
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ స్కాంలో తెలంగాణలో దోషులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో.. ఏపీలో కూడా అలాంటి చర్యలే తీసుకోవాలని బీజేపీ జాతీయ మైనార్టీ నేత షేక్ బాజీ డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టే.. ఈఎస్‌ఐ స్కాం బయటపడిందన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ స్కాం మరుగున పడిపోయేదన్నారు. అచ్చెన్నాయుడు ప్రమేయంతోనే అవినీతి జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు.('అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం' )
అధిక ధరలకు మందులు,యంత్ర పరికరాలు ఎందుకు కొనుగోలు చేశారో సమాధానం చెప్పాలన్నారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో కూడా చంద్రబాబు పాత్రపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఈఎస్‌ఐ స్కాం లో వాటాలు వెళ్లే ఉంటాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈఎస్‌ఐ కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ చేపట్టాలని బాజీ కోరారు. (ఏపీ ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం)