీలక అంశాలు!
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దర్యాప్తులో మరో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గడిచిన నాలుగేళ్ళలో రూ. 1000 కోట్ల మేర మందుల కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఏటా సుమారు రూ. 250కోట్ల మందులు కొనుగోలు చేసినట్లుగా ఆధారాలను సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 డిస్పెన్సరీల వద్ద తనిఖీలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం దర్యాప్తులో భాగంగా.. పలు మెడికల్ ఏజెన్సీ కార్యాలయాల్లో కూడా ఇప్పటికీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ స్కాంలో మొత్తం 8 మందిని అరెస్టు చేయగా, పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక దర్యాప్తులో భాగంగా బుధవారం ఓమ్ని మెడి ఉద్యోగి నాగరాజుల ఇంట్లో రూ. 46 కోట్ల నకిలీ ఇండెంట్లు దొరకడంతో అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. దొరికిన నకీలి ఇండెట్లపై పలువురు ఈఎస్ఐ ఉద్యోగుల సంతకాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ప్రైవేటు వ్యక్తుల ఇళ్లతో పాటు పలు అధికారుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించి ఈ రోజు లేదా రేపు మరికొంత మంది అరెస్టుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. -
నాగరాజుకే ఎక్కువగా వణికిపోయేవారు....
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్ ) కుంభకోణంలో నాగరాజు లీలలు క్రమంగా వెలుగుచూస్తున్నాయి. ఐఎంఎస్ కుంభకోణంలో నాగరాజు పాత్రపై బుధవారం ‘అవినీతిలో పోటీపడ్డారు’అనే పేరుతో సాక్షి ప్రచురించిన కథనంపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. అతని ఇంటిపై బుధవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిగిన తనిఖీల్లో రూ.46 కోట్ల విలువైన ఒరిజినల్ పర్చేజ్ ఆర్డర్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఐఎంఎస్ డైరెక్టరేట్‌లో ఉండాల్సిన పత్రాలు ప్రైవేటు వ్యక్తి ఇంట్లో ఉండటంపై అధికారులే విస్తుపోయారని తెలిసింది. ఇప్పటికే నాగరాజును అరెస్టు చేసిన ఏసీబీ రిమాండుకు పంపిన విషయం తెలిసిందే. దేవికారాణి డైరెక్టర్‌గా చార్జ్ తీసుకున్నాక నాగరాజే డైరెక్టరేట్‌లో చక్రం తిప్పాడని, అతడే సూడో డైరెక్టర్‌గా వ్యవహరించిన వైనం బయటపడింది. నాగరాజు ఎంత చెబితే అంత! ఐఎంఎస్‌లో నాగరాజు వ్యవహారాలు నడపడం ఇదే కొత్తకాదు. దేవికారాణి రాక ముందు అంతకు ముందున్న డైరెక్టర్లతోనూ చాలా తతంగాలు నడిపాడు. దేవికారాణి డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాక ఐఎంఎస్ డైరెక్టరేట్ పేషీలో అతని ఆగడాలు శృతిమించాయి. అతను వచ్చాడంటే తన చాంబర్లో ఎంత బిజీ మీటింగ్‌లో ఉన్నా దేవికారాణి అందరినీ పంపించేసేది. ఆఫీసులో తయారు చేయాల్సిన మెడిసిన్స్ ఇండెంట్‌ను ఇంటి వద్దే నాగరాజు తయారు చేసుకుని వచ్చేవాడు. నాగరాజు చెబితే ఏకబిగిన పదుల సంఖ్యలో ఇండెంట్లపై దేవికారాణి సంతకాలు చేసేది. మందుల ధరలు, కొనుగోలు చేయాల్సిన కిట్లు, యంత్రాలు మొత్తం తానే నిర్ణయించేవాడు. అతనికి పేషీలో ఎంత ప్రాధాన్యం ఉండేదంటే.. తనకు నచ్చిన అధికారి సీట్లో కూర్చుని కంప్యూటర్లపై వీడియో గేములు ఆడేవాడని సిబ్బంది గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏ సెక్షన్లో ఇతని ఫైల్ ఆలస్యమైనా సరే.. ఆ బాధ్యతలు చూసే ఉద్యోగిని అక్కడ నుంచి మరో సెక్షన్‌ను ఆగమేఘాల మీద మార్పించేవాడు. సిబ్బంది మాటల్లో చెప్పాలంటే.. దేవికారాణి కంటే నాగరాజుకే ఎక్కువగా వణికిపోయేవారు. నాగరాజు ఆగడాలపై సమాచారం అందుకున్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శశాంక్ గోయల్ ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణిని హెచ్చరించడంతో మే నెల నుంచి పేషీకి రావడం కాస్త తగ్గించాడు. దీంతో సంతకాలన్నీ కారులోనే తీసుకునేవాడని సమాచారం. ఏపీలోనూ ఇతనిదే హవా! నాగరాజు కమీషన్ దందా కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. ఇతడిచ్చే కమీషన్లకు ఆశపడి అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీగా మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల తిరుపతి, విజయవాడల్లోనూ ఏపీ విజిలెన్స్ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఇతని అక్రమాలు విస్తరించాయని, దర్యాప్తు చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగుచూస్తాయని సిబ్బంది చెబుతున్నారు. కంపెనీలన్నీ అతని వెనకాలే..! గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన నాగరాజు పూర్తిపేరు సీహెచ్ శివ నాగరాజు. మెడికల్ రిప్ర జెంటేటివ్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. అధికారులకు విలువైన బహుమతులు, పార్టీలు ఇచ్చి మచ్చిక చేసుకునేవాడు. తర్వాత అధిక ధరలకు ఇండెంట్లు పెట్టుకుని వారికి రూ.లక్షల కమీషన్లు వచ్చేలా స్కెచ్ గీసేవాడు. దీంతో ఇతని ద్వారా మందుల కొనుగోలుకు అధికారులు, రిజిస్టర్డ్, నాన్ రిజిస్టర్డ్ కంపెనీలు ఆసక్తి కనబరిచేవి. 42 కంపెనీలకు ఇతనే అధికారిక రిప్రజెంటేటివ్‌గా మారాడంటే అతని హవా ఎలా నడిచిందో చెప్ప వచ్చు. దేవికారాణి అక్రమాలపై విజిలెన్స్ నివేదిక ఇవ్వగానే అప్రమత్తమయ్యాడు. దేవికా రాణి, జాయింట్ డైరెక్టర్ పద్మల మధ్య రాజీ కుదర్చడంలో సఫలీకృతమయ్యాడు. -
దేవికారాణి, పద్మల మధ్య రాజీకి నాగరాజు యత్నం!
సాక్షి, హైదరాబాద్: తిలాపాపం.. తలా పిడికెడు అన్నట్లుగా ఈఎస్ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో నిందితులంతా పోటాపోటీగా అవినీతికి పాల్పడ్డారు. మందుల కొనుగోళ్లలో ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మలు ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరించారు. అసలేం జరిగిందంటే.. 2015లో దేవికారాణి బాధ్యతలు చేపట్టేనాటికే అక్కడ జాయింట్ డైరెక్టర్‌గా పద్మ విధులు నిర్వహిస్తున్నారు. ఐఎంఎస్‌కు మందులు సరఫరా చేసే పలు రిజిస్టర్ కంపెనీలతో ఆమె ముందే కుదుర్చుకున్న అవగాహన తెలుసుకున్న దేవికారాణి తానేం తక్కువ తిన్నానా అని నాన్ రిజిస్టర్డ్ కంపెనీలపై కన్నేశారు. అత్యవసర సమయాల్లో నాన్ రిజిస్టర్ కంపెనీల నుంచి మందులు కొనుగోలు చేయవచ్చన్న చిన్న వెసులుబాటును ఆసరాగా చేసుకుని దేవికారాణి సొంతంగా వ్యవహారం నడిపారు. ఇందుకోసం పలు రకాల కంపెనీలను కూడా అప్పటికప్పుడు సృష్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2018లోనే విజిలెన్స్ విచారణ.. వాస్తవానికి డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆకాశరామన్న ఉత్తరాలతో 2018 నవంబర్లోనే అవినీతి విషయం విజిలెన్స్‌కు చేరింది. ఈ విషయంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని విజిలెన్స్ 2019 ఫిబ్రవరిలోనే నివేదిక ఇచి్చంది. అయినా ఈ విషయం బయటకు పొక్కనీయలేదు. ఈ విషయంపై పలుమార్లు ముఖ్య కార్యదర్శి శశాంక్ గోయల్ హెచ్చరించినా దేవికారాణి పట్టించుకోలేదు. ఓమ్నీ, అవేంటార్, లెజెండ్ కంపెనీల నుంచి రూ.20 కోట్లకు పైగా అధిక ధరలకు చెల్లించి కొనుగోలు చేసిన విషయంపై శశాంక్ గోయల్ తీవ్రంగా పరిగణిస్తూ లేఖ రాయడంతో దేవికారాణిలో కాస్త చలనం వచి్చంది. తెలంగాణ స్టేట్ మెడికల్ సరీ్వసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ధరల కంటే మీకు ఎక్కువ చెల్లించామని, అధిక మొత్తాన్ని వెంటనే తిరిగిచ్చేయాలని ఓమ్నీ, అవేంటార్, లెజెండ్ కంపెనీలకు దేవికారాణి విడివిడిగా లేఖలు రాశారు. దీనిపై ఆ కంపెనీ లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తాము ముందు గా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ధర నిర్ధారించామని, తీసుకున్న డబ్బును వెనక్కిచ్చేది లేదని కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నాయి. చక్రం తిప్పడంలో నాగరాజు కీలకం.. వీరిద్దరి అవినీతిలో మెడికల్ రిప్రజెంటేటివ్ నాగరాజు పాత్ర చాలా కీలకం. ఐఎంఎస్‌లో కొన్నేళ్లుగా చిన్న మందుబిళ్లల కొనుగోళ్లలో ఇతనే ఆధారం. ఐఎంఎస్‌కు మందులు సరఫరా చేసే ఓమ్నీ, అవేంటార్, లెజెండ్ కంపెనీలతోపాటు ఏకంగా 42 కంపెనీలకు ఇతనే రిప్రజెంటేటివ్ అంటే ఐఎంఎస్‌లో ఇతను ఏ స్థాయిలో చక్రం తిప్పాడో అర్థం చేసుకోవచ్చు. ముందు నుంచి జాయింట్ డైరెక్టర్ పద్మతో అధిక ధరలకు కోట్ చేసుకుంటున్న నాగరాజు.. తర్వాత డైరెక్టర్ దేవికారాణినీ కుంభకోణంలో భాగస్వామిని చేశాడు. వాళ్లిద్దరూ ఒకరిపై ఒకరు ఏసీబీ, విజిలెన్స్‌కు ఉత్తరాలు రాయడం, విజిలెన్స్ నివేదికలో అక్రమాలు నిజమే అని నిర్ధారణ జరగడంతో నాగరాజు రంగప్రవేశం చేశాడు. విషయం బయటికి పొక్కకపోవడంతో వీరిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేశాడు. అతడి ముందు రాజీకి అంగీకరించినా.. తర్వాత వీరి తీరులో మార్పురాకపోవడంతో విషయం కార్మిక సంఘాలు, ఏసీబీ వరకు వెళ్లింది. నాగరాజు కేవలం తెలంగాణకే కాదు, ఏపీలోనూ ఇవే కంపెనీలకు ప్రతినిధిగా ఉండటం గమనార్హం. -
ఐఎంఎస్ స్కాంలో మరొకరు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్)లో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు కీలక వ్యక్తులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. సోమవారం ముదిమెల సురేంద్రనాథ్ బాబును అరెస్టు చేశారు. తొలి నుంచి ఈ కేసులో డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మల తర్వాత వెలుగులోకి వచి్చన పేరు సీనియర్ అసిస్టెంట్ సురేంద్రనాథ్‌దే. సురేంద్రనాథ్‌ని అరెస్టు చేస్తామని ఆదివారం ఉదయమే ఏసీబీ అధికారులు ప్రకటించారు. గతంలో పఠాన్‌చెరుకు చెందిన ఇన్చార్జ్ మెడికల్ ఆఫీసర్‌కు ఫోన్ చేసి ఖాళీ బిల్లులపై సంతకాలు చేయాలని బెదిరించిన కేసులో పోలీసులు వీరిపై ఐపీసీ 120–బీ, 109 ఆర్/డబ్ల్యూ, 34, 12, 13లలో పలు ఉప సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ బెదిరింపుల ఘటనకు సంబంధించి ఆడియో టేపులు మీడియాకు లీకైన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా.. ఈ కేసులో ఏ–1గా ఉన్న ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మలకు రామచంద్రాపురం డిస్పెన్సరీలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సురేంద్రనాథ్ బాబే ఈ స్కాంలో కీలకం గా వ్యవహరించాడు. వీరి వ్యవహారాలన్నీ అతడే చక్కబెడుతుండేవాడు. నకిలీ ఇండెంట్లు, వాటిపై ఫార్మాసిస్టులు, వైద్యుల సంతకాలు పెట్టించడంలో చురుగ్గా వ్యవహరించేవాడు. దీంతో సురేంద్రని నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర కార్యాలయంలో విధుల్లోకి ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి తీసుకొచ్చారు. వాస్తవానికి అలా చేయాలంటే డిప్యుటేషన్, బదిలీ అయినా జరగాలి. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.. ఏకంగా డైరెక్టర్ అతన్ని ఇక్కడి కి రప్పించడంతో ఈ వ్యవహారం తెలిసినా ఎవరూ కిమ్మనలేదు. ఇటు సురేంద్రనాథ్ ఐఎంఎస్ కార్యాలయానికి వచ్చాక నకిలీ, ఖాళీ, ముందు తేదీలతో వేసిన బిల్లులపై సంతకాలు చేయాలని పలు డిస్పెన్సరీలకు చెందిన వైద్యులు, ఫార్మాసిస్టులను బెదిరించాడు. ఇటీవల ఆ ఆడియో టేపులు బయటికొచ్చాయి. ఈఎస్ఐలో వెలుగుచూసిన భారీ కుంభకోణంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల ని సీపీఎం హైదరాబాద్ నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ కుంభకోణంలో లోతుగా దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. -
ఐఎంఎస్ స్కాం.. రంగంలోకి ఇంటెలిజెన్స్
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సరీ్వసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. ‘ఎవరా ఐఏఎస్ అధికారి?’అంటూ ఆదివారం ‘సాక్షి’ప్రచురించిన కథనానికి సీఎంవో నుంచి స్పందన వచి్చంది. ఈ కేసులో ఇప్పటికే ఆధారాల కోసం అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) గాలిస్తుండగానే.. ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఐఏఎస్ నుంచి అటెండర్ దాకా అందరిపైనా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ వ్యవహారంపై ఇటీవల సీఎం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ, కోట్ల రూపాయల కుంభకోణంలో సాక్షాత్తూ సీఎం ఇంటిపేరును వాడుకోవడం చర్చనీయాంశమైంది. ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’అన్నట్లుగా వారు చేసే అక్రమాలకు జాయింట్ డైరెక్టర్ కల్వకుంట్ల పద్మ తనకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బంధువు అని పలువురిని బెదిరించడం గమనార్హం. సీఎం ఇంటిపేరు వాడుకున్న విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అధికారులను ఆరాతీసినట్లు సమాచారం. తనిఖీల రోజు ఎవరెవరు లీవ్? విజిలెన్స్ తనిఖీలు జరిగిన తేదీల్లో ఈ కుంభకోణంతో సంబంధమున్న ఉద్యోగుల్లో ఎవరెవరు సెలవుపై వెళ్లారన్న వివరాలను ఇంటెలిజెన్స్ అధికారులు సేకరిస్తున్నారు. నిందితుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలపైనా రహస్యంగా ఆరా తీస్తున్నారు. బిల్లులు మంజూరైన తేదీల్లో ఎవరెవరి ఖాతాల్లో డబ్బులు అధికంగా వచ్చి చేరాయి? విదేశాలకు ఏమైనా డబ్బులు తరలించారా? మెడికల్ కంపెనీలు సమరి్పంచిన చిరునామాల్లో సదరు కంపెనీలు ఉన్నాయా? లేవా? అనే విషయాలపైనా కూపీ లాగుతున్నారని సమాచారం. మందుల సరఫరాలో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు? నగదు విషయాలు ఎవరు చూసుకునేవారు? వాటాలు ఎలా పంచేవారు? అనే విషయాలపై కీలక సమాచారం సేకరించారని తెలుస్తోంది. కాగా, ఈవ్యవహారం కార్మికసంస్థ సోమవారం గోల్కొండ క్రాస్రోడ్స్లోలోని సీపీఎం కార్యాల యంలో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేయనుంది. -
కర్త, కర్మ, క్రియా దేవికా రాణినే..
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) అక్రమాలు ఒక్కోటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో విచారణ మొదలుపెట్టిన అవినీతి నిరోధకశాఖ రెండో రోజు దూకుడు పెంచింది. శుక్రవారం ఉదయం పోలీసులు ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మరోవైపు నిందితుల ఇళ్లలో సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దేవికారాణితోపాటు వరంగల్ జాయింట్ డైరెక్టర్ కె.పద్మ, అడిషనల్ డైరెక్టర్ వసంత ఇందిర, ఫార్మసిస్ట్ రాధిక, రిప్రజెంటేటివ్ శివ నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ హర్షవర్ధన్, ఆమ్ని మెడికల్‌కు చెందిన హరిబాబు అలియాస్ బాబ్జీలను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో ప్రశ్నించారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 455 (ఏ), 465, 468, 471, 420, 120–బీ 34 కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కుంభకోణానికి సంబంధించి 17మంది ఐఎంఎస్ ఉద్యోగులు, ఐదుగురు మెడికల్ కంపెనీల ప్రతినిదులు, ఓ టీవీ చానల్ రిపోర్టర్‌పై ఏసీబీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కర్త, కర్మ, క్రియా దేవికా రాణినే.. 2015 నుంచి 2019 వరకు ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి మందుల టెండర్లను పర్యవేక్షించారు. దాదాపు రూ. 200 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లలో గోల్మాల్ జరిగిందని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వ ఆదేశాలతో ఏసీబీ రంగంలోకి దిగింది. శుక్రవారం దేవికారాణిని విచారించిన ఏసీబీ అధికారులు పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ఆమెను సూత్రధారిగా గుర్తించారు. తన కొడుకు ద్వారా తేజ, ఆమ్ని కంపెనీలతో దేవిక కుమ్మక్కయ్యారు. చదవండి: ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణి అరెస్ట్ టెండర్లు లేకుండానే ఏకపక్షంగా అర్హతలేని మందుల కంపెనీలకు సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అలా నకిలీ బిల్లులతో కోట్లాది రూపాయలను జేబులో వేసుకున్నారని, మందుల సరఫరా టెంటర్లలో స్వార్ధపూరితంగా, స్వప్రయోజనాలకే అధిక ప్రాధాన్యమిచ్చారని ఏసీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పటాన్చెరు, బోరబండ, బాచుపల్లి, చర్లపల్లి, బొల్లారం, వరంగల్ డిస్పెన్సరీలకు పంపిన మందుల్లో అనేక అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. వాటిలో చాలామటుకు నకిలీ బిల్లులుగా తేల్చింది. గురువారం దాదాపు రూ. 12 కోట్ల వరకు తప్పుడు ఇన్వాయిస్లను గుర్తించిన ఏసీబీ... శుక్రవారం షేక్‌పేటలోని దేవికారాణి ఇంటి నుంచి కీలక పత్రాలు, ఎల్రక్టానిక్ వస్తువులను స్వా«దీనం చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారిపైనా అభియోగాలు.. ఈ వ్యవహారంలో ఏసీబీ సరిగా దర్యాప్తు జరపడం లేదని ఈఎస్ఐ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నాలుగేళ్లలో దాదాపుగా రూ. 700 కోట్ల మేరకు కొనుగోళ్లు జరిగాయని, వాటికి సంబంధించిన మొత్తం ప్రక్రియను ఏసీబీ క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతున్నాయి. కేవలం రూ. 12 కోట్ల మేరకే అక్రమాలు జరిగాయంటూ కుంభకోణం తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబడుతున్నాయి. దేవికారాణి సూత్రధారి కాదని, ఆమె వెనకాల ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఉన్నారని, మందుల సరఫరాకు అడ్డగోలుగా అనుమతిచి్చన మందుల కంపెనీల్లో సగం ఆయనవేనని ఆరోపిస్తున్నాయి. మెడికల్ ఏజెంట్ సుధాకర్‌రెడ్డి వారిద్దరి సంధానకర్తగా వ్యవహరించారని తెలిపారు. మాజీ మంత్రి బంధువు పాత్రపైనా ఈ వ్యవహారంలో విచారించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈఎస్ఐ కారి్మక సంఘానికి నాయకుడిగా ఉన్న ఆయన పేరును దేవికారాణి ఏసీబీ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో ఆరోపణలు వచి్చన అందరి పాత్రపైనా దర్యాప్తు జరుపుతామని ఏసీబీ అధికారులు వివరణ ఇచ్చారు. విభేదాలతోనే బయటికి.. ఈ మొత్తం వ్యవహారంలో ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మల మధ్య తలెత్తిన విభేదాలే కుంభకోణాన్ని వెలికితీశాయి. దీంతో ఆకాశరామన్న ఉత్తరాలతో దేవికారాణిపై పద్మ వర్గం విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసింది. ప్రతిగా దేవికారాణి పద్మపై ఏసీబీకి ఉత్తరాలు రాయించింది. విచారణ చేపట్టిన విజిలెన్స్... దేవికారాణితోపాటు పద్మ ఆధ్వర్యంలో జరిగిన కొనుగోళ్లలోనూ అవతవకలు ఉన్నాయని గుర్తించింది. రిమాండ్‌లో సంచలన విషయాలు.. మందుల కొనుగోళ్ల అక్రమాలపై ఇప్పటికే ఏసీబీ రిమాండ్ రిపోర్టు రూపొందించింది. మొత్తం 44 పేజీల రిపోర్ట్‌లో దేవికారాణి ఎలా అవతవకలకు పాల్పడింది? ఏయే డిస్పెన్సరీలకు ఎన్ని మందులు సరఫరా చేసింది? ఎలాంటి వ్యాధులకు మందులు పంపారు? ఏయే మెడికల్ కంపెనీలను ఎంచుకున్నారు? వాటిని ఎంతకు కోట్ చేశారు? వంటి విషయాలన్నీ పొందుపరిచినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో మరిన్ని వ్యవహారాలు దాగి ఉన్నాయని ఏసీబీ కూడా అనుమానిస్తోంది. ఈ మొత్తం వ్యవహరంలో ఆమ్ని మెడి, అవెంటార్, లెజెంట్ కంపెనీలకు అత్యధికంగా చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు. ముఖ్యమంత్రి సీరియస్.. ఐఎంఎస్‌లో కుంభకోణంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారని తెలిసింది. ఈ స్కాంలో ఎవరు ఉన్నా వదలవద్దని, ఆరోపణలు వచ్చిన అందరిపైనా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన ఏసీబీని ఆదేశించారని సమాచారం. కాగా, ఉన్నతాధికారుల అరెస్టు నేపథ్యంలో ముషీరాబాద్‌లోని బీమా వైద్య సేవల విభాగం డైరెక్టరేట్ (డీఐఎంఎస్) కార్యాలయానికి రోజువారీగా వచ్చే సందర్శకులు, ఫిర్యాదుదారులను అనుమతించట్లేదు. ముందుగా సెక్యూరిటీ వద్ద విషయాన్ని ప్రస్తావించి సంబంధిత సెక్షన్ ఆమోదం పొందితే తప్ప ప్రవేశాన్ని కల్పించట్లేదు. -
ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. షేక్‌పేటలోని తన నివాసం నుంచి ఆమెను బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో దేవికా రాణి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయంలో తెలిసిందే. దీంతో నిన్నంతా దేవికా రాణి కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 17మంది ఉద్యోగులు, నలుగురు ప్రయివేట్ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నకిలీ బిల్లులు సృష్టించి, అవసరం లేకున్నా మందులు కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఏసీబీ, సుమారు రూ.10 కోట్ల వరకూ కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా తేల్చింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్లోనూ ఇంకా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో దేవికా రాణితో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఫార్మసిస్ట్ రాధిక, ఈఎస్ఐ ఉద్యోగి నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ హర్షవర్థన్, ఎండీ శ్రీహరిని అరెస్ట్ చేసి, ఈఎస్ఐ సిబ్బందిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇవాళ మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అలాగే 23 ప్రదేశాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు, బంగారాన్ని సీజ్ చేశారు. మరోవైపు దేవికా రాణి ఇంట్లో రెండు సూట్‌కేసులు, రెండు బ్యాగుల డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈఎస్ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎమ్ఎస్) విభాగంలోని అవీనీతి పుట్ట బద్దలయింది. అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు ఐఎమ్ఎస్ విభాగానికి చెందిన 23 మంది ఉద్యోగుల ఇళ్లపై నిన్న (గురువారం) ఏకకాలంలో దాడులు జరిపింది. దాదాపు రూ.12 కోట్ల నకిలీ బిల్లలుకు సంబంధించి కీలకమైన ఆధారాలు సంపాదించింది. దేవికా రాణిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలింపు నేపథ్యం ఏంటి? ఐఎమ్ఎస్ విభాగంలో మందుల కొనుగోళ్లలో నిబంధనలు తుంగలో తొక్కారని, భారీగా అక్రమాలు జరిగాయని, కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. ఐఎమ్ఎస్ ఉద్యోగులు, మెడికల్ ఏజెన్సీలు టెండర్లు లేకుండా నకిలీ బిల్లులతో కోట్లాది రూపాయలు దిగమింగారని ఫిర్యాదులు వెల్లువెతాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిజానిజాలను తేల్చాని ఈఎస్ఐ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్ ఏసీబీకి లేఖ రాసారు. ఈ మేరకు ఈ కేసును ఏసీబీ స్వీకరించింది. ముందుగా విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. పలు రికార్డులను, కొనుగోళ్లను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు అక్రమాలను ధ్రువీకరిస్తూ ఏసీబీకి నివేదిక అందజేసారు. దేవిక రాణి నివాసంలో ఏసీబీ తనిఖీలు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంగా ఐఎమ్ఎస్ అధికారుల ఇళ్లపై దాడులు చేసారు. ఈ విభాగానికి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఆమ్నీ మెడికల్ ఎండీ శ్రీధర్, నాగరాజు, తేజ్ ఫార్మాకు చెందిన సుధాకర్‌రెడ్డి, వీ–6 చానల్ రిపోర్టర్ నరేందర్‌రెడ్డితోపాటు పలువురు ఉద్యోగులు కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ బిల్లులు, తప్పుడు రికార్డులతో టెండర్లు లేకుండా మందులకు ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది. షేక్‌పేటలోని దేవికా రాణి నివాసం ఏసీబీ అధికారులు ఏమంటున్నారు ఐఎమ్ఎస్ జాయింట్ డైరెక్టర్ డా.కె.పద్మ 2018 మే 26, 28వ తేదీల్లో రూ.1.03 కోట్ల నకిలీ బిల్లులను రూపొందించారు. వీటిని పటాన్చెరు, బోరబండ ఇన్‌ఛార్జి మెడికల్ ఆఫీసర్ల సాయంతో ఈ బిల్లులు క్లెయిమ్ చేశారు.అదే నెలలో బొంతపల్లి, బొల్లారం డిస్పెన్సరీలకు రూ.1.22 కోట్ల నకిలీ బిల్లులు తయారు చేసి మందులను మాత్రం పంపకుండా డబ్బులు జేబులో వేసుకున్నారు. ఐఎమ్ఎస్ డైరెక్టర్ దేవికారాణి ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివింది. అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇందిరతో కలిసి ఏకంగా రూ.9.43 కోట్లను బిల్లులపేరిట 2017–18 ఆర్థిక సంవత్సరంలో స్వాహా చేశారు. మొత్తంగా మందుల కోనుగోళ్ల పేరిట రూ.11.69 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఐఎమ్ఎస్ సిబ్బందితోపాటు పలువురు ప్రైవేటు మెడికల్ ఏజెన్సీల ఉద్యోగులు కూడా పాలుపంచుకున్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్ శివ, తేజ ఫార్మా ఏజెంట్ సుధాకర్‌రెడ్డి, ఆమ్నీ మెడిసిన్స్కు చెందిన శ్రీహరి, వీ–6 చానల్ రిపోర్టర్ నరేందర్‌రెడ్డి ఇళ్లపైనా దాడులు జరిగాయి. ఈ విషయంలో మరింత లోతుగా విచారణ జరిపితే...మరిన్నిఅ క్రమాలు వస్తాయని ఈఎస్ఐ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
తరలిపోయిన ఈఎస్ఐ ఆసుపత్రి
అమీర్‌పేట, న్యూస్‌లైన్: సనత్‌నగర్ కార్మిక బీమా వైద్యశాల (ఈఎస్ఐ) నాచారం ప్రాంతానికి తరలిపోయింది.ప్రస్తుతం ఇక్కడి ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మంగళవారం నుంచి నాచారంలో విధులు నిర్వహించాలని అధికారికంగా సోమవారం ఆదేశాలు జారీచేశారు. కార్మికశాఖ నుంచి శనివారం అధికారికంగా ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఆసుపత్రిని తరలించిన పక్షంలో అందరు ఉద్యోగులను ఒకేచోటికి మార్చాలని యూనియన్ నాయకులు, వైద్యులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో ఆసుపత్రి అధికారులు విషయాన్ని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డెరైక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగుల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని అందరినీ ఒకేచోటకు పంపుతున్నట్లు తెలిపి.. ఆగస్టు 29లోపు సిబ్బంది నాచారం ఆసుపత్రిలో విధులు నిర్వహించాలని ఆదేశించారు. సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో కొనసాగుతున్న దాదాపు 10 విభాగాల్లోని ఉద్యోగులు విభాగానికి ఇద్దరు చొప్పున 27 తేదీ నుంచి నాచారం వెళ్లి విధులు నిర్వర్తించాలని పేర్కొంటూ ఓ జాబితాను తయారుచేసి ఉద్యోగులకు అందచేశారు. కాగా ఉద్యోగుల ఒత్తిడి మేరకు ఉన్నతాధికారులు మిగిలిన సిబ్బంది తరలింపునకు నెలరోజులు గడువు ఇచ్చారు. డిస్పెన్సరీ స్థాయి నుంచి 500 పడకల ఆసుపత్రిగా.. సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రికి సు మారు 50 సంవత్సరాల చరిత్ర ఉంది. కేంద్ర కార్మికశాఖ రాష్ట్రంలోనే మొట్టమొదట 1965లో సనత్‌నగర్ ఈఎస్ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేసింది. అప్ప ట్లో ఇక్కడ కేవలం పదిమంది ఉద్యోగులు మాత్రమే పనిచేసేవారు. పరిశ్రమలు పెరగడంతో 30 పడకల ఆసుపత్రిగా మార్చారు. ప్రస్తుతం 500 పడకల ఆసుపత్రిగా ఎదిగింది. ఇక్కడ శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులతో కలి సి సుమారు 900 మందికి పైగా పనిచేస్తున్నారు. ఈ చారిత్రక ఆసుపత్రి మం గళవారం నుంచి ఈఎస్ఐ కార్పొరేషన్ టీచింగ్ ఆసుపత్రిగా కొనసాగనుంది.