దేవికారాణిని అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) అక్రమాలు ఒక్కోటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో విచారణ మొదలుపెట్టిన అవినీతి నిరోధకశాఖ రెండో రోజు దూకుడు పెంచింది. శుక్రవారం ఉదయం పోలీసులు ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మరోవైపు నిందితుల ఇళ్లలో సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దేవికారాణితోపాటు వరంగల్ జాయింట్ డైరెక్టర్ కె.పద్మ, అడిషనల్ డైరెక్టర్ వసంత ఇందిర, ఫార్మసిస్ట్ రాధిక, రిప్రజెంటేటివ్ శివ నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ హర్షవర్ధన్, ఆమ్ని మెడికల్‌కు చెందిన హరిబాబు అలియాస్ బాబ్జీలను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో ప్రశ్నించారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 455 (ఏ), 465, 468, 471, 420, 120–బీ 34 కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కుంభకోణానికి సంబంధించి 17మంది ఐఎంఎస్ ఉద్యోగులు, ఐదుగురు మెడికల్ కంపెనీల ప్రతినిదులు, ఓ టీవీ చానల్ రిపోర్టర్‌పై ఏసీబీ ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
కర్త, కర్మ, క్రియా దేవికా రాణినే..
2015 నుంచి 2019 వరకు ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి మందుల టెండర్లను పర్యవేక్షించారు. దాదాపు రూ. 200 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లలో గోల్‌మాల్ జరిగిందని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వ ఆదేశాలతో ఏసీబీ రంగంలోకి దిగింది. శుక్రవారం దేవికారాణిని విచారించిన ఏసీబీ అధికారులు పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ఆమెను సూత్రధారిగా గుర్తించారు. తన కొడుకు ద్వారా తేజ, ఆమ్ని కంపెనీలతో దేవిక కుమ్మక్కయ్యారు.
చదవండి: ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికా రాణి అరెస్ట్
టెండర్లు లేకుండానే ఏకపక్షంగా అర్హతలేని మందుల కంపెనీలకు సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అలా నకిలీ బిల్లులతో కోట్లాది రూపాయలను జేబులో వేసుకున్నారని, మందుల సరఫరా టెంటర్లలో స్వార్ధపూరితంగా, స్వప్రయోజనాలకే అధిక ప్రాధాన్యమిచ్చారని ఏసీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పటాన్‌చెరు, బోరబండ, బాచుపల్లి, చర్లపల్లి, బొల్లారం, వరంగల్ డిస్పెన్సరీలకు పంపిన మందుల్లో అనేక అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. వాటిలో చాలామటుకు నకిలీ బిల్లులుగా తేల్చింది. గురువారం దాదాపు రూ. 12 కోట్ల వరకు తప్పుడు ఇన్వాయిస్‌లను గుర్తించిన ఏసీబీ... శుక్రవారం షేక్‌పేటలోని దేవికారాణి ఇంటి నుంచి కీలక పత్రాలు, ఎల్రక్టానిక్ వస్తువులను స్వా«దీనం చేసుకుంది.
సీనియర్ ఐఏఎస్ అధికారిపైనా అభియోగాలు..
ఈ వ్యవహారంలో ఏసీబీ సరిగా దర్యాప్తు జరపడం లేదని ఈఎస్‌ఐ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నాలుగేళ్లలో దాదాపుగా రూ. 700 కోట్ల మేరకు కొనుగోళ్లు జరిగాయని, వాటికి సంబంధించిన మొత్తం ప్రక్రియను ఏసీబీ క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతున్నాయి. కేవలం రూ. 12 కోట్ల మేరకే అక్రమాలు జరిగాయంటూ కుంభకోణం తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబడుతున్నాయి.
దేవికారాణి సూత్రధారి కాదని, ఆమె వెనకాల ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఉన్నారని, మందుల సరఫరాకు అడ్డగోలుగా అనుమతిచి్చన మందుల కంపెనీల్లో సగం ఆయనవేనని ఆరోపిస్తున్నాయి. మెడికల్ ఏజెంట్ సుధాకర్‌రెడ్డి వారిద్దరి సంధానకర్తగా వ్యవహరించారని తెలిపారు. మాజీ మంత్రి బంధువు పాత్రపైనా ఈ వ్యవహారంలో విచారించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈఎస్‌ఐ కారి్మక సంఘానికి నాయకుడిగా ఉన్న ఆయన పేరును దేవికారాణి ఏసీబీ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో ఆరోపణలు వచి్చన అందరి పాత్రపైనా దర్యాప్తు జరుపుతామని ఏసీబీ అధికారులు వివరణ ఇచ్చారు.
విభేదాలతోనే బయటికి..
ఈ మొత్తం వ్యవహారంలో ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మల మధ్య తలెత్తిన విభేదాలే కుంభకోణాన్ని వెలికితీశాయి. దీంతో ఆకాశరామన్న ఉత్తరాలతో దేవికారాణిపై పద్మ వర్గం విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసింది. ప్రతిగా దేవికారాణి పద్మపై ఏసీబీకి ఉత్తరాలు రాయించింది. విచారణ చేపట్టిన విజిలెన్స్... దేవికారాణితోపాటు పద్మ ఆధ్వర్యంలో జరిగిన కొనుగోళ్లలోనూ అవతవకలు ఉన్నాయని గుర్తించింది.
రిమాండ్‌లో సంచలన విషయాలు..
మందుల కొనుగోళ్ల అక్రమాలపై ఇప్పటికే ఏసీబీ రిమాండ్ రిపోర్టు రూపొందించింది. మొత్తం 44 పేజీల రిపోర్ట్‌లో దేవికారాణి ఎలా అవతవకలకు పాల్పడింది? ఏయే డిస్పెన్సరీలకు ఎన్ని మందులు సరఫరా చేసింది? ఎలాంటి వ్యాధులకు మందులు పంపారు? ఏయే మెడికల్ కంపెనీలను ఎంచుకున్నారు? వాటిని ఎంతకు కోట్ చేశారు? వంటి విషయాలన్నీ పొందుపరిచినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో మరిన్ని వ్యవహారాలు దాగి ఉన్నాయని ఏసీబీ కూడా అనుమానిస్తోంది. ఈ మొత్తం వ్యవహరంలో ఆమ్ని మెడి, అవెంటార్, లెజెంట్ కంపెనీలకు అత్యధికంగా చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు.
ముఖ్యమంత్రి సీరియస్..
ఐఎంఎస్‌లో కుంభకోణంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారని తెలిసింది. ఈ స్కాంలో ఎవరు ఉన్నా వదలవద్దని, ఆరోపణలు వచ్చిన అందరిపైనా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన ఏసీబీని ఆదేశించారని సమాచారం. కాగా, ఉన్నతాధికారుల అరెస్టు నేపథ్యంలో ముషీరాబాద్‌లోని బీమా వైద్య సేవల విభాగం డైరెక్టరేట్ (డీఐఎంఎస్) కార్యాలయానికి రోజువారీగా వచ్చే సందర్శకులు, ఫిర్యాదుదారులను అనుమతించట్లేదు. ముందుగా సెక్యూరిటీ వద్ద విషయాన్ని ప్రస్తావించి సంబంధిత సెక్షన్ ఆమోదం పొందితే తప్ప ప్రవేశాన్ని కల్పించట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment